ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యాలు తల్లిదండ్రుల ఫోన్లకు పంపుతున్న సందేశాలు
సాక్షి, అమరావతి బ్యూరో: గతంలో ఒక వెలుగు వెలిగిన ఇంజినీరింగ్ కళాశాలలు ప్రస్తుతం ఒక్కోటిగా కనుమరుగవుతున్నాయి. ఇంజినీరింగ్ చేసినా పెద్దగా ఉపాధి అవకాశాలు లేక సాధారణ డిగ్రీ వైపు విద్యార్థులు మొగ్గు చూపుతుండటం, గతంతో పోలి్చతే కళాశాలల స్థితిగతులు, విద్యార్థులు, లెక్చరర్ల సంఖ్యపై ప్రభుత్వం నిఘా పెంచటంతో కళాశాలల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. జిల్లాలో 40 ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా అందులో ఆరు నుంచి ఏడు కళాశాలల్లో ఆడ్మిషన్ల సంఖ్య 25 శాతం కన్నా తక్కువగా ఉంటోంది. వాటిలో కొన్ని కోర్సుల్లో చేతి వేళ్లతో లెక్కగట్టేలా విద్యార్థులు చేరుతున్నారు. ఇటువంటి కళాశాలలు ఈ ఏడాది ఆడ్మిషన్లకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ 25 శాతం కన్నా తక్కువ ప్రవేశాలు, నాణ్యత లేని కళాశాలల గుర్తింపు రద్దు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. (చదవండి: హాస్టల్ మూసివేసినా మెస్ బిల్ కట్టాలట!)
జిల్లాలో ఆరు కళాశాలలపై వేటు?
గుంటూరు జిల్లా పరిధిలో 40 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో అన్ని రకాల కోర్సులు కలుపుకొని 16,910 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఆరు కళాశాలలు 25 శాతం కన్నా తక్కువ ప్రవేశాలు పొందుతున్నాయని సమాచారం. ఈ కళాశాలల్లో కనీస నాణ్యత ప్రమాణాలు లేకపోవటంతో వీటిలో విద్యార్థులు చేరటానికి ఇష్టపడటం లేదు. గత నాలుగైదేళ్లుగా ఈ కళాశాలలు కనీస స్థాయిలో ఆడ్మిషన్లు పొందటానికి పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. విద్యార్థులకు ఎదురుతాయిలాలు ఇచ్చి మరీ ప్రవేశాలు పొందుతున్నాయి. అందుకోసం “మా కాలేజీలో చేరండి లాప్‌ట్యాప్ ఉచితం. ల్యాబ్ ఫీజు పూర్తిగా రద్దు, బస్ ఫీజు నామమాత్రంగా వసూలు చేస్తాం. హాస్టల్ ఫీజు భారీగా తగ్గిస్తాం...మీకు ఏమైనా డిమాండ్లు ఉంటే చెప్పండి తీరుస్తాం.’’ అంటూ ఆఫర్ల వలలు విసిరేవారు. కేవలం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం చలువతోనే వీటి మనుగడ ఆధారపడుతోంది. ఈ పరిస్థితిని గుర్తించి 2017లో జిల్లాలో తక్కువ అడ్మిషన్లు పొందుతున్న కళాశాలల సీట్లలో కొంత మేర కోత విధించింది. జిల్లాలో ఒక్కో కళాశాలలో 60 నుంచి 200 దాకా కోత పడి సుమారు ఐదు వేల సీట్లను రద్దు చేశారు. (చదవండి: కళకళలాడుతున్న బోధనాస్పత్రులు..)
తెగ విసిగించేస్తారు...
ఎంసెట్ పరీక్ష ముగిసిన నాటి నుంచి ఇంటరీ్మడియెట్ పూర్తి చేసిన విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు ఒకటే ఎస్‌ఎంఎస్‌లు, ఫోన్ కాల్స్ వస్తాయి. తమ కళాశాల ప్రత్యేకతలు, విశేషాలు వివరిస్తూ, తమ కాలేజీలో చేరమని విన్నపాలు చేస్తారు. రెండు నెలల పాటు తల్లిదండ్రులు ప్రతి రోజూ ఈ ఫోన్ కాల్స్ భరించలేక తలలు పట్టుకునే పరిస్థితి.తమ కాలేజీల్లో పనిచేస్తున్న వారికి, కొత్తగా అధ్యాపకులుగా చేరాలన్నవారికి యాజమాన్యాలు 10 మంది విద్యార్థులను చేర్చాలన్న టార్గెట్లు పెడుతుంటాయి. దీంతో సిబ్బందికి సైతం ఇది పెద్ద తలనొప్పి వ్యవహారమే.
సీట్లు తగ్గితే ప్రమాణాలు పెరిగే అవకాశం...
ప్రస్తుతం ఇంజినీరింగ్ చదువుతున్న వారిలో కేవలం 60 శాతం మంది మాత్రమే కోర్సు ముగిసే సమయానికి సరి్టఫికెట్లతో బయటకు వస్తున్నారు. మిగిలిన 40 శాతం మంది బ్యాక్‌లాగ్‌లతో రెండు మూడేళ్ల పాటు కుస్తీ పడి ముగించేవారు కొందరైతే, విసిగి కాడి పడేసేవారు కొందరు. కోర్సు పూర్తి చేరసిన వారిలో కేవలం 12 నుంచి 14 శాతం మంది మాత్రమే ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తున్నారని ఓ సర్వే ద్వారా తెలుస్తోంది. ఈ దుస్థితికి కారణం ప్రమాణాలు లేని ఇంజినీరింగ్ చదువులే. సీట్లు తగ్గి, వాటి నాణ్యతపై నిఘా పెడితే ప్రమాణాలు పెరిగి విద్యార్థులు కోర్సులు పూర్తి చేసి, మంచి అవకాశాలు పొందే ఆస్కారం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment