సీటు.. భారీ రేటు | Engineering Seats Hikes Prices in Anantapur | Sakshi
Sakshi News home page

సీటు.. భారీ రేటు

Published Wed, May 8 2019 12:43 PM | Last Updated on Wed, May 8 2019 12:43 PM

Engineering Seats Hikes Prices in Anantapur - Sakshi

ఎంసెట్‌ రాత పరీక్ష ముగియడంతో ఇంజినీరింగ్‌ సీట్ల హడావుడి మొదలైంది. ఏ బ్రాంచ్‌ బాగుంటుంది...? ఏ కళాశాలను ఎంపిక చేసుకోవాలి...? అనే విషయంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లో గందరగోళం కనిపిస్తోంది. పేరున్న కళాశాలల్లో చేరిస్తేనే క్యాంపస్‌ ఉద్యోగాలు..ఇతర అవకాశాలుంటాయనే అభిప్రాయంతో అందరూ ఆ వైపే మొగ్గుచూపుతున్నారు. ఎంసెట్‌ ర్యాంకులతో సంబంధం లేకుండా నచ్చిన కళాశాలలో చేర్చేందుకు సిద్ధమవుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న కళాశాలల నిర్వాహకులు యాజమాన్య కోటా పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచిఅందిన కాడికి దోచేందుకు సిద్ధమయ్యారు.

జేఎన్‌టీయూ: జేఎన్‌టీయూ(ఏ) పరిధిలో మొత్తం 119 ఇంజినీరింగ్‌ కళాశాలలుండగా.. నెల్లూరు జిల్లాలోనూ పలు ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా 30 కళాశాలలకు డిమాండ్‌ అధికంగా ఉంది. పేరున్న కళాశాలల్లోనే బీటెక్‌ పూర్తి చేస్తే పిల్లల భవిత బాగుంటుందన్న అభిప్రాయంతో తల్లిదండ్రులు డొనేషన్ల విషయంలో వెనుకాడని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎంసెట్‌ ర్యాంకుతో పనిలేకుండా యాజమాన్య కోటా(బీ–కేటగిరి) సీట్లకు డిమాండ్‌ పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకొని పేరున్న కళాశాలలు కొన్ని తమకు తోచిన విధంగా ఫీజులను డిమాండ్‌ చేస్తున్నాయి. సీట్ల భర్తీ విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నా... ఉన్నత విద్యా మండలి ఖాతరు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రతిభావంతులు, మధ్య తరగతి వారికి బీ–కేటగిరీ సీట్లు కూడాఅందే పరిస్థితి లేకుండాపోయింది. ముందస్తుగా మాట్లాడుకుంటే ఒక ధర.. చివరకు వెళితే మరో ధరను నిర్ణయిస్తున్నారు. నిబంధనల ప్రకారం కన్వీనర్‌ కోటా ఫీజులనే తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, ఇదీ అమలుకు నోచుకోని పరిస్థితి. ఇక కంప్యూటర్‌ సైన్స్‌కు డిమాండ్‌ భారీగా నేపథ్యంలో కొన్ని బ్రాంచ్‌ల్లో సీట్లను తగ్గించుకొని ఈ సీట్లను పెంచుకోవడం చూస్తే కళాశాలల దోపిడీ ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

రూ.35 వేల నుంచి మొదలు..
ఆంధ్రప్రదేశ్‌ అడ్మిషన్స్, ఫీజు రెగ్యులేటరీ కమిటీ(ఏఎఫ్‌ఆర్‌సీ) ఆయా ఇంజినీరింగ్‌ కళాశాల్లో ఫీజులను నిర్ధారిస్తుంది. దీని ప్రకారమే ఆయా కళాశాలలు ఫీజులు వసూలు చేసుకోవాలి. మూడేళ్లకోసారి ఏఎఫ్‌ఆర్‌సీ ఫీజులను సవరిస్తుంది. ప్రస్తుతం ఏడాదికి ఇంజినీరింగ్‌ ఫీజులు  రూ.35 వేల నుంచి రూ. 1.08 లక్షల వరకు ఉన్నాయి. కన్వీనర్‌ కోటా కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా బీ–కేటగిరి సీట్లకు వసూలు చేస్తున్నారు.

సీట్ల కృత్రిమ కొరత
బ్రాంచ్‌ కంటే ముఖ్యంగా ఏ కళాశాల అయితే బాగుంటుందనే విషయంపైనే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఎక్కువగా ఆరా తీస్తున్నారు. క్యాంపస్‌ ఇంటర్వ్యూలు, కళాశాల ప్రగతిని మదింపు చేస్తున్నారు. ప్రస్తుతం కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచ్‌కు విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఆ తర్వాత స్థానంలో ఈసీఈ ఉంది. అయితే అన్ని బ్రాంచ్‌ల్లోనూ సమాన అవకాశాలు ఉంటాయనే విషయాన్ని తల్లిదండ్రులు తెలుసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కళాశాలల యాజమాన్యాలు కూడా సీట్ల కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకుంటున్నాయి.

అవగాహన తప్పనిసరి
ప్రస్తుతం ఇంజినీరింగ్‌ కోర్సు ఇంటర్‌ డిసిప్లినరీ ప్రధానమైన అంశంగా మారింది. సిలబస్‌ స్వరూపం మారిపోయింది. అన్ని బ్రాంచ్‌ల్లోనూ అవగాహన తప్పనిసరి అవుతోంది. మెకానికల్‌ విభాగం చదివే విద్యార్థి కంప్యూటర్‌ నాలెడ్జ్‌పైనా దృష్టి సారించాల్సి ఉంటోంది. ఈ నేపథ్యంలో ఎంచుకున్న బ్రాంచ్‌తో పాటు మరో బ్రాంచ్‌లో మైనర్‌ డిగ్రీ చేస్తున్నారు. అందువల్ల ఏ కోర్సు చదువుతున్నామనేది ప్రధానం కాదని.. సరైన శిక్షణ, సదుపాయాలు, మౌలిక వసతులు, అధునాతన ల్యాబ్‌ కలిగిన కళాశాల ఎంపిక కీలకమనేది నిపుణుల అభిప్రాయం.

నిబంధనలు ఇలా..
ప్రతి ఇంజినీరింగ్‌ కళాశాలలో కన్వీనర్‌ కోటా కింద 70 శాతం సీట్లు, తక్కిన 30 శాతం సీట్లు యాజమాన్య కోటాలో భర్తీ చేయాలి. ఈ 30 శాతం సీట్లలో 15 శాతం ఎన్‌ఆర్‌ఐ, ఎన్నారై సంరక్షకుల కోటా కింద కేటాయించాలి. మిగిలిన సీట్లను ప్రాధాన్య క్రమంలో భర్తీ చేయాలి. జేఈఈ మెయిన్స్, ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ర్యాంకుల ఆధారంగా ప్రాధాన్యమివ్వాలి. అయితే ఇవన్నీ లేకుండా పెద్ద మొత్తాన్ని నిర్ణయించి యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేసుకుంటున్నారు. ఈ విషయంలో ఉన్నత విద్యా మండలి చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం.

సమాన అవకాశాలు
యాజమాన్య కోట్లా సీట్ల భర్తీలో ఏఎఫ్‌ఆర్‌సీ నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాలి. విద్యార్థులు, తల్లిదండ్రులు ఒకే బ్రాంచ్‌పై దృష్టి సారించడం సరికాదు. అన్ని బ్రాంచ్‌ల్లోనూ సమాన అవకాశాలు ఉన్నాయని గుర్తించాలి. పట్టుదలతో చదివితే ఏ బ్రాంచ్‌తోనైనా అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.– ప్రొఫెసర్‌ పీఆర్‌ భానుమూర్తి, జేఎన్‌టీయూడైరెక్టర్‌ ఆఫ్‌ అకడమిక్‌ అండ్‌ ఆడిట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement