సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో భర్తీకి నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీసెట్) ప్రవేశాల కౌన్సెలింగ్‌లో ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్‌ఈ)కే జై కొట్టారు. రెండో స్థానంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ), మూడో స్థానంలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ), నాలుగో స్థానంలో మెకానికల్ ఇంజనీరింగ్ నిలిచాయి. కొత్తగా ప్రవేశపెట్టిన డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్.. ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), డిజైన్, కంప్యూటర్ నెట్‌వర్కింగ్, ఆటోమేషన్ తదితర కోర్సుల్లోనూ చేరికలు గతంలో కంటే పెరిగాయి. అయితే ఇంకా భర్తీ కాని సీట్లు కొన్ని విభాగాల్లో ఎక్కువగానే ఉన్నాయి.
తొలిసారి ‘బీ’ కేటగిరీలో మెరిట్ ప్రాతిపదికన సీట్ల కేటాయింపు
గతంలో ‘బీ’ కేటగిరీ సీట్లను ఆయా కళాశాలలే భర్తీ చేసుకునేవి. రిజర్వేషన్లు, మెరిట్‌తో సంబంధం లేకుండా తాము నిర్దేశించిన ఫీజును చెల్లించిన వారికి ఈ సీట్లను కేటాయించేవి. తద్వారా ప్రవేశ పరీక్షలో మెరిట్ ర్యాంకు వచ్చిన వారికి మొండిచేయి చూపేవి. పైగా రిజర్వేషన్లను కూడా అమలు చేసేవి కావు. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళల కేటగిరీల్లో ఆయా వర్గాలకు దక్కాల్సిన సీట్లు బయట విద్యార్థులకు దక్కేవి. ఫలితంగా నిరుపేద మెరిట్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయేవారు. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం నుంచి ‘బీ’ కేటగిరీ సీట్లను సైతం ప్రభుత్వం కన్వీనర్ కోటాలో భర్తీ చేయించింది. ‘బీ’ కేటగిరీలోని ఎన్‌ఆర్‌ఐ కోటాలో మిగులు సీట్లు, నాన్ ఎన్‌ఆర్‌ఐ కోటాలో సీట్లకు కలిపి కన్వీనరే కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో ఈసారి ఆయా కళాశాలల్లో రిజర్వుడ్ మెరిట్ అభ్యర్థులకు అవకా>శం దక్కింది. ‘బీ’ కేటగిరీలో 13,564 మందికి సీట్లను కేటాయించారు.
మొత్తం 1,12,699 సీట్లు..
రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం ఇన్‌టేక్ 1,12,699 సీట్లుండగా 80,935 సీట్లు తొలి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ అయ్యాయి. ఈ సీట్లలో అత్యధికం కంప్యూటర్ సైన్స్‌లోనే ఉండగా భర్తీలోనూ ఇదే అగ్రస్థానంలో నిలిచింది. సీఎస్‌ఈలో మొత్తం 24,904 సీట్లుండగా తొలి విడతలోనే 23,835 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా కేవలం 1,069 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక ఈసీఈలో 23,977 సీట్లుండగా 20,275 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 3,702 సీట్లు మిగిలాయి. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్‌లో మొత్తం 12,678 సీట్లకు 4,760 భర్తీ కాగా 7,918 మిగిలిపోయాయి. అదేవిధంగా ఈఈఈలో 10,931లో 6,410 సీట్లు భర్తీ కాగా 4,521 సీట్లు మిగిలాయి. ఇక సివిల్ ఇంజనీరింగ్‌లో 9,904 సీట్లకు 4,455 సీట్లు భర్తీ కాగా 5,449 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment