ఇంజనీరింగ్ కళాశాలలకు ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదులు స్వీకరించి, పరిష్కరించే వ్యవస్థలు ఉండాలని ఏఐసీటీఈ ఆదేశించింది.
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని ఇంజనీరింగ్ కళాశాలలకు ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదులు స్వీకరించి, పరిష్కరించే వ్యవస్థలు ఉండాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఆదేశించింది. విద్యార్థులు, అధ్యాపకులు తదితరులెవరైనా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేసే వెసులుబాటు ఉండాలంది. ఇప్పటిదాకా ఆన్‌లైన్ వేదికలు లేని కళాశాలలు వెంటనే వాటిని ఏర్పాటు చేసుకోవాలని ఏఐసీటీఈ సూచించింది.
ప్రతి ఏడాది కళాశాలల అనుమతులు పునరుద్ధరించేటపుడు ఆన్‌లైన్ ఫిర్యాదుల వ్యవస్థ ఉందో లేదో తనిఖీ చేస్తామంది. ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? ఎన్ని పరిష్కారం అయ్యాయి? అనే విషయాలను ప్రతి నెలా కళాశాలలు తమకు తెలియజేయాలని ఏఐసీటీఈ పేర్కొంది.