వైద్య ఫీజులకు ముకుతాడు | Ap Higher Education Regulatory Monitoring ON Medical Colleges | Sakshi
Sakshi News home page

వైద్య ఫీజులకు ముకుతాడు

Published Fri, Jan 10 2020 6:08 AM | Last Updated on Fri, Jan 10 2020 6:08 AM

Ap Higher Education Regulatory Monitoring ON Medical Colleges - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీల్లో ఫీజులను ఇకపై ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ నిర్ణయించనుంది. ఈమేరకు కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అండర్‌ గ్రాడ్యుయేట్, పోస్ట్‌ గ్రాడ్యుయేట్, సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు నిర్వహించే వైద్య కళాశాలలతోపాటు యూజీ, పీజీ డెంటల్‌ కాలేజీలు, ఆయుష్‌ కోర్సులు నిర్వహించే కాలేజీలు, యూజీ, పీజీ, డిప్లొమో నర్సింగ్‌ కాలేజీలు, పారా మెడికల్‌ కాలేజీల ఫీజులను కమిషన్‌ నిర్ణయిస్తుందని తెలిపారు. కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ భార్గవరామ్, కార్యదర్శి ఎన్‌.రాజశేఖరరెడ్డితో కలసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

మూడు విద్యా సంవత్సరాలకు ఫీజులు
ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ ప్రొఫెషనల్‌ వైద్య విద్యాసంస్థలన్నీ ఈనెల 27వతేదీ నుంచి ఫిబ్రవరి 29వ తేదీ లోగా ఫీజుల ప్రతిపాదనలను కమిషన్‌కు సమర్పించాలని కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య పేర్కొన్నారు. 2020–21, 2021–22, 2022–23 విద్యా సంవత్సరాలకు ఫీజులను కమిషన్‌ నిర్ణయిస్తుందని వివరించారు. విద్యాసంస్థలు 2017–18, 2018–19  విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఆడిట్‌ ఫైనాన్సియల్‌ నివేదికలు, ఇతర సమాచారాన్ని నిర్ణీత ప్రొఫార్మాలో కమిషన్‌కు  https:// aphermc.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించాలి. ఫీజులను ప్రతిపాదించకపోయినా, స్పందించకపోయినా ఫీజుల వసూలుకు అనుమతించబోమని కమిషన్‌ చైర్మన్‌ స్పష్టం చేశారు. డిగ్రీ, పీజీ కాలేజీల ఫీజులను కూడా ఇకపై కమిషనే నిర్ణయిస్తుందని, వాటికి వచ్చే వారంలో నోటిఫికేషన్‌ ఇస్తామని తెలిపారు. ఇంజనీరింగ్, బీఈడీ, ఫార్మా కాలేజీల్లో ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయని, అనంతరం ఫీజులపై నిర్ణయం ఉంటుందని తెలిపారు. ఫీజులు తగ్గుతాయా? పెరుగుతాయా? అనేది ఆయా కాలేజీల్లో వసతులు, సిబ్బంది, విద్యార్థుల సంఖ్య, హాజరు, ఉత్తీర్ణత వాస్తవిక స్థితిని బట్టి ఉంటుందని చెప్పారు.

బయోమెట్రిక్, జియో ట్యాగింగ్‌..
ప్రతి కాలేజీలో విద్యార్ధులు, సిబ్బంది హాజరుకు బయోమెట్రిక్‌ విధానాన్ని  తప్పనిసరి చేయడంతోపాటు జియో ట్యాగింగ్‌ ద్వారా ప్రభుత్వ సర్వర్‌కు అనుసంధానం చేయిస్తామని కమిషన్‌ చైర్మన్‌ తెలిపారు. యూజీసీ కూడా ఫీజులను ఆయా ప్రాంతాలు, ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులు, కాలేజీల్లో వసతులు, బోధనా ప్రమాణాలు అనుసరించి వేర్వేరుగా ఉండాలని నిర్ణయించినందున కామన్‌ ఫీజు అన్నది ఉండదన్నారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ తదితర కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌  కోటా సీట్లకు నిర్ణీత ఫీజు కంటే నాలుగైదు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నందున ఆ మేరకు కన్వీనర్‌ కోటా సీట్లలో ఫీజులను తగ్గించుకోవాలని యాజమాన్యాలకు సూచిస్తున్నామన్నారు.

తప్పుడు నివేదికలిస్తే ప్రొఫెసర్లపైనా చర్యలు
కాలేజీల్లో తనిఖీలు చేసి కమిటీలు ఇస్తున్న రిపోర్టులు తప్పుల తడకగా ఉంటున్నట్లు ఫిర్యాదులున్నాయని, ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రొఫెసర్లతో పాటు ఆయా వర్సిటీలపై చట్టపరమైన చర్యలు తప్పవని కమిషన్‌ చైర్మన్‌ హెచ్చరించారు. యూనివర్సిటీలు అఫ్లియేషన్‌ కోసం ఇచ్చే నివేదికలను కమిషన్‌కు కూడా అందించాలన్నారు.

గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు
కొన్ని కాలేజీలు ‘జగనన్న విద్యాదీవెన’ కింద ఇచ్చే రూ.20 వేలు తమకే ఇవ్వాలని విద్యార్ధులపై ఒత్తిడి తెస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి కళాశాలలపై చర్యలు తప్పవని కమిషన్‌ చైర్మన్‌ స్పష్టం చేశారు. ఇలాంటి అంశాలపై  grievanceaphermc@gmail. com మెయిల్‌ ద్వారా కమిషన్‌కు  ఫిర్యాదు చేయాలని కోరారు. 08645 274445 నంబర్‌కు ఫోన్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. లేఖ ద్వారా పంపే ఫిర్యాదులను ‘కమిషన్‌ కార్యదర్శి, ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్, రెగ్యులేటరీ, మానిటరింగ్‌ కమిషన్, థర్డ్‌ ఫ్లోర్, శ్రీమహేంద్ర ఎన్‌క్లేవ్, తాడేపల్లి, గుంటూరు జిల్లా’ చిరునామాకు పంపాలన్నారు.

 రీయింబర్స్‌మెంట్‌ కోసం అక్రమాలు
‘కొన్ని చోట్ల మినహా పలు కాలేజీల్లో వసతులు లేవు. విద్యార్థులు రికార్డుల్లో మాత్రమే ఉన్నారు. కేవలం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల కోసమే కొన్నిటిని కొనసాగిస్తున్నట్లు కనిపించింది’ అని జస్టిస్‌ ఈశ్వరయ్య పేర్కొన్నారు. రీయింబర్స్‌మెంట్‌ కోసం ఇంటర్‌ పాసైన విద్యార్ధుల సర్టిఫికెట్లను దళారీల ద్వారా తెప్పించి రికార్డుల్లో చూపుతున్నారన్నారు. మైనార్టీ కాలేజీల్లో ఇకపై నాన్‌ మైనార్టీ విద్యార్థులను ఎంసెట్‌ ద్వారా చేర్చుకుంటేనే రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలని  సిఫార్సు చేస్తున్నామని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement