సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యార్థులకు అంతర్జాతీయ విద్యావకాశాలు మరింత చేరవవుతున్నాయి. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి చేపట్టిన పలు కార్యక్రమాలు సాకారమవుతున్నాయి. ఇండో–యూరోపియన్ సింక్రనైజేషన్‌లో భాగంగా జర్మనీకి చెందిన పలు వర్సిటీలతో ఉన్నత విద్యామండలి వర్చువల్ సమావేశాలను నిర్వహించిన సంగతి తెలిసిందే.
జర్మనీ వర్సిటీల్లో అందించే పలు అత్యున్నత కోర్సులకు రాష్ట్ర విద్యార్థులను ఎంపిక చేయడం, పరస్పర మార్పిడి లాంటి కార్యక్రమాలపై ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే 400 ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీతో (ఏపీ ఐటీఏ) అనుసంధానించారు.
నైపుణ్యాభివృద్ధి కోసం ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఒక నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. జర్మనీ వర్సిటీల్లోని ఉన్నత విద్యావకాశాలను అందిపుచ్చుకొనేలా ఇండో–యూరోపియన్ సదస్సులను రాష్ట్రం వినియోగించుకుంది.
కీలక మార్పులకు శ్రీకారం
ఎఫ్‌హెచ్ ఆచెన్ యూనివర్సిటీలోని యూరోపియన్ సెంటర్ ఫర్ మెకానిక్స్ రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డా.ఇంగ్ గుంతేర్ స్టార్క్, యూనివర్సిటీ ఆఫ్ కెంప్టెన్ వైస్ ప్రెసిడెంట్ డా.ఇంగ్ డిర్క్ జాకోబ్ (రోబోటిక్స్ ఫ్యాకల్టీ), స్టెయిన్‌బీస్ యూనివర్సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డా.బెర్‌ట్రమ్ లోహమ్ముల్లర్ తదితరులతో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, ఇతర ప్రతినిధులు గతంలోనే చర్చలు జరిపారు.
జేఎన్‌టీయూ(కే), అనంతపురం వీసీలు ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు, ప్రొఫెసర్ రంగ జనార్దన, ఏపీఐటీఏ సీఈవో టి.అనిల్‌కుమార్, ఏపీ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీ సీఈవో నందకిశోర్‌రెడ్డి తదితరులు సదస్సుల్లో పాల్గొని ఉన్నత విద్యా కార్యక్రమాల్లో పలు మార్పులకు శ్రీకారం చుట్టారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్, రోబోటిక్స్, ఆటోమేషన్ తదితర విభాగాల్లో రాష్ట్ర విద్యార్థులను తీర్చిదిద్దేలా కార్యక్రమాలు అమల్లోకి తెచ్చారు. ప్రాక్టికల్ లెర్నింగ్ పెంచేందుకు ఆన్‌లైన్‌లో ల్యాబ్‌లు, లెక్చరర్లతో బోధన తదితర కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలన్న వర్చువల్ సమావేశాల సూచనలను అమలులోకి తెచ్చారు.
డిగ్రీ సిలబస్‌ను పూర్తిగా సంస్కరించడం కూడా విద్యార్థులకు కలసి వస్తోంది. మారుతున్న అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను సమకూర్చేలా దాదాపు 27 వేల పరిశ్రమలు, ఇతర సంస్థలతో కాలేజీలను అనుసంధానించి ఇంటర్న్‌షిప్ చేపట్టారు.
అంతర్జాతీయంగా పలు బహుళ సంస్థలు తమ ఉద్యోగులకు మైక్రో క్రెడెన్షియల్ స్కిల్ ప్రోగ్రామ్‌లను అమలులోకి తేగా వాటిని రాష్ట్ర విద్యార్థులకు ముందుగానే అందించేలా భారత్ స్కిల్స్, ఈ–స్కిల్ ఇండియా, నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్, ఎన్‌పీటీఐ, స్వయం, స్వయంప్రభ లాంటి వర్చువల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విద్యార్థులను ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. ఈ కార్యక్రమాల ఫలితంగా జర్మనీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత కోర్సులను అభ్యసించేందుకు రాష్ట్ర విద్యార్థులకు మార్గం సుగమమైంది.
జర్మనీ పర్యటనలో ‘ఉన్నత’ బృందం
ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ఆధ్వర్యంలో 18 మంది సభ్యులతో కూడిన బృందం ఇటీవల జర్మనీలో పర్యటించింది. ఉద్యోగ ఆధారిత మాస్టర్స్ ప్రోగ్రామ్స్‌లో ఏపీ విద్యార్థులను చేర్చుకోవడంపై బెర్లిన్‌లోని స్టెయిన్‌బీస్ వర్సిటీ అధికారులతో బృందం చర్చించింది. గ్రీన్ టెక్నాలజీ కార్యకలాపాలపై సహకరించుకోవడం, హైడ్రోజన్ ఎనర్జీలో పరిశోధనలను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
ఇందులో భాగంగా రాష్ట్రంలోని రెండు సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు డీఎస్‌ఈ కన్సార్టియంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. బాడెన్ వుర్టెంబెర్గ్ ఇంటర్నేషనల్ టాలెంట్ సంస్థ ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇంక్యుబేషన్, స్టార్టప్ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment