
శనివారం విద్యాశాఖపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపర్చడం ద్వారా వాటి రూపురేఖలను పూర్తిగా మార్చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. మూడు దశల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల దశ, దిశ మార్చాలని ఆదేశించారు. తొలి దశలో 12,918 ప్రాథమిక పాఠశాలలు, 3,832 ఉన్నత పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి శనివారం విద్యా శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలి దశలో కచ్చితంగా ప్రతి పంచాయతీలో ఒక పాఠశాలను ఎంపిక చేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16,750 పాఠశాలల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలు గతంలో ఎలా ఉండేవో, సౌకర్యాలు మెరుగుపర్చిన తర్వాత ఎలా ఉన్నాయో వివరిస్తూ ‘నాడు–నేడు’ ఫొటోలను ప్రజలముందు ఉంచాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాల యాజమాన్య కమిటీలు
రాష్ట్ర సర్కారు చేపట్టిన చర్యలతో ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య భారీగా పెరిగిందని అధికారులు వివరించారు. ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి 1,79,366 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చేరారని ముఖ్యమంత్రికి తెలియజేశారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ.. ప్రజలకు ప్రభుత్వం పట్ల ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. చాలాచోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా తరగతి గదులు లేవని, ఒకే గదిలో రెండు, మూడు తరగతులు నిర్వహించాల్సి వస్తోందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి పరిస్థితులు స్కూళ్లలో ఉండకూడదని సీఎం చెప్పారు. అవసరమైన చోట అదనపు తరగతి గదులు నిర్మించాలని, దీనిపై ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాల యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేసి, వారి భాగస్వామ్యంతో అదనపు తరగతి గదుల నిర్మించాలన్నారు. వీలైనంత త్వరగా కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పారు. పాఠశాలల్లో పిల్లలకు రక్షిత తాగు నీరు సరఫరా చేయడానికి ప్రస్తుతమున్న ఆర్వో ప్లాంట్లను వినియోగించడంతో పాటు కొత్త ప్లాంట్ల ఏర్పాటుపైనా సమావేశంలో చర్చించారు. దీనిపై ఒక ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇప్పుడున్న ఆర్వో ప్లాంట్లను కచ్చితంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆర్థిక ఇబ్బందులున్నా విద్యార్థుల కోసం చేయాల్సిందే..
రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ విద్యార్థులకు మంచి వసతులు కల్పించాలన్న ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ప్రస్తుతం కల్పిస్తున్న సదుపాయాలకు తోడు అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని, వాస్తవంగా ఎంత ఖర్చవుతుందో చూసి అంచనాలు రూపొందించాలని, బడ్జెట్ పెరిగినా ఫర్వాలేదని చెప్పారు. ప్రభుత్వం పాఠశాలలను బాగుచేసే పనిని అంకిత భావంతో పూర్తిచేస్తే అధికారులకే మంచి పేరు వస్తుందని అన్నారు.
ప్రజలకు అందుబాటులోకి స్కూళ్లు
రాష్ట్రంలో 276 ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాలు లేవని సమీక్షా సమావేశంలో అధికారులు వివరించారు. దీనిపై వెంటనే అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జనాభా ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరకపోవడం, అక్కడి పరిస్థితులపై స్వయంగా క్షేత్రస్థాయి పర్యటించి, అధ్యయనం చేయాలన్నారు. పాఠశాలలు గ్రామాలకు దూరంగా ఉంటే వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు ప్రారంభించాలని సూచించారు.
విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా టీచర్లు
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా ఉపాధ్యాయులను నియమించాలని సీఎం ఆదేశించారు. అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నందున అందుకు అనుగుణంగా టీచర్ల ఎంపిక చేపట్టాలని అన్నారు. ఇప్పుడున్న టీచర్లకు మెరుగైన శిక్షణ ఇచ్చి, సర్టిఫికెట్లు అంజేయాలన్నారు. పాఠ్య ప్రణాళికలో(సిలబస్) చేపట్టాల్సిన మార్పులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టినప్పటికీ తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా ఉంటుందని జగన్‌మోహన్‌రెడ్డి తేల్చిచెప్పారు.
విద్యాశాఖ అధికారులతో జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఒక గదిలో ఒక తరగతి
స్కూళ్లలో ఒక గదిలో ఒక తరగతి మాత్రమే ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. తప్పనిసరిగా ఒక్కో తరగతికి ఒక టీచర్ ఉండేలా చూడాలన్నారు. లేకపోతే చేస్తున్న మనం చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం లేకుండా పోతుందని పేర్కొన్నారు. టీచర్ పోస్టుల ఖాళీలను గుర్తించి, వెంటనే వాటిని భర్తీ చేసేలా క్యాలెండర్ రూపొందించాలని ఆదేశించారు.
మధ్యాహ్న భోజనం నాణ్యతపై రాజీ వద్దు
పాఠశాల విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతపై ముఖ్యమంత్రి సమీక్షించారు. పిల్లలకు పెట్టే భోజనం నాణ్యత విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడొద్దని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనం సరుకుల పంపిణీ, వాటికి సంబంధించిన టెండర్ల ఖరారు బాధ్యతలను జిల్లా కలెక్టర్లకే అప్పగించామని, భోజనంలో నాణ్యత ఉండేలా వారే చూడాలని చెప్పారు. రూ.కోటి విలువ దాటే ఏ టెండర్ అయినా ఆన్‌లైన్‌లో పెట్టాలని, దీనివల్ల ఎక్కువ మంది పోటీపడి, తక్కువ ధరలో టెండర్ ఖరారయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయదలచుకున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి అవసరమైన కాలేజీలను గుర్తించాలని ఆదేశించారు. విద్యారంగంపై ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రాధాన్యతా క్రమంలో పనులు
ముఖ్యమంత్రి గతంలోనే జారీ చేసిన ఆదేశాల మేరకు విద్యాశాఖ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఫొటోలను చిత్రీకరించింది. రాష్ట్రంలో 44,512 పాఠశాలలకు గానూ 42,655 పాఠశాలల ప్రస్తుత స్థితిగతులపై సంక్షిప్త వీడియోలు, ఫొటోలు సేకరించారు. ఈ ఫొటోలను అప్‌లోడ్ చేయడానికి ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటిదాకా మొత్తం 10.88 లక్షల ఫొటోలను అప్‌లోడ్ చేశారు. అంతేకాకుండా ప్రతి పాఠశాలలో ప్రాధాన్యతా క్రమంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలన్న దానిపై నివేదిక రూపొందించారు. ప్రాధన్యతా క్రమం..
1. టాయిలెట్లు, బాత్‌రూమ్‌లు 2 యూనిట్ల చొప్పున.
2. ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు
3. తాగునీరు
4. ఇతర అవసరాల కోసం నీరు
5. ఫర్నీచర్
6. తరగతి గదులకు రంగులు వేయడం
7. తరగతి గదులకు మరమ్మతులు
8. బ్లాక్‌బోర్డుల ఏర్పాటు
విద్యా నవరత్నాలు
విద్యాశాఖలో చేపడుతున్న మొత్తం కార్యక్రమాలను 9 భాగాలుగా అధికారులు విభజించారు. విద్యా నవరత్నాల పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తెలియజేశారు. విద్యా నవరత్నాలు ఏమిటంటే..
1. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన
2. స్కూళ్లలో బోధనా ప్రమాణాలు, విద్యా ప్రమాణాలు పెంచడం
3. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం
4. తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా బోధించడం
5. విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందించడం
6. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచడం, సక్రమంగా అమలు చేయడం
7. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా ఉపాధ్యాయుల నియామకం
8. విద్యార్థుల్లో నైపుణ్యాలను అభివృద్ధి పర్చడం
9. పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు. ప్రైవేట్ స్కూళ్ల టీచర్ల స్థితిగతులను మెరుగుపర్చడం
Comments
Please login to add a commentAdd a comment