ఫీజులపై పితలాటకం | Students worry about Not Getting the Fee Reimbursements | Sakshi
Sakshi News home page

ఫీజులపై పితలాటకం

Published Wed, Jan 23 2019 3:28 AM | Last Updated on Wed, Jan 23 2019 9:03 AM

Students worry about Not Getting the Fee Reimbursements - Sakshi

రాష్ట్రంలో 300కు పైగా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 85,000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇంజనీరింగ్‌ విద్యనభ్యసిస్తున్న వారి సంఖ్య దేశంలోకెల్లా ఏపీలోనే అత్యధికం. ఎన్‌బీఏ, న్యాక్‌ గుర్తింపు ఉన్న కాలేజీలు కూడా రాష్ట్రంలోనే ఎక్కువ. వైఎస్సార్‌ సీఎం కాకమునుపు ఇంజనీరింగ్‌ విద్య అంటే పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందని ద్రాక్షగా ఉండేది. ఆయన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశ పెట్టడంతో సామాన్యులకు సైతం ఆ విద్య అందుబాటులోకి వచ్చింది.

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ సహా వివిధ కోర్సులు అభ్యసిస్తున్న వారికి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయక పోవడంతో విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. చివరి ఏడాది పరీక్షలు ముగించడానికి, పరీక్షల అనంతరం ఆయా కాలేజీల నుంచి సర్టిఫికెట్లు తీసుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. చివరకు అప్పులు చేసి కాలేజీలకు ఆ మొత్తాలను చెల్లించాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. బీటెక్‌ విద్యార్థులతో పాటు ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ తదితర పీజీ కోర్సులు చదువుతున్న వారి పరిస్థితి అయోమయంగా మారింది. ఎంటెక్‌ విద్యార్థులు బకాయి ఫీజులు చెల్లించినా, ఆయా కాలేజీలు ఆ మేరకు వర్సిటీలకు ఫీజులను పంపడం లేదు. ఫలితంగా పరీక్షలు ముగిసినా, ప్రాజెక్టులకు సంబంధించి వైవా, ఇతర ప్రక్రియలకు వర్సిటీలు విద్యార్థులను అనుమతించడం లేదు. దీంతో కోర్సు పూర్తి చేసినా, సర్టిఫికెట్‌ చేతికందడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ప్రాజెక్టు ఫీజు బకాయిలు కోట్ల రూపాయల్లోకి చేరుకోవడంతో కాకినాడ జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నికల్‌ వర్సిటీ (జేఎన్‌టీయూకే) ఆయా కాలేజీలకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నెల 31వ తేదీలోగా చెల్లించి, ఫిబ్రవరి 5వ తేదీలోగా రసీదులు సమర్పించాలని ఆదేశించింది. ఇలా నోటీసులు వచ్చినా కాలేజీలు మాత్రం పట్టించుకోవడం లేదు. తమకు ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయి నిధులు వచ్చాకే వర్సిటీల ఫీజు చెల్లిస్తామని స్పష్టం చేస్తున్నాయి.   

ఇవ్వక పోయినా, ఇచ్చేశామంటోంది.. 
ఇంజినీరింగ్‌ కోర్సులతో పాటు డిగ్రీ, ఇతర కోర్సులు చదువుతున్న విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు, స్కాలర్‌షిప్పుల మొత్తాన్ని  ప్రభుత్వం గత కొన్నేళ్లుగా పూర్తిగా విడుదల చేయడం లేదని కాలేజీల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. అన్ని రకాల బకాయిలు కలిపి గత ఏడాది నాటికి రూ.919 కోట్ల వరకు అందాల్సి ఉందని చెబుతున్నాయి. ఇవి కాకుండా ఈ ఏడాది ఫీజులు,  స్కాలర్‌షిప్పుల మొత్తం రూ.1,252 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందంటున్నాయి. కాగా, ప్రభుత్వం మాత్రం ఫీజులు, స్కాలర్‌షిప్పులను ఎప్పటికప్పుడు చెల్లించేస్తున్నామని చెబుతోంది. బకాయిలు రూ.400 కోట్లలోపే ఉన్నాయంటోంది. ప్రభుత్వం ఆయా శాఖల ద్వారా స్కాలర్‌షిప్పులు, ఫీజుల మొత్తాలను మంజూరు చేసినట్లు పత్రాలపై చూపిస్తున్నా, ట్రెజరీల ద్వారా ప్రభుత్వం మొకాలడ్డుతోంది. ఆరు నెలలుగా ఇలా నిధులు విడుదల చేయడం లేదని ముఖ్య కార్యదర్శి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే తెలుస్తోంది.  

ఫీజుల పెంపునకు సర్కారు యోచన  
గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజుల మొత్తాన్ని అందించేంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ విధానానికి స్వస్తి చెప్పారు. బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీయే తదితర కోర్సులకు ట్యూషన్‌ ఫీజు గరిష్టంగా లక్షన్నరకు పైగా ఉంటోంది. రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు ఫీజులున్న కాలేజీల సంఖ్య అధికంగా ఉంది. ప్రభుత్వం మాత్రం కేవలం రూ.35 వేలు మాత్రమే ఇస్తోంది. దీంతో మిగిలిన మొత్తాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి కట్టాల్సి వస్తోంది. ఆ ఇస్తామన్న రూ.35 వేలు కూడా సకాలంలో విడుదల చేయక పోవడంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పైగా ఈ మొత్తాన్ని పెంచకుండా కళాశాల ఫీజులు మాత్రం పెంచుతుండటం దారుణం అని తల్లిదండ్రులు వాపోతున్నారు. అంతా అగమ్యగోచరంగా ఉందంటున్నారు. మూడేళ్ల క్రితం ఇంజనీరింగ్‌ ఫీజును గరిష్టంగా రూ.1.10 లక్షల వరకు పెంచిన ప్రభుత్వం తాజాగా ఇప్పుడు మళ్లీ పెంచాలని నిర్ణయించడం విద్యార్థులకు ఆందోళన కలిగిస్తోంది.    
 
వైఎస్‌ జగన్‌ ప్రకటనతో సర్కారు పెద్దల్లో గుబులు 
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థుల చదువుకు అయ్యే ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని, దాంతోపాటు విద్యార్థుల వసతి, భోజన ఖర్చుల కోసం ఏటా రూ.20 వేలు ఇస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన నవరత్న హామీల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ హామీ ప్రజల్లోకి బాగా చొచ్చుకు పోవడంతో ప్రభుత్వ పెద్దల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పెంపుపై కమిటీ వేసి నివేదిక తెప్పించుకుంది. రూ.35 వేలుగా ఉన్న ఫీజును రూ.65 వేలు చేయాలని కమిటీ నివేదిక ఇవ్వడంతో ఆ మేరకు ఎన్నికల ముందు ప్రకటన చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.  

గతంలో స్కాలర్‌షిప్పులను సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా అందించేవారు. కాలేజీలు విద్యార్థుల దరఖాస్తులను అందిస్తే ఈపాస్‌ ద్వారా మంజూరు చేయించేవారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్‌ కోర్సుల ఫీజులు, స్కాలర్‌షిప్పులన్నింటికీ కలిపి జ్ఞానభూమి వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయించారు. ఈ వెబ్‌సైట్లో వివరాలు అప్‌లోడ్‌ చేయడం, మంజూరు చేయించుకోవడం గందరగోళంగా మారింది. కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు.  

ప్రభుత్వం నుంచి భారీగా బకాయిలు రావలసి ఉండడంతో కాలేజీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది. పలు కాలేజీల్లో సిబ్బందికి జీతాలు కూడా సరిగా ఇవ్వడం లేదు. బకాయిలు వచ్చినప్పుడే ఇస్తామని, లేదంటే వెళ్లిపోవచ్చని తెగేసి చెబుతున్నాయి. మరికొన్ని కాలేజీల్లో సిబ్బందిని భారీగా తగ్గించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement