ఐటీ 'కల'కలం | Campus placements in Telugu states engineering colleges down | Sakshi
Sakshi News home page

ఐటీ 'కల'కలం

Published Sun, Dec 17 2017 1:18 AM | Last Updated on Sun, Dec 17 2017 7:31 AM

Campus placements in Telugu states engineering colleges down - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎంతో ఆశతో ఇంజనీరింగ్‌ పూర్తి చేస్తున్న విద్యార్థుల ‘ఐటీ’ కలలు కల్లలవుతున్నాయి. చదువు పూర్తికాగానే ఉద్యోగం, మంచి వేతనం వస్తుందన్న ఆశలు కళ్ల ముందే కుప్పకూలుతున్నాయి. ఐటీ కంపెనీలు కాలేజీల్లో క్యాంపస్‌ నియామకాలు తగ్గించేయడం, కొన్ని సంస్థలు అసలు నియామకాల ఊసే ఎత్తకపోతుండటంతో విద్యార్థులు ఆందోళనలో మునిగిపోతున్నారు. గతేడాది దాకా క్యాంపస్‌ నియామకాల్లో పెద్ద సంఖ్యలోనే విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చిన మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్‌బుక్, ఒరాకిల్, డెలాయిట్, జేపీ మోర్గాన్‌ వంటి సంస్థలు ఈ ఏడాది ఒక్కో కాలేజీలో ఐదారుగురికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చాయి. ప్రముఖ అమెరికన్‌ కంపెనీ కాగ్నిజెంట్‌ అయితే ఈ ఏడాది దేశంలో ఒక్క విద్యార్థికి కూడా ఉద్యోగం ఇవ్వకపోవడం గమనార్హం. మరో అమెరికన్‌ కంపెనీ యాక్సెంచర్‌ గతేడాదితో పోలిస్తే ఈసారి 50 శాతం మేర నియామకాలు తగ్గించుకుంది. దేశీయ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు అదే దారిలో పయనిస్తున్నాయి. విప్రో, క్యాప్‌జెమినీ కంపెనీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వెయ్యి మందికి మాత్రమే ఉద్యోగావకాశాలు ఇచ్చాయి.

పాతిక కాలేజీల్లోనే క్యాంపస్‌ నియామకాలు!
ఐటీ కంపెనీలు ఏటా రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్‌తోపాటు ఏపీలోని విశాఖపట్నం, కాకినాడ, అనంతపురం, తిరుపతిలలో ఉన్న సుమారు వంద కాలేజీల్లో క్యాంపస్‌ నియామకాలు జరుపుతుంటాయి. కానీ ఈ ఏడాది కేవలం 25 కాలేజీల్లోనే క్యాంపస్‌ నియామకాలు చేపట్టాయి. ఇన్ఫోసిస్‌ కేవలం 15 కాలేజీలకే పరిమితంకాగా.. టీసీఎస్‌ 22 కాలేజీలు, విప్రో, క్యాప్‌జెమినీ కంపెనీలు హైదరాబాద్‌లోని పది కాలేజీలతో సరిపెట్టాయి. ఉస్మానియా వర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజ్, జేఎన్టీయూ, సీబీఐటీ, వాసవి తదితర ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఏటా నియామకాలు చేపట్టే మైక్రోసాఫ్ట్‌ కంపెనీ.. ఈ ఏడాది వాటి జోలికే పోలేదు. కేవలం హైదరాబాద్‌ ఐఐటీ, వరంగల్‌ నిట్‌లకు చెందిన పది మంది విద్యార్థులకు మత్రమే ఉద్యోగాలు ఇచ్చింది. సీబీఐటీ, వాసవి కాలేజీల్లో అత్యంత ప్రతిభావంతులైన నలుగురైదుగురు విద్యార్థులను, అది కూడా ఇంటర్న్‌షిప్‌ కింద ఎంపిక చేసుకుంది. ఏటా 50 నుంచి వంద మంది విద్యార్థులను ఎంపిక చేసుకునే డెలాయిట్‌ సంస్థ కూడా ఈసారి సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది. ఇక దేశీయ కంపెనీలు గతేడాదితో పోలిస్తే 60 శాతం మేర నియామకాలు తగ్గించుకున్నాయి.

ఆందోళనలో విద్యార్థులు
ఎంసెట్‌లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో దాదాపు 50 శాతం మంది.. కంప్యూటర్‌ సైన్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కోర్సుల్లోనే చేరారు. కానీ ఐటీ కంపెనీలు పరిమిత సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటుడటంతో వారు ఆందోళనలో మునిగిపోయారు. సీబీఐటీలో గతేడాది 1,350 మందికి వివిధ కంపెనీలు ఉద్యోగాలను ఆఫర్‌ చేయగా.. ఈసారి ఆ సంఖ్య 750కి లోపేకావడం గమనార్హం. వాసవి, ఎంవీఎస్‌ఆర్, విజ్ఞానజ్యోతి, నారాయణమ్మ, శ్రీనిధి వంటి టాప్‌ కాలేజీల్లోనూ ఈ ఏడాది నియామకాలు 60 శాతం మేర తగ్గాయి. గతేడాది హైదరాబాద్‌లో 40–50 కాలేజీల్లో క్యాంపస్‌ నియామకాలు చేపట్టిన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, యాక్సెంచర్‌ తదితర సంస్థలు ఈ ఏడాది కేవలం పది కాలేజీలకు పరిమితమయ్యాయి.

ఉన్న ఉద్యోగులకే ఉద్వాసన!
వివిధ ఐటీ సంస్థలు ఈ ఏడాది దాదాపు 56 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండగా.. వచ్చే ఆర్నెల్లలో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘ఎక్స్‌పెరీస్‌ ఐటీ–మ్యాన్‌పవర్‌గ్రూప్‌ ఇండియా’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐటీ ఎంప్లాయ్‌మెంట్‌ ఔట్‌లుక్‌ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అటు సీనియర్‌ ఉద్యోగుల తొలగింపుతోపాటు కొత్త ఉద్యోగాల కల్పన ప్రక్రియలో క్షీణత నమోదవుతున్నట్లు తేలింది. ఐటీ పరిశ్రమలోని ఈ మందగమనంతో.. స్టార్టప్‌లు, ఐటీ ఉత్పత్తులు, సర్వీస్‌ సంస్థలపై ప్రభావం పడుతుందని సర్వే నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సాంకేతికంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా మన దేశంలోని ఐటీ ఉద్యోగులు నైపుణ్యాలను పెంచుకోకపోవడం ఉద్యోగాల తొలగింపునకు కారణమవుతోంది. అదే నైపుణ్యమున్న ఉద్యోగులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్‌ నైపుణ్యాలు కలిగిన వారికి 29 శాతం, బిగ్‌ డేటా అండ్‌ అనలిస్ట్‌లకు 22 శాతం, మెషీన్‌ లెర్నింగ్, మొబిలిటీలకు 12 శాతం చొప్పున, గ్లోబల్‌ కంటెంట్‌ సొల్యూషన్లలో నైపుణ్యం ఉన్న వారికి 10 శాతం మేర అదనంగా అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

నైపుణ్యం పెంచుకోవాల్సిందే..
మార్కెట్‌లో డిమాండ్‌కు తగ్గట్లుగా నైపుణ్యాలను పెంపొందించుకుంటే... అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయని ఎక్స్‌పెరీస్‌ సంస్థ అధ్యక్షుడు మన్మీత్‌సింగ్‌ పేర్కొన్నారు. ఐటీ సంస్థలు కూడా తమ ఉద్యోగుల నైపుణ్యాలను పెంచుకునేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ప్రపంచం ‘డిజిటల్‌ వరల్డ్‌’గా పరివర్తన చెందుతున్న దశలో నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం అత్యంత ఆవశ్యకమని మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ ఇండియా ఎండీ ఏజీ రావు అభిప్రాయపడ్డారు. ‘నాస్కామ్‌’ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని తెలిపారు.

ఆటోమేషనే ప్రధాన కారణం..
ఐటీ కంపెనీలు ఆటోమేషన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇప్పటికే ఉన్న ఉద్యోగులను సైతం ఆటోమేషన్‌ వైపు మళ్లిస్తున్నాయి. దానికితోడు కోడింగ్‌ బాగా వచ్చిన వారికే ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. కొన్ని కంపెనీలు కేవలం కంప్యూటర్‌ సైన్స్, ఐటీ విద్యార్థులను మాత్రమే క్యాంపస్‌ నియామక పరీక్షలకు అనుమతిస్తున్నాయి. వచ్చే ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉంటుందా అన్నది ఇప్పుడే చెప్పలేం. కానీ విద్యార్థులు కోడింగ్‌పై దృష్టి సారిస్తేనే మంచి ఉద్యోగాలు పొందగలుగుతారు.
– ఎన్‌ఎల్‌ఎన్‌ రెడ్డి, సీబీఐటీ ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌


హైదరాబాద్‌లో గత ఐదేళ్ల క్యాంపస్‌ నియామకాలు తీరు
సంవత్సరం    సంస్థలు    కాలేజీలు    ఉద్యోగాలు
2013        73        79        24,500
2014        69        82        26,300
2015        63        63        19,700
2016        71        55        21,200
2017        56        43        16,700
2018        17        51        3,800 (డిసెంబర్‌ నాటికి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement