రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఓ విద్యార్థికి సీటొచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పోగా మిగతా మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించాడు. కాలేజీలో చేరేందుకు వెళ్లినపుడు మరో రూ. 16 వేలు చెల్లించాలని, అవి చెల్లిస్తేనే బస్ పాస్‌కు అనుమతిస్తామని యాజమాన్యం చెప్పింది. అంత ఫీజు ఎందుకని అడిగితే యూనివర్సిటీ ఫీజు రూ. 2,500, ఎన్‌బీఏ ఫీజు రూ. 3 వేలు, ప్లేస్‌మెంట్ ఫీజు రూ. 5 వేలు, లైబ్రరీ, ల్యాబ్ ఫీజు రూ. 5,500 అంటూ వివరించింది. దీంతో ఏం చేయాలో అర్థం కాక ఆ విద్యార్థి అప్పు కోసం ప్రయత్నిస్తున్నాడు.
మేడ్చల్ జిల్లాలోని మైసమ్మగూడలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో వివేక్ (పేరు మార్చాం) బీటెక్ చదువుతున్నాడు. నిబంధనల ప్రకారం ప్రతి విద్యార్థికి 75% హాజరు ఉండాలి. కానీ అనారోగ్యం వల్ల కాలేజీకి రాలేకపోయాడు. మొత్తంగా 65 శాతమే హాజరు ఉంది. హాజరు 65–75 శాతం మధ్య ఉంటే వర్సిటీ నిబంధనల ప్రకారం రూ. 300 వరకు మాత్ర మే కండోనేషన్ ఫీజు వసూలు చేయాలి. కానీ రూ. 10 వేలు చెల్లించాలని ఆ విద్యార్థికి యాజమాన్యం చెప్పింది. మరోసారి హాజరు తగ్గితే తమకు ఇష్టమైన చర్యలు చేపట్టొచ్చని బాండ్ పేపరుపై రాయించుకుంది.
సాక్షి, హైదరాబాద్ : ఇలా ఒకటి కాదు రెండు కాదు.. రాష్ట్రంలోని అనేక కాలేజీలు ప్రత్యేక ఫీజుల దందాకు దిగాయి. రకరకాల కారణాలతో విద్యార్థుల నుంచి అడ్డగోలు వసూళ్లకు తెరలేపాయి. కొత్తగా కాలేజీల్లో చేరిన విద్యార్థుల నుంచి పాత విద్యార్థుల వరకు భారీగా పిండుకుంటున్నాయి.
రకరకాల ఫీజులంటూ..
కాలేజీల్లో ల్యాబ్, లైబ్రరీ తదితర ఫీజుల పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. ఎందుకని అడిగినా సరైన సమాధానం ఇవ్వకుండా చెల్లించాల్సిందేనని చెబుతున్నాయి. వాస్తవంగా కాలేజీల్లో చేరే విద్యార్థుల నుంచి యూనివర్సిటీ ఫీజు, ల్యాబ్, లైబ్రరీ ఫీజుల రూపంలో రూ. 5,500 (అందులో రూ. 1,000 రిఫండబుల్) తీసుకోవచ్చు. ఎన్‌బీఏ గుర్తింపు పొందిన కోర్సులో విద్యార్థి చేరితే మరో రూ. 3 వేలు వసూలు చేయొచ్చు. కానీ కాలేజీలు మాత్రం ఒక్కో విద్యార్థి నుంచి రూ. 15 వేలకు పైగా వసూలు చేస్తున్నాయి. ఎన్‌బీఏ గుర్తింపు పొందిన కోర్సులయితే అన్నీ కలిపి రూ. 20 వేల వరకు తీసుకుంటున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చివరకు ఎన్‌బీఏ గుర్తింపు పొందిన కోర్సులు లేని కాలేజీలూ ఆ ఫీజు వసూలు చేస్తూ విద్యార్థులను దోచుకుంటున్నాయి.
ల్యాబ్, లైబ్రరీకి రూ. 5,500 ఎందుకు?
ఫీజుల నియంత్రణ కమిటీ ఖరారు చేసిన ఫీజుల ప్రకారం.. ఒక్కో విద్యార్థి నుంచి అడ్మిషన్/రిజిస్ట్రేషన్/గుర్తింపు ఫీజు కింద (వన్‌టైమ్) రూ. 2 వేలు, విద్యార్థులకు స్పెషల్ సర్వీసుకు రూ. 1,000, కామన్ సర్వీసెస్‌కు రూ. 1,500, లైబ్రరీ కాషన్ డిపాజిట్ రూ. 500 (రిఫండబుల్), ల్యాబ్ కాషన్ డిపాజిట్ రూ. 500 (రిఫండబుల్) కలిపి మొత్తంగా రూ. 5,500కు మించి వసూలు చేయకూడదు. కానీ యాజమాన్యాలు మాత్రం ప్లేస్‌మెంట్ ఫీజు కింద రూ. 5 వేలు, లైబ్రరీ ఫీజుగా రూ. 5,500 చెల్లించాలని చెబుతున్నాయి. వాటికి అదనంగా యూనివర్సిటీ ఫీజు, ఎన్‌బీఏ ఫీజు అంటూ దండుకుంటున్నాయి.
ప్లేస్‌మెంట్ ఫీజు తప్పనిసరా?
కాలేజీలకు ఫీజులు నిర్ధారించినపుడు ప్లేస్‌మెంట్ ఫీజు కింద ఏటా రూ. 125 చొప్పున చెల్లించాలని ఫీజుల నియంత్రణ, ప్రవేశాల కమిటీ నిబంధనల్లో పేర్కొంది. ఆ ప్రకారం నాలుగేళ్లకు రూ. 600 మాత్రమే అవుతుంది. కానీ రూ. వేలల్లో చెల్లించాలని యాజమాన్యాలు చెబుతుండటంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఎన్‌బీఏ గుర్తింపు కాలేజీలెన్ని?
రాష్ట్రంలోని 212 ఇంజనీరింగ్ కాలేజీల్లో 97 వేలు సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఎన్‌బీఏ అక్రెడిటేషన్ ఉన్న కోర్సులు నిర్వహిస్తున్న కాలేజీలు 50లోపే ఉన్నాయి. కానీ ఎన్‌బీఏ గుర్తింపు లేకున్నా కొన్ని కాలేజీలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment