సాక్షి, హైదరాబాద్ : ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరి 1.5 లక్షల మంది విద్యార్థులకు శాపంగా మారింది. రాష్ట్రంలో 968 కాలేజీలు తమ గుర్తింపును రెన్యువల్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోకపోవడంతో విద్యార్థులు ఫీజు రీయింబర్స్ మెంట్‌కు దూరమయ్యే పరిస్థితి తలెత్తింది. 2 నెలల్లో విద్యా సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఫీజులు, స్కాలర్‌షిప్‌లపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
దరఖాస్తు చేసుకున్నవి 6,161 కాలేజీలే
రాష్ట్రంలో 7,129 పోస్టుమెట్రిక్ కాలేజీలున్నాయి. వాటిలో 16 లక్షల మంది విద్యార్థులు వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారు. ఇందులో 13.5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు దరఖాస్తులు సమర్పించారు. ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించిన సంక్షేమ శాఖలు.. వాటిని పరిశీలించి పథకాలకు అర్హత ఉందో లేదో తేల్చాలి.
దరఖాస్తుల పరిశీలనలో ముందుగా కాలేజీకి గుర్తింపు ఉందా లేదా? అన్న అంశాన్ని పరిశీలిస్తారు. సంబంధిత బోర్డు/ యూనివర్సిటీ నుంచి గుర్తింపు పత్రాన్ని సమర్పిస్తేనే ఆ కాలేజీల్లో ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలను అమలు చేస్తారు. ప్రతి కాలేజీకి సంబంధిత బోర్డు/యూనివర్సిటీ గుర్తింపు ఉన్నప్పటికీ... ఏటా ఆ గుర్తింపును రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ పలు కాలేజీలు ఈ గుర్తింపు రెన్యువల్‌కు దరఖాస్తు కూడా చేసుకోలేదు. దీంతో ఆ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అయోమయం నెలకొంది.
రాష్ట్రంలో 7,129 కాలేజీలు ఉండగా.. వాటిలో 2017–18 విద్యా సంవత్సరానికి 6,161 కాలేజీలు మాత్రమే గుర్తింపు రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో 5,812 కాలేజీల గుర్తింపు రెన్యువల్ అయింది. మరో 1,317 కాలేజీల రెన్యువల్ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఇంకా 968 కాలేజీలు గుర్తింపు రెన్యువల్‌కు దరఖాస్తులు సమర్పించలేదు. దీంతో ఈ–పాస్ వెబ్‌సైట్‌లోనూ ఆ కాలేజీ వివరాలు అప్‌డేట్ కాలేదు. దీంతో ఆ కాలేజీల్లో దాదాపు 1.5 లక్షల మంది విద్యార్థుల దరఖాస్తుల పరిశీలన సందిగ్ధంలో పడింది.
అవకాశం చేజారుతోంది..
పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ గతనెల రెండో వారంలో ముగిసింది. దాదాపు ఆర్నెళ్లపాటు సాగిన ఈ ప్రక్రియతో 98 శాతం విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా గుర్తింపు రెన్యువల్ చేసుకున్న కాలేజీల వివరాలే ఈపాస్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమయ్యేవి. రెన్యువల్ చేయించని కాలేజీలు వెబ్‌సైట్‌లో లేకపోవడంతో ఆయా కాలేజీల విద్యార్థులు దరఖాస్తు సైతం చేసుకునే అవకాశం లేకపోయేది.
విద్యార్థులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని కాలేజీల వివరాలను వెబ్‌సైట్‌లో అనుమతిస్తూ ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయించింది. కానీ కాలేజీ గుర్తింపు రెన్యువల్ అయ్యాకే దరఖాస్తుల పరిశీలన, ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ జారీ చేసేలా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ ముగిసినా చాలా కాలేజీలు గుర్తింపును అప్‌డేట్ చేసుకోకపోవడం గమనార్హం.
రాష్ట్రంలో మొత్తం కాలేజీలు: 7,129
గుర్తింపు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నవి: 6,161
ఇప్పటివరకు రెన్యువల్ పత్రాలు పొందినవి: 5,812
రెన్యువల్ కోసం దరఖాస్తులు సమర్పించనివి: 968
రెన్యువల్ పెండింగ్‌లో ఉన్నవి: 1,317
Comments
Please login to add a commentAdd a comment