సాక్షి, న్యూఢిల్లీ: ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్సీ) నిర్ధారించిన ఫీజులను ఎలాంటి ప్రాతిపదిక లేకుండా హైకోర్టు డివిజన్ బెంచ్ మార్పులు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. తెలంగాణలోని వాసవీ ఇంజనీరింగ్ కళాశాల, శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలల్లో ఏఎఫ్‌ఆర్సీ ఆమోదించిన ఫీజుల కంటే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయా కళాశాలల పేరెంట్స్ అసోసియేషన్, తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారించింది. వాసవీ కళాశాల తరపున సీనియర్ న్యాయ వాది ఫాలీ నారిమన్ వాదనలు వినిపించారు. 2015–16 విద్యా సంవత్సరాన్ని బేస్ ఇయర్‌గా తీసుకుని 2016–17 నుంచి 2018–19 వరకు మూడేళ్ల కాలానికి ఫీజులు నిర్ధారించారని, తాము 1.08 లక్షలు ప్రతిపాదించగా ఏఎఫ్‌ఆర్సీ రూ.86 వేలుగా నిర్ధారించిందని చెప్పారు.
ఫీజును పెంచాలన్న తమ అభ్యర్థనను హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ నిరాకరించినా డివిజన్ బెంచ్ పరిగణనలోకి తీసుకుందని నివేదించారు. తాము పెట్టిన ఖర్చునే ఇవ్వమంటున్నామని, లాభాపేక్షతో ఎక్కు వ రుసుము ఆశించడం లేదని వాదించారు. పేరెంట్స్ అసోసియేషన్ తరఫున న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు. విద్యార్థులను ఫీజులు చెల్లించేలా ఒత్తిళ్లు చేశారని, పరీక్షలు రాయకుండా అడ్డుకున్నారని, నిరసనలు తెలిపిన వారిపై దాడులు చేయించారని తెలిపారు. జస్టిస్ అరుణ్‌మిశ్రా జోక్యం చేసుకుని ఫీజుల గణన తమ విధి కాదని, హైకోర్టు కూడా ఏ ప్రాతిపదికతో ఫీజు మార్చిందని ప్రశ్నించారు. ఏఎఫ్‌ఆర్సీ చేసిన గణన ప్రక్రియలో తప్పులుంటే దానిని సవాలు చేయొచ్చు గానీ.. మీరు సొంత పద్ధతిలో ఫీజులు ప్రతిపాదించుకోవడం, దానిని హైకోర్టు సమర్థించడం సరికాదన్నారు.
ఫీజుల నిర్ధారణకు తీసుకోవాల్సిన అంశాలు, వాటిని బలపరిచే డాక్యుమెంట్లు, ఇవన్నీ పరిశీలించి ఏఎఫ్‌ఆర్సీ నిర్ధారిస్తుంది. మీరేం జత చేశారో, ఏం ప్రతిపాదించారో తెలియకుండా ఎలా మార్పులు చేస్తాం. ఏఎఫ్‌ఆర్సీ ఫీజు నిర్ధారణ∙ప్రక్రియలో తప్పులుంటే చెప్పండని ప్రశ్నించారు. మొత్తం ఖర్చుపై ఏటా పది శాతం ద్రవ్యోల్బణాన్ని జత చేయాలని, కానీ ఏఎఫ్‌ఆర్సీ కేవలం పెరిగిన ఖర్చుపై మాత్రమే ద్రవ్యోల్బణాన్ని జత చేస్తోందని మరో కళాశాల తరపు న్యాయవాది నివేదించారు. ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. తెలం గాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయ వాది రాధాకృష్ణన్, పాల్వాయి వెంకటరెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
ఫీజుల పెంపుపై తీర్పు రిజర్వ్
Published Thu, Apr 11 2019 1:32 AM | Last Updated on Thu, Apr 11 2019 1:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment