మాట్లాడుతున్న మంత్రి ఆదిమూలపు సురేష్
ఒంగోలు సిటీ: ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు కమిషన్ వేస్తున్నట్లుగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డా.ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఆదివారం ఒంగోలులోని ఎన్నెస్పీ అతిథి గృహంలో రాష్ట్ర విద్యుత్తు, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి విలేకర్ల సమావేశంలో మంత్రి సురేష్ మాట్లాడారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో వసతులు, సౌకర్యాలను కమిషన్ పరిశీలించి నివేదిక ఇస్తుందని, ఆ నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సమర్పించి ఆ తర్వాత అధిక ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
రానున్న రోజుల్లో విద్యా విధానంలో మార్పులు తీసుకువస్తామని, ఇందుకు సంబంధించి ముసాయిదా నివేదికను సీఎం పరిశీలనకు సమర్పించామని తెలిపారు. ప్రకాశం జిల్లాలో ట్రిపుల్ ఐటీకి దూబగుంటలో స్థలం కేటాయించారని, భవనాల కోసం నిధుల కేటాయింపునకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒంగోలు శివారు పేర్నమిట్టలో విశ్వవిద్యాలయం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.
త్వరలోనే డీఎస్సీ నియామకాలు
డీఎస్సీ నియామకాలను త్వరలోనే చేపట్టబోతున్నామని మంత్రి సురేష్ వెల్లడించారు. వీలైనంత త్వరలోనే నియామకాలకు ప్రకటన జారీ చేయబోతున్నామని తెలిపారు. నవరత్నాలను చిత్తశుద్ధితో వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతోందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment