అన్నీ ఉన్నాయి.. అధ్యాపకులు తప్ప | Shortage of qualified professors in engineering colleges | Sakshi
Sakshi News home page

అన్నీ ఉన్నాయి.. అధ్యాపకులు తప్ప

Published Sat, Feb 3 2018 1:27 AM | Last Updated on Sat, Feb 3 2018 1:27 AM

Shortage of qualified professors in engineering colleges - Sakshi

‘పేరుకే రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఇంజనీరింగ్‌ విద్యా సంస్థలు. కాలేజీల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అర్హులైన అధ్యాపకులే లేరు. 12,333 మంది పీహెచ్‌డీ కలిగిన ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు అవసరమైతే ప్రస్తుతం కేవలం 1,500 మందే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన విద్య అందేదెలా? అందుకే ఐదేళ్ల వరకు మాకు కొత్త సీట్లు వద్దు’ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ విద్య పరిస్థితులపై ఏఐసీటీఈకి రాసిన లేఖలో ప్రభుత్వం పేర్కొన్న అంశాలివీ. 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ విద్యను గాడిలో పెట్టేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ఇప్పటికే సీట్లకు కోత విధిస్తున్న ప్రభుత్వం ఇకపై కొత్త సీట్లను మంజూరు చేయవద్దని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)కి స్పష్టం చేసింది. సరిపడా అధ్యాపకులు లేకపోవడంతో నాణ్యత ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఈ మేరకు రాసిన లేఖలో పేర్కొంది. ఇంగ్లిష్‌ భాషా నైపుణ్యం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ లేకపోవడమే కాకుండా ప్రొఫెసర్ల కొరతతో సబ్జెక్టు పరమైన నాలెడ్జి విద్యార్థులకు అందడం లేదని వివరించింది. ఫలితంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్న విద్యార్థుల సంఖ్య 18 శాతానికి మించడం లేదని వివిధ సర్వేలే స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కాలేజీల్లోని లోపాలను పేర్కొనడంతోపాటు భవిష్యత్‌ అవసరాలను రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అందుకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించింది. 

ఏఐసీటీఈ సగానికి..జేఎన్టీయూ మొత్తానికే కోత 
ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్‌ అవసరాల నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఇంజనీరింగ్‌ విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంపొందించే చర్యల్లో భాగంగా కాలేజీలను కట్టడి చేయాలనే నిర్ణయానికి వచ్చింది. మరోవైపు గడిచిన మూడేళ్లలో వరుసగా 30 శాతం లోపు సీట్లు భర్తీ అయిన కాలేజీల ఇంటేక్‌లో సగం సీట్లకు కోత విధిస్తామని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. తమ అప్రూవల్‌ ప్రాసెస్‌ హ్యాండ్‌బుక్‌లోనూ ఈ అంశాన్ని స్పష్టం చేసింది. జేఎన్‌టీయూ మాత్రం అనుబంధ గుర్తింపు విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. వరుసగా మూడేళ్లలో 25 శాతం కంటే తక్కువ సీట్లు భర్తీ అయిన కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వబోమని స్పష్టం చేయడంతో యాజమాన్యాలు ఆందోళనలో పడ్డాయి. గత మూడేళ్లను కాకుండా వచ్చే మూడేళ్లను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 

ఇప్పటికే చర్యలు.. 
2017–18 విద్యా సంవత్సరంలో ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన అన్ని కాలేజీలకు యూనివర్సిటీలు అనుమతి ఇవ్వలేదు. అన్ని సీట్లను భర్తీ చేసేందుకు ఓకే చెప్పలేదు. 28,961 సీట్లకు కోత పెట్టాయి. మరోవైపు అనుబంధ గుర్తింపు ఇచ్చిన సీట్లలోనూ 29,367 సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. 

20 మందికో అధ్యాపకుడు ఉండాలి.. 
2017–18 నిబంధనల ప్రకారం ప్రతి 15 మందికి ఒక అధ్యాపకుడు అవసరం. తాజాగా ఏఐసీటీఈ ఆ నిబంధనలో మార్పు చేసింది. 2018–19 నిబంధనల ప్రకారం ప్రతి 20 మందికి ఒక అధ్యాపకుడు ఉంటే సరిపోతుంది. మొత్తం విద్యార్థులకు అనుగుణంగా అధ్యాపకులు 1:2:6 రేషియోలో ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉండాలి. 

2017–18 లెక్కలు ఇలా 
పీహెచ్‌డీ అర్హతతో ఉండాల్సిన అధ్యాపకులు12,333 మంది 
ప్రస్తుతం పీహెచ్‌డీ అర్హతతో ఉన్న ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు 1,500 మంది 
2020 నాటికి అయ్యే విద్యార్థుల సంఖ్య 5 లక్షలపైనే 
అందుకు అవసరమైన అధ్యాపకులు 34 వేల మంది 
ఎంటెక్‌ అర్హతతో అవసరమైన అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 22,667 మంది 
పీహెచ్‌డీ అర్హత అవసరమైన మిగతా అధ్యాపకులు
11,333 మంది అవసరమైన ప్రొఫెసర్లు
3,778 మంది అవసరమైన అసోసియేట్‌ ప్రొఫెసర్లు 7,555 మంది  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement