సాక్షి, గుంటూరు : ఐదేళ్ల కాలంలో అనేక మంది ప్రతిభ గల పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. అనేక ఆంక్షలతో ఫీజుల్లో ఎగనామం పెట్టడంతో వారి ఆశలు నిరాశగానే మిగిలిపోయాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ కాలేజీలకు ఫీజులను పెంచుకునేందుకు అనుమతిలిచ్చేసిన టీడీపీ ప్రభుత్వం.. పెరిగిన ఫీజులకు అనుగుణంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపచేయలేదు.
కాలేజీ ఫీజు ఎంతైనా ప్రభుత్వం మాత్రం ఏటా రూ.35 వేలు మాత్రమే చెల్లిస్తామని చెప్పింది. మంచి ర్యాంకు తెచ్చుకుని ఏ–గ్రేడ్ కళాశాలలో సీటు సంపాదించిన విద్యార్థులకు ఇదే వర్తింపజేసింది. దీంతో మిగిలిన ఫీజులు చెల్లించకలేక సీ గ్రేడ్, డీ గ్రేడ్ కళాశాలల్లోనే చేరాల్సిన దుర్భర పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజా సంకల్పయాత్ర ద్వారా విద్యార్థుల కష్టాలను దగ్గర నుంచి చూసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తానని ప్రకటించారు. వీటితోపాటు ప్రతి ఇంటా ఉన్నత విద్యావంతులు ఉండాలనే లక్ష్యంలో అనేక వరాలిచ్చారు. జగన్ నిర్ణయం పట్ల విద్యార్థులు హర్హం వ్యక్తం చేస్తున్నారు.
పేద విద్యార్థులకు వైఎస్ జగన్ ఇచ్చిన వరాలు..
- పేద విద్యార్థి చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తారు
- పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు వసతి, భోజనం కోసం అదనంగా ఏటా రూ.20 వేలు ప్రతి విద్యార్థికి ఇస్తారు.
- సంవత్సరానికి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు ఇస్తారు. (ఫీజు ఎంతైతే అంత +రూ.20 వేలు)
ప్రభుత్వ సహకారం అందలేదు
2013లో వైజాగ్‌లోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్‌లో సీటు వచ్చింది. అగ్రశ్రేణి కళాశాల కావడంతో అక్కడ ఫీజు రూ. 80 వేలు ఉంది. ప్రభుత్వం కేవలం రూ.35 వేలు ఇస్తానని చెప్పడంతో మిగిలిన డబ్బు చెల్లించే స్థోమత లేక సీటు వదులుకున్నాను. ఇక గత్యంతర లేక గుంటూరులోని మామూలు కళాశాల్లో చేరాను. ప్రభుత్వం పూర్తి ఫీజు చెల్లించేందుకు ముందుకు వచ్చి ఉంటే బీటెక్ చివరి సంవత్సరంలోనే మంచి ప్లేస్‌మెంట్ సాధించి ఉండేవాడిని. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆంక్షలు ఎత్తివేస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది.
– షేక్ అబ్దుల్ రజాక్, ఎంటెక్ విద్యార్థి, పిడుగురాళ్ల
Comments
Please login to add a commentAdd a comment