హర్‌ దిల్‌ మే వైఎస్సార్‌ | YS Rajashekar Reddy Is Benifited To the Minorities | Sakshi
Sakshi News home page

హర్‌ దిల్‌ మే వైఎస్సార్‌

Published Tue, Apr 2 2019 11:07 AM | Last Updated on Tue, Apr 2 2019 11:07 AM

YS Rajashekar Reddy Is Benifited To the Minorities  - Sakshi

సాక్షి, గుంటూరు : బడుగుల అంతులేని బాధలు ఆయన చూశాడు అణగారిన వర్గాల ఆవేదనలు ఆయన విన్నాడు అభాగ్యుల ఆకలి కేకలను ఆయన ఆలకించాడుబిడ్డల భవిష్యత్‌పై తల్లిదండ్రుల ఆకాంక్షలను గుర్తించాడుఉన్నత చదువులపై పిల్లలు పెంచుకున్న ఆశలు తెలుసుకున్నాడు..అందుకే దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సంక్షేమ రాజ్యాన్ని స్థాపించాడు.. ముస్లిం మైనార్టీ కుటుంబాలకు  అండగా నిలిచాడు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పిల్లల ఉన్నత చదువులకు అక్షర బాటలు పరిచాడు.. నాలుగు శాతం రిజర్వేషన్లతో ఉన్నత విద్యావకాశాలను పేదల ఇంటి ముంగిటకు నడిపించాడు. ఎదిగిన బిడ్డల భవిష్యత్‌లో, పిల్లలను చూసి మురిసిన తల్లిదండ్రుల ఆనందంలో నిత్యం చిరునవ్వై కొలువుదీరాడు. కాలంలో కలిసిపోయినా వెన్నెలంటి మంచితనంతో కలకాలం ప్రతి ఇంటా దేదీప్యమానంగా వెలుగొందుతూనే ఉన్నారు దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి. 

ప్రతిసారీ ఎన్నికలకు ముందు నేతలు ఇచ్చే హామీలను నమ్మి ఓట్లేయడం.. అనంతరం తమ సంక్షేమాన్ని గాలికొదిలిన ప్రభుత్వాన్ని నిందించుకోవడం. ఇదీ 2004 ముందు వరకు ముస్లింల పరిస్థితి. 2004లో దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ముస్లిం సంక్షేమానికి బాటలు వేస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్టే సమాజంలో ముస్లింలను తలెత్తుకుని జీవించేలా చేశారు.     

వెలుగు కిరణాలు...4 శాతం రిజర్వేషన్లు
ముస్లింల వెనుకబాటుతనాన్ని తొలగించేందుకు రాజశేఖరరెడ్డి రిజర్వేషన్లు ప్రవేశ పెట్టారు.15 ఉపకులాలను బీసీలుగా గుర్తించి విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలలో 5 శాతం రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించేందుకు జీవో తెచ్చి ఆచరణలో పెట్టారు. కొన్ని అడ్డంకులు ఎదురైనా ఇచ్చిన మాటకు కట్టుబడి న్యాయస్థానంలో స్టే తీసుకొచ్చి అమలు చేశారు. ఆటంకాలు తొలగించేందుకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2007లో జీవోఎంఎస్‌ నంబరు 29ని జారీ చేశారు. దీంతో ఎంతో మంది ముస్లింలు ఉద్యోగ, వయో పరిమితి, ఉపాధి రంగాల్లో అర్హత సాధించారు. 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం
పదో తరగతి తరువాత కళాశాల విద్య కావాలంటే వేలాది రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. వైఎస్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని 2007లో వర్తింప చేశారు. అర్హులైన విద్యార్థులకు ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్, బీఈడీ, పీజీ, బీ ఫార్మసీ, ఐటీఐ, డిప్లొమో, లా, నర్సింగ్‌ వంటి విద్యను ప్రభుత్వ కళాశాలలతోపాటు ప్రైవేటు సంస్థలలోనూ ఉచితంగా అందించారు. దీంతోపాటు స్కాలర్‌షిప్‌లు మంజూరు చేశారు. 2004 ముందు ఏటా 3 వేలలోపు మందికి  స్కాలర్‌షిప్‌లు అందుతుండగా వైఎస్సార్‌ ఈ సంఖ్యను 30 వేల మందికి పెంచారు.

రుణ మాఫీ...కొత్త రుణాలు
2006లో వైఎస్సార్‌ రుణ మాఫీ పథకాన్ని ప్రవేశ పెట్టారు. దీంతో జిల్లాలో 25 వేల మందికిపైగా ముస్లింలపై రుణ భారం తొలగింది. ఆ తరువాత రుణాలు తిరిగి చెల్లించే మార్జిన్‌ మనీ విధానాన్ని తొలగించి 50 శాతం సబ్సిడీతో రుణాలు ఇచ్చేందుకు కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టారు. 

ఉచిత వివాహాలు
సామూహిక వివాహాల పథకాన్ని 2006లో ప్రవేశ పెట్టారు. పెళ్లిళ్లతోపాటు వధూవరులకు పెళ్లి దుస్తులు, రెండు గ్రాముల బంగారంతో కూడిన నల్లపూసల హారం(కాలిపోత్‌ల లచ్చ), పవిత్ర గ్రంథం ఖురాన్, మంచం, వంట సామగ్రిలను ఒక్కో జంటకు రూ.15 వేలు ఖర్చు చేసి ఉచితంగా అందించారు వైఎస్సార్‌. 

తండ్రి బాటలోనే..

  • వైఎస్సార్‌ బాటలోనే ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి పయనిస్తున్నారు. ఇప్పటికే ముస్లిం సంక్షేమం కోసం అనేక వరాలు ప్రకటించారు.   
  • మసీదుల్లో ఉండే ఇమామ్‌లకు నెలకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.4 వేలు  గౌరవ వేతనం ఇస్తారు.
  • దుల్హన్‌ పథకం ద్వారా ముస్లిం పిల్లల వివాహనికి రూ.లక్ష అర్థిక సాయం చేస్తామన్నారు
  • ముస్లిం సబ్‌ప్లాన్‌తోపాటు ఇస్లామిక్‌ బ్యాంకుల ఏర్పాటుకు హామీ ఇచ్చారు.
  • సున్నా వడ్డీతో ముస్లిం యువతకు  రూ.75 వేల వరకు రుణం అందిస్తారు.
  • వైఎస్సార్‌ చేయూత పథకం కింద 45 ఏళ్లు దాటిన ముస్లిం మహిళలకు పెన్షన్లు, రూ.75 వేల వరకు ఆర్థికసాయం ఇస్తారు.
  • నిరుద్యోగ యువతకు మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా రూ.5 లక్షల వరకు రుణాలు అందిస్తారు.
  • ముస్లింలకు చట్టసభల్లో ప్రాధాన్యత కల్పిస్తారు.
  • నామినేటెడ్‌ పదవులు, ప్రభుత్వ కాంట్రాక్ట్‌ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారు.
  • ప్రతి నియోజకవర్గానికి ఒక షాదీఖానా నిర్మాణం చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement