ఇంజినీరింగ్ విద్యలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని జేఎన్‌టీయూ (ఏ) యాజమాన్యం నిర్ణయించింది. నిబంధనలు విస్మరిస్తూ, నామమాత్రంగా ఇంజినీరింగ్ కళాశాలలను నిర్వహిస్తున్న యాజమాన్యాలపై కన్నెర్ర చేసింది. వర్సిటీ చరిత్రలో తొలిసారిగా 30 ఇంజినీరింగ్ కళాశాలల గుర్తింపును రద్దు చేసింది.
అనంతపురం: జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనంతపురం (జేఎన్‌టీయూఏ) పరిధిలోని అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల పర్యవేక్షణ పూర్తయ్యింది. కళాశాల స్థితిగతులు, వసతులు, విద్యార్థి- అధ్యాపక నిష్పత్తి, కళాశాల క్యాంపస్ పరిస్థితి, ఆటస్థలం, గ్రంథాలయ సదుపాయం, ల్యాబ్ తదితర అంశాలను పరిశీలించడానికి యూనివర్సిటీ నిజనిర్ధారణ కమిటీలను నియమించింది. ఏటా ఇంజినీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ముందు నిజనిర్ధారణ కమిటీలతో పర్యవేక్షణ చేయిస్తుంది. కమిటీ సిఫార్సు ఆధారంగా ఏయే కళాశాలకు ఎన్ని ఇంజినీరింగ్ సీట్లు కేటాయించాలి అనే అంశంపై స్పష్టత వస్తుంది. మరో వైపు ఏఐసీటీఈ నుంచి అనుమతి తెచ్చుకున్న ఇంజినీరింగ్ సీట్లలో ఎన్ని సీట్లకు యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు ఇస్తుందనే అంశానికి నిజనిర్ధారణ కమిటీ సిఫార్సులే కీలకం. నిజనిర్ధారణ కమిటీలో వర్సిటీ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు సభ్యులుగా ఉంటారు.
30 ఇంజినీరింగ్ కళాశాలల గుర్తింపు రద్దు
జేఎన్‌టీయూ (ఏ) పరిధిలోని రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలో మొత్తం 98 ఇంజినీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఉంది. 2022–23 విద్యా సంవత్సరంలో 68 ఇంజినీరింగ్ కళాశాలల్లో మాత్రమే అడ్మిషన్లు కల్పిస్తారు. తక్కిన 30 ఇంజినీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్లు నిలుపుదల చేశారు. గత మూడు సంవత్సరాల్లో 25 శాతం లోపు అడ్మిషన్లు కలిగిన కళాశాలలపై వేటు పడింది. అనుభవం లేని బోధన సిబ్బంది, అరకొర వసతులు, మౌలిక సదుపాయాల కల్పనలో విఫలం, అసలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించకుండా ఉద్యోగాలు కల్పించకపోవడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అనుబంధ గుర్తింపును యూనివర్సిటీ రద్దు చేశారు.
39,195 ఇంజినీరింగ్ సీట్లకు అనుమతి
2022–23 విద్యా సంవత్సరంలో జేఎన్‌టీయూ (ఏ) పరిధిలో మొత్తం 39,195 ఇంజినీరింగ్ సీట్లు, 3,030 ఫార్మసీ సీట్లు, 745 ఫార్మా–డి సీట్లు భర్తీ చేసుకోవడానికి అనుమతి లభించింది. ఏపీ ఈఏపీసెట్ సీట్లు త్వరలో కేటాయించనున్న నేపథ్యంలో ఉన్నత విద్యామండలికి జేఎన్‌టీయూ (ఏ) ఈ మేరకు నివేదించింది.
కంప్యూటర్ సైన్సెస్‌తో కంప్యూటర్ సైన్సెస్ అదనపు బ్రాంచులకు 53 ఇంజినీరింగ్ కళాశాలలు దరఖాస్తు చేసుకున్నాయి. కంప్యూటర్ సైన్సెస్‌కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో సింహభాగం కళాశాలలు కంప్యూటర్ సైన్సెస్ అదనపు బ్రాంచులు కావాలని కోరాయి.
సదుపాయాలున్న కళాశాలలకే గుర్తింపు
సాంకేతిక విద్యలో ఉన్నత ప్రమాణాలు పాటించే ఇంజినీరింగ్ కళాశాలలకు యూనివర్సిటీ గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించాం. అలాంటి కళాశాలల్లో చదివితే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడతారు. గుర్తింపు తీసుకున్న కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తాం.
– ప్రొఫెసర్ జింకా రంగజనార్దన, వీసీ, జేఎన్‌టీయూ అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment