అందకారంలో వర్సిటీలు | Universities in the dark | Sakshi
Sakshi News home page

అందకారంలో వర్సిటీలు

Published Sun, Jul 17 2016 12:19 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

అందకారంలో వర్సిటీలు - Sakshi

అందకారంలో వర్సిటీలు

రాష్ట్రంలో యువత బంగారు భవితకు బాటలు వేయాల్సిన విశ్వవిద్యాలయాలు పూర్తిగా వట్టిపోతున్నాయి.. పరిశోధనలకు ప్రాణం పోయాల్సిన వర్సిటీలు నిర్వీర్యమైపోతున్నాయి..

- సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విశ్వవిద్యాలయాలు
- రాష్ట్రం నిధులు పెంచదు.. కేంద్ర నిధులూ అందవు
- సిబ్బంది జీతభత్యాలూ చెల్లించలేని దుస్థితి
సారథులు లేరు.. ఫ్యాకల్టీ లేరు..
- బోధనేతర సిబ్బందీ కరువే
- ప్రాభవం కోల్పోతున్న ఉస్మానియా
- 11 మందితో నడుస్తున్న పాలమూరు వర్సిటీ
- మిగతా విశ్వవిద్యాలయాలదీ అదే పరిస్థితి
వర్సిటీల్లోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలకు దక్కని ‘గుర్తింపు’

రాష్ట్రంలో యువత బంగారు భవితకు బాటలు వేయాల్సిన విశ్వవిద్యాలయాలు పూర్తిగా వట్టిపోతున్నాయి.. పరిశోధనలకు ప్రాణం పోయాల్సిన వర్సిటీలు నిర్వీర్యమైపోతున్నాయి.. సరైన సంఖ్యలో అధ్యాపకుల్లేక, కనీస స్థాయిలో సిబ్బందిలేక, చివరికి నడిపించే సారథులే లేక వాడిపోతున్నాయి.. విజ్ఞాన కేంద్రాలు విలసిల్లాల్సిన చోట అడ్డగోలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి.. కనీస మౌలిక సదుపాయాలూ లేక కునారిల్లిపోతున్నాయి.. జీతభత్యాలూ ఇవ్వలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. మొత్తంగా పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం విశ్వవిద్యాలయాల మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఎంతో ప్రఖ్యాతి గాంచిన యూనివర్సిటీలు కూడా తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల దుస్థితిపై ఈ వారం ఫోకస్...
 - సాక్షి, హైదరాబాద్
 
ఉస్మానియాలో 669 పోస్టులు ఖాళీ
 ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1,264 బోధనా సిబ్బంది పోస్టులుండగా.. అందులో 669 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పదవీ విరమణ చేస్తున్నవారి స్థానంలో కొత్తగా నియామకాలు చేపట్టలేదు. దాంతో నాలుగేళ్లుగా వర్సిటీ పరిస్థితి దిగజారింది. ఫ్యాకల్టీ లేని కారణంగా ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు పెంచేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అంగీకరించడం లేదు. ఆ కాలేజీని ప్రారంభించిన నాటి నుంచి ఒక్కో డిపార్టుమెంట్‌లో ఉన్న గరిష్ట సీట్లు 60 మాత్రమే కావడం గమనార్హం.

 11 మందితో నడుస్తున్న ‘పాలమూరు’
 మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలమూరు విశ్వవిద్యాలయం విద్యా బోధనలో పూర్తిగా వెనకబడింది. ఇక్కడ బోధనా సిబ్బంది 9 మంది, బోధనేతర సిబ్బంది ఇద్దరు.. మొత్తంగా 11 మందితోనే వర్సిటీ పాలన సాగుతోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో గమనించవచ్చు. ఓ సాధారణ డిగ్రీ కళాశాలలో ఉండే సిబ్బంది సంఖ్యలో పదో వంతు కూడా ఇక్కడ లేకపోవడం గమనార్హం. వాస్తవానికి పాలమూరు వర్సిటీకి 74 పోస్టులు మంజూరయ్యాయి. అందులో ప్రస్తుతం 63 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

 ఏ వర్సిటీలో చూసినా..
► కాకతీయ విశ్వవిద్యాలయంలో మంజూరైన పోస్టుల్లో సగం సిబ్బంది కూడా లేరు. దానికి ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలో 4 బ్రాంచీలు ఉన్నాయి. వాటికి 60 మంది బోధనా సిబ్బంది కావాలి. కానీ ఉన్నది 11 మందే. దీంతో రూ.16 కోట్ల వరకు అందాల్సిన టెక్విప్ నిధులు రాని పరిస్థితి.
► శాతవాహన యూనివర్సిటీలోనూ 70 విభాగాలున్నాయి. ఇక్కడ కనీసం 150 మంది ఫ్యాకల్టీ కావాలి. కానీ అందులో పావువంతు కూడా లేరు. ఇక ఇక్కడ ఫార్మసీ కాలేజీ ఉన్నా.. బోధనా సిబ్బంది లేని కారణంగా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దానికి గుర్తింపు ఇవ్వలేదు. దీంతో అందులో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారింది.
► పాలమూరు వర్సిటీలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడి ఫార్మసీ కాలేజీకి గుర్తింపు లేదు.
► జేఎన్టీయూహెచ్ పరిధిలోని మంథని ఇంజనీరింగ్ కాలేజీలో కేవలం ఐదుగురే సిబ్బంది ఉన్నారు, సుల్తాన్‌పూర్ కాలేజీలో ఇద్దరే రెగ్యులర్ సిబ్బంది ఉన్నారు.
► జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీలో 60 మంది వరకు ఫ్యాకల్టీ అవసరమున్నా 25 మందే ఉన్నారు.
►మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో మూడు బ్రాంచీలతో ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. 40 మంది వరకు అవసరమైనా రెగ్యులర్ సిబ్బంది ఒక్కరూ లేరు.
 
 అభివృద్ధికి కేంద్ర నిధులే దిక్కు
 యూనివర్సిటీలకు రాష్ట్రం ఇచ్చే నిధులు బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు, పెన్షన్‌లకే సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఇచ్చే నిధులే వర్సిటీల అభివృద్ధికి ప్రధానాధారంగా మారాయి. ఒక్కో వర్సిటీకి వివిధ పరిశోధనలు, ప్రాజెక్టుల కింద కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిధులిస్తాయి. అంతేకాదు ప్రొఫెసర్లకు వ్యక్తిగతంగా వివిధ ప్రాజెక్టుల కింద  నిధులు వస్తాయి. ఇక రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉంటేనే పరిశోధనల కోసం నిధులు వస్తాయి. యూజీసీ నుంచి స్పెషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం, డిపార్ట్‌మెంట్ రీసెర్చ్ స్కీం, సెంట్రల్ అసిస్టెంట్ ప్రోగ్రాం, టెక్విప్‌ల కింద.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ, సీఎస్‌ఐఆర్‌ల పరిధిలోని వివిధ ప్రాజెక్టుల కింద రూ.50 లక్షల నుంచి రూ.15 కోట్ల వరకు నిధులు అందుతాయి.

అయితే వర్సిటీల్లో కనీస బోధనా సిబ్బంది, మౌలిక సదుపాయాలు, ల్యాబ్‌లు ఉంటేనే ఈ నిధులు అందుతాయి. లేకుంటే మంజూరు కావు. ప్రస్తు తం రాష్ట్రంలోని వర్సిటీల్లో తగిన సంఖ్యలో అధ్యాపకులు లేకపోవడంతో కేంద్ర పథకాల కింద నిధులు రావడం లేదు. ఇక న్యాక్ ‘ఏ’ గ్రేడ్ ఉన్న వర్సిటీలకు యూజీసీ ‘యూనివర్సిటీ విత్ పొటెన్షియల్ ఫర్ ఎక్సలెన్స్’ కింద రూ.50 కోట్ల వరకు ఇస్తుంది. 2012లో ఉస్మానియాకు రూ.50 కోట్లు వచ్చాయి. కానీ ప్రస్తుతం న్యాక్ అక్రెడిటేషన్ లేకపోవడంతో ఆ నిధులు అందని పరిస్థితి నెలకొంది. గతేడాది న్యాక్ గుర్తింపు ఉన్నందునే రూ.20 కోట్లు రూసా నిధులు అందాయి. కనీస సదుపాయాలు, సిబ్బంది లేకపోవడంతో ఈసారి అవి వచ్చే పరిస్థితి లేదు. 12వ పంచవర్ష ప్రణాళికలో అభివృద్ధి నిధుల కింద రూ.12 కోట్లు వచ్చాయి. ఈసారి ఇవి కూడా రాలేదు.
 
 సమస్యల సుడిగుండంలో వర్సిటీలు
 రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు నిండా సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇప్పుడిప్పుడే దిద్దుబాటుకు ఒక్కో అడుగు పడుతున్నా... ఇంకా ఆశించిన వేగం కనిపించడం లేదు. ప్రభుత్వం వైస్ చాన్స్‌లర్ల (వీసీల) నియామకాలకు చర్యలు వేగవంతం చేసినా... వర్సిటీలకు అవసరమైన స్థాయిలో నిధులివ్వలేదు. గతంతో పోల్చితే రూ.150 కోట్ల వరకు అదనంగా ఇస్తున్నా అవి ఏ మూలకూ సరిపోవడం లేదు. మరో రూ.200 కోట్ల వరకు అవసరమని వర్సిటీలు మొత్తుకుంటున్నా.. ప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన లేదు. ఇక అధ్యాపకుల నియామకాలపై వర్సిటీల వారీగా ఖాళీల నివేదికలను తెప్పించుకున్నా.. వాటి భర్తీపై ఇంతవరకు దృష్టి సారించలేదు. దీంతో విశ్వవిద్యాలయాల పరిస్థితి దారుణంగా మారిపోతోంది. ఎంతో ఘన కీర్తి కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఇదే దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కాకతీయ వర్సిటీ సహా ఇతర విశ్వవిద్యాలయాలదీ అదే పరిస్థితి.

 సగానికి పైగా ఖాళీలే
 రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో సగానికి పైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 11 యూనివర్సిటీల్లో కలిపి మొత్తంగా 2,753 అధ్యాపక పోస్టులుండగా... అందులో 1,504 పోస్టులు (54 శాతం) ఖాళీయే. కేవలం 1,249 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో కేంద్రం నుంచి వచ్చే వందల కోట్ల రూపాయల నిధులకు గండి పడుతోంది. ‘నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)’ గుర్తింపు ఉంటేనే నిధులు మంజూరు చేస్తామని ఏడాది కిందటే ‘రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా)’ ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు స్పష్టం చేసినా... రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఏమీ పట్టనట్లుగా ఉండిపోయింది. దీంతో రాష్ట్రంలోని వర్సిటీలకు పైసా అందని పరిస్థితి నెలకొంది.
 
 నిధులు పెంచితేనే బాగుపడేది!
 తమకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులు ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ మొత్తానికే సరిపోవడం లేదని యూనివర్సిటీలు ఏటా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాయి. అన్ని వర్సిటీలకు గతంలో రూ.298 కోట్లు ఇవ్వగా.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక గతేడాది నుంచి మరో రూ.150 కోట్ల నిధులు పెంచింది. కానీ ఈ పెంపు చాలదని.. మరిన్ని నిధులు ఇవ్వాలని వర్సిటీలు కోరుతున్నాయి. ఈ ఏడాది ఉస్మానియా వర్సిటీకి రూ.238 కోట్లు ఇచ్చినా.. అవి జీతభత్యాలకు సరిపోవడం లేదు. జీతభత్యాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ల చెల్లింపుల కోసమే మరో రూ.70 కోట్లు అవసరమని వర్సిటీ కోరుతుంది. ఇక కాకతీయ వర్సిటీకి రూ.67 కోట్లు ఇచ్చినా... ఏటా ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల కోసమే రూ.90 కోట్ల వరకు అవసరం. తెలంగాణ వర్సిటీకి రూ.20 కోట్లు కేటాయించినా మరో రూ.25 కోట్లు కేటాయించాలని.. మహాత్మాగాంధీ వర్సిటీకి రూ.25 కోట్ల వరకు ఇచ్చేందుకు ఓకే చెప్పగా మరో రూ.20 కోట్లు అవసరమని అధికారులు కోరుతున్నారు. ఇవేకాదు శాతవాహన, పాలమూరు, అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ వంటి మిగతా వర్సిటీలకూ ప్రభుత్వం నుంచి అదనంగా ఏటా రూ.10 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు అవసరమని కోరుతున్నాయి. కానీ మంజూరు చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement