JNTU anantapur
-
తిని.. పూడుస్తుంది!.. ‘గుడ్’ బ్యాక్టీరియా
సాక్షి, అనంతపురం: సిమెంట్ కాంక్రీట్‌ను పటిష్టంగా ఉంచడానికి మధ్యలో ఇనుప కడ్డీలను వినియోగిస్తారు. ఈ కడ్డీలు కాంక్రీట్‌కు అదనపు బలం చేకూర్చినా.. వాటివల్ల పగుళ్లు ఏర్పడతాయి. కాంక్రీట్ మిశ్రమాన్ని బట్టి కూడా చిన్నపాటి పగుళ్లు ఏర్పడుతుంటాయి. ఇందులోకి నీరు లేదా తేమ చేరి ఇనుప కడ్డీలు తుప్పు పట్టడం, పగుళ్లు పెరిగి పెచ్చులు ఊడిపోవడం వంటివి చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాల్లోని గృహాల్లో ఉప్పునీటి ఆవిరి కారణంగా స్లాబ్‌లలో పగుళ్లు ఏర్పడతాయి. పగుళ్లతో వచ్చే సమస్యను అధిగమించేందుకు ప్రస్తుతం వివిధ రకాల విధానాలు అనుసరిస్తున్నారు. గ్రౌటింగ్, ఎఫ్ఆర్సీ ఫిల్లింగ్ విధానాలు ఉన్నా.. వీటివల్ల కలిగే ప్రయోజనం తాత్కాలికమే. పైగా ఈ విధానాలు అత్యధిక ఖర్చుతో కూడుకున్నవి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు అనంతపురం జేఎన్టీయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్లు హెచ్.సుదర్శనరావు, వైశాలి జి.గోర్పడే వినూత్న పరిశోధనకు శ్రీకారం చుట్టారు. అనంతపురం జేఎన్టీయూలో వివిధ విధానాలపై ఆరేళ్లపాటు పరిశోధనలు, ప్రయోగాలు జరిపి అత్యంత చౌకగా.. సుదీర్ఘకాలం మన్నికగా ఉండే ‘బ్యాక్టీరియల్ కాంక్రీట్’ విధానానికి రూపకల్పన చేశారు. వీరి పరిశోధన విజయవంతమై ఇండియన్ పేటెంట్ సైతం లభించింది. మిత్ర బ్యాక్టీరియాలతో సమస్యకు చెక్ పరిశోధనలో భాగంగా ప్రొఫెసర్లు ఎయిరోఫిలియస్, ప్లెక్సెస్, స్టార్టోౖస్పెరికాస్ అనే మూడు రకాల మిత్ర బ్యాక్టీరియాలను ఉపయోగించారు. విభిన్న ప్రాంతాల నుంచి మురికి నీటిని సేకరించి అందులో మట్టి కలిపారు. అందులోనే బ్యాక్టీరియాను అభివృద్ధి చేశారు. తక్కువ కాలంలోనే బ్యాక్టీరియా రెట్టింపు అవుతున్నట్టు గుర్తించారు. ఈ బ్యాక్టీరియాలు కాంక్రీట్‌లో ఉండే సీఎ‹Üహెచ్(కాల్షియం సిలికేట్ హైడ్రేట్) జెల్‌ను ఆహారంగా తీసుకుంటూ సుదీర్ఘకాలంపాటు బతికేస్తాయని గుర్తించారు. అక్కడ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే కాల్షియం కార్బొనేట్ పగుళ్ల లోలోపలకి చొచ్చుకుంటూ వెళ్లి పగుళ్లను పూడుస్తాయి. కాంక్రీట్‌లో ఉన్న సీఎస్హెచ్ జెల్ తింటూ బ్యాక్టీరియా తన సంతానాన్ని వృద్ధి చేసుకుంటూపోతుంది. కాంక్రీట్‌లో ఉండే ‘సీఎస్హెచ్ జెల్’ పూర్తిగా వినియోగం కావడానికి చాలా ఏళ్లు పడుతుంది. కాబట్టి బ్యాక్టీరియా లోపల హాయిగా బతికేస్తుంది. మిత్ర బ్యాక్టీరియా కాబట్టి మానవాళికి హానికరం కాదు. రెండు పరిశోధనలు విజయవంతం ► కాంక్రీట్ మిశ్రమాన్ని స్లాబ్‌పై వేసే సమయంలోనే బ్యాక్టీరియాను కలిపారు. భవనం పటిష్టంగా ఉండటంతో పాటు ఎక్కువ కాలం మన్నిక ఉంటుందని తేటతెల్లమైంది. ► కాగా, భవనాలకు పగుళ్లు వచ్చిన తర్వాత బ్యాక్టీరియాను ప్రవేశపెట్టి.. అభివృద్ధి చేయడం ద్వారా పగుళ్లను వాటితోనే భర్తీ చేశారు. తద్వారా పగుళ్లు పూడుకుపోవడంతోపాటు భవనం పటిష్టత పెరుగుతూ వచ్చింది. ► ఈ రెండు పరిశోధనలు విజయవంతం కావడంతో ప్రొఫెసర్లు హెచ్.సుదర్శనరావు, వైశాలి జి.గోర్పడే ‘మెథడ్స్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ బ్యాక్టీరియల్ కాంక్రీట్ విత్ సెల్ఫ్ హీలింగ్ ఎబిలిటీస్ అండ్ ప్రొడక్ట్స్ దేర్ ఆఫ్’ పేరిట సమర్పించిన అంశానికి పేటెంట్ దక్కింది. ఆరేళ్ల పరిశోధనల ఫలితమిది కాంక్రీట్‌లో పగుళ్లు ఏర్పడినా.. భవనం దెబ్బతినకుండా ఉండేందుకు వీలుగా బ్యాక్టీరియల్ కాంక్రీట్ విధానంపై సుదీర్ఘమైన పరిశోధనలు చేశాం. అత్యంత చౌకైన విధానం ఇది. మెరుగైన ఫలితం వస్తుంది. భవనాలు ఎక్కువ కాలం మన్నిక వచ్చేలా సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాం. ఇందుకు పేటెంట్ దక్కడం చాలా ఆనందంగా ఉంది. ఆరేళ్లపాటు చేసిన పరిశోధనకు ఫలితం దక్కింది. నెదర్లాండ్స్‌లోని డెల్ఫ్ట్ యూనివర్సిటీ వారు ఈ పరిశోధన వినియోగించడానికి జేఎన్టీయూ(ఏ)తో సంప్రదింపులు జరుపుతున్నారు. – ప్రొ. సుదర్శనరావు, ప్రొ.వైశాలి జి.గోర్పడే, సివిల్ ఇంజనీరింగ్ విభాగం, జేఎన్టీయూ అనంతపురం -
30 ఇంజనీరింగ్ కళాశాలల గుర్తింపు రద్దు
ఇంజినీరింగ్ విద్యలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని జేఎన్టీయూ (ఏ) యాజమాన్యం నిర్ణయించింది. నిబంధనలు విస్మరిస్తూ, నామమాత్రంగా ఇంజినీరింగ్ కళాశాలలను నిర్వహిస్తున్న యాజమాన్యాలపై కన్నెర్ర చేసింది. వర్సిటీ చరిత్రలో తొలిసారిగా 30 ఇంజినీరింగ్ కళాశాలల గుర్తింపును రద్దు చేసింది. అనంతపురం: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనంతపురం (జేఎన్టీయూఏ) పరిధిలోని అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల పర్యవేక్షణ పూర్తయ్యింది. కళాశాల స్థితిగతులు, వసతులు, విద్యార్థి- అధ్యాపక నిష్పత్తి, కళాశాల క్యాంపస్ పరిస్థితి, ఆటస్థలం, గ్రంథాలయ సదుపాయం, ల్యాబ్ తదితర అంశాలను పరిశీలించడానికి యూనివర్సిటీ నిజనిర్ధారణ కమిటీలను నియమించింది. ఏటా ఇంజినీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ముందు నిజనిర్ధారణ కమిటీలతో పర్యవేక్షణ చేయిస్తుంది. కమిటీ సిఫార్సు ఆధారంగా ఏయే కళాశాలకు ఎన్ని ఇంజినీరింగ్ సీట్లు కేటాయించాలి అనే అంశంపై స్పష్టత వస్తుంది. మరో వైపు ఏఐసీటీఈ నుంచి అనుమతి తెచ్చుకున్న ఇంజినీరింగ్ సీట్లలో ఎన్ని సీట్లకు యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు ఇస్తుందనే అంశానికి నిజనిర్ధారణ కమిటీ సిఫార్సులే కీలకం. నిజనిర్ధారణ కమిటీలో వర్సిటీ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు సభ్యులుగా ఉంటారు. 30 ఇంజినీరింగ్ కళాశాలల గుర్తింపు రద్దు జేఎన్టీయూ (ఏ) పరిధిలోని రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలో మొత్తం 98 ఇంజినీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఉంది. 2022–23 విద్యా సంవత్సరంలో 68 ఇంజినీరింగ్ కళాశాలల్లో మాత్రమే అడ్మిషన్లు కల్పిస్తారు. తక్కిన 30 ఇంజినీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్లు నిలుపుదల చేశారు. గత మూడు సంవత్సరాల్లో 25 శాతం లోపు అడ్మిషన్లు కలిగిన కళాశాలలపై వేటు పడింది. అనుభవం లేని బోధన సిబ్బంది, అరకొర వసతులు, మౌలిక సదుపాయాల కల్పనలో విఫలం, అసలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించకుండా ఉద్యోగాలు కల్పించకపోవడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అనుబంధ గుర్తింపును యూనివర్సిటీ రద్దు చేశారు. 39,195 ఇంజినీరింగ్ సీట్లకు అనుమతి 2022–23 విద్యా సంవత్సరంలో జేఎన్టీయూ (ఏ) పరిధిలో మొత్తం 39,195 ఇంజినీరింగ్ సీట్లు, 3,030 ఫార్మసీ సీట్లు, 745 ఫార్మా–డి సీట్లు భర్తీ చేసుకోవడానికి అనుమతి లభించింది. ఏపీ ఈఏపీసెట్ సీట్లు త్వరలో కేటాయించనున్న నేపథ్యంలో ఉన్నత విద్యామండలికి జేఎన్టీయూ (ఏ) ఈ మేరకు నివేదించింది. కంప్యూటర్ సైన్సెస్‌తో కంప్యూటర్ సైన్సెస్ అదనపు బ్రాంచులకు 53 ఇంజినీరింగ్ కళాశాలలు దరఖాస్తు చేసుకున్నాయి. కంప్యూటర్ సైన్సెస్‌కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో సింహభాగం కళాశాలలు కంప్యూటర్ సైన్సెస్ అదనపు బ్రాంచులు కావాలని కోరాయి. సదుపాయాలున్న కళాశాలలకే గుర్తింపు సాంకేతిక విద్యలో ఉన్నత ప్రమాణాలు పాటించే ఇంజినీరింగ్ కళాశాలలకు యూనివర్సిటీ గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించాం. అలాంటి కళాశాలల్లో చదివితే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడతారు. గుర్తింపు తీసుకున్న కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తాం. – ప్రొఫెసర్ జింకా రంగజనార్దన, వీసీ, జేఎన్టీయూ అనంతపురం -
జేఎన్టీయూ ముంగిలి..ఆనంద లోగిలి
అనంతపురం విద్య: రాయలసీమకే తలమానికంగా మారి, వజ్రోత్సవాల కీర్తి సొంతం చేసుకుని, ఇంజినీరింగ్ నిపుణుల ఖిల్లాగా పేరొందిన జేఎన్టీయూ అనంతపురం శనివారం ఆనంద లోగిలైంది. దేశం గర్వించదగ్గ ఎందరో శాస్త్రవేత్తలను అందించిన విద్యాలయంలో 12వ స్నాతకోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆద్యంతం అట్టహాసంగా సాగిన ఈ కార్యక్రమానికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చాన్సలర్ హోదాలో హాజరుకావడం కొత్తకళను తెచ్చిపెట్టింది. గవర్నర్ హాజరైనప్పటి నుంచి ముగిసేవరకు విద్యార్థులు, అధికారులు క్రమశిక్షణతో మెలిగారు. గవర్నర్ ప్రసంగానికి యువత ముగ్దులయ్యారు. ముఖ్య అతిథిగా ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్. సోమనాథ్ హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశేష విజయ ప్రస్థానం కలిగిన భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)కి చైర్మన్, వర్సిటీ పూర్వ విద్యార్థి డాక్టర్ జి. సతీష్ రెడ్డికి గౌరవ డాక్టరేట్ ఇవ్వడంతో వర్సిటీ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కీలకోపన్యాసం చేస్తూ.. నూతన ఆవిష్కరణలతో సమాజ ప్రగతికి పాటుపడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు పతకాలు, పట్టాలు ప్రదానం చేశారు. ఏడాదికి 10 వేల మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశం భారత రక్షణ రంగంలో ఏడాదికి 10 వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తున్నట్లు డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి అన్నారు. గౌరవ డాక్టరేట్ అందుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు డీఆర్డీఓలో అవకాశం కల్పిస్తామన్నారు. ఎంటెక్ కోర్సుల్లో డిఫెన్స్ టెక్నాలజీ బ్రాంచ్‌లు ప్రవేశపెడతామన్నారు. జేఎన్టీయూ పూర్వ విద్యార్థిగా గౌరవ డాక్టరేట్ అందుకోవడం గర్వకారణంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆవిష్కర్తలకు ప్రోత్సాహం నూతన ఆవిష్కరణలు చేసే విద్యార్థులను ఇస్రో తరఫున ప్రోత్సహిస్తామని సంస్థ చైర్మన్ సోమనాథ్ అన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతోందని, మరణాన్ని జయించడం, జీవిత కాలాన్ని పెంపొందించడంపై ఇప్పటికే ప్రయోగాలు సాగుతున్నా యన్నారు. సైన్స్ మద్దతుతో ఆకలి, వ్యాధులను జయించేందుకు చేసిన కృషి సత్ఫలితాలనిచ్చిందన్నారు. ‘రాకెట్‌ను ఒక శిశువుగా పరిగణిస్తా, రూప కల్పన నుంచి ప్రయోగం వరకూ అనేక జాగ్రత్తలు తీసుకున్నా.. ఒక్కోసారి విఫలమవుతుంటాం. జీవితంలో కూడా అనుభవం నుంచే పాఠాలు నేర్చుకోవాలి’ అని వివరించారు. అత్యుత్తమ సాంకేతికత గతల దేశాలే అభివృద్ధి చెందుతున్నాయని, ఈ విషయాన్ని విద్యార్థులు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అంతరిక్షంలోకి రోబోలను పంపి సమాచార సేక రణపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్లలో వర్సిటీకి రూ.1,296 కోట్లు జేఎన్టీయూ (ఏ)కు మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ (మెరూ) గుర్తింపు దక్కిందని వీసీ ప్రొఫెసర్ జింకా రంగజనార్దన అన్నారు. వర్సిటీ ప్రగతి నివేదికను ఆయన వివరించారు. మెరూతో వచ్చే ఐదేళ్లలో రూ.1,296 కోట్ల నిధులు రానున్నాయన్నారు. వర్సిటీలో రూ.98 కోట్లతో పాలనా భవనం, ఫార్మసీ బ్లాక్, జిమ్ హాల్, యోగా, మెడిటేషన్ భవనాల నిర్మాణం జరుగుతోందని, మరో రూ.23 కోట్లతో ధ్యాన్‌చంద్ ఇండోర్ స్టేడియం నిర్మించనున్నట్లు తెలిపారు. పులివెందుల కళాశాలకు చెందిన ఎం. హర్షిత అమెజాన్ కంపెనీలో ఏడాదికి రూ.44 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం దక్కించుకుందన్నారు. 2020–21 విద్యా సంవత్సరంలో వర్సిటీ కాలేజీల్లో 565 మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించగా, అనుబంధ కళాశాలల్లో 5,904 మందికి ఉద్యోగాలు దక్కాయన్నారు. జయంత్‌కుమార్ రెడ్డి, గీతాచరణ్ గేట్– 2022లో టాప్–10 ర్యాంకులు సాధించారన్నారు. హాజరైన ప్రముఖులు స్నాతకోత్సవానికి పలువురు ప్రముఖులు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా, యూపీఎస్సీ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ వై. వెంక ట్రామిరెడ్డి, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సీఈఓ ఆలూరి సాంబశివారెడ్డి, ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ రామకృష్ణా రెడ్డి, రెక్టార్ మల్లికార్జున రెడ్డి, రాయలసీమ వర్సిటీ వీసీ ఆనందరావు, ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్, జేసీ కేతన్‌గార్గ్, జేఎన్టీయూ రెక్టార్ విజయకుమార్, రిజిస్ట్రార్ శశిధర్, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ కేశవ రెడ్డి, తదితరులున్నారు. ‘బంగారు’ కొండలు జేఎన్టీయూ (ఏ) స్నాతకోత్సవం సందర్భంగా మొత్తం 22 మంది విద్యార్థులకు 35 బంగారు పతకాలను ప్రకటించారు. వీరిలో 19 మంది స్నాతకోత్సవ వేదికపై పతకాలు అందుకోగా..వివిధ కారణాలతో ముగ్గురు గైర్హాజరయ్యారు. మొత్తం పతకాలలో డి.సుప్రజ (జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ, అనంతపురం) ఏకంగా ఆరు బంగారు పతకాలు అందుకోగా.. ఎం.సతీష్‌కుమార్ రెడ్డి (అనంతపురం), కె.మైథిలి (అనంతపురం) మూడేసి చొప్పున, టి.అనూష (అనంతపురం), బి.సరయూ (అనంతపురం), బి.వీరవంశీ కుమార్ (అనంతపురం), సి.భావన రెడ్డి ( జేఎన్టీయూ కాలేజీ, పులివెందుల) రెండేసి బంగారు పతకాలు, వి.మౌనిక (అనంతపురం), జి.శ్రేయారెడ్డి (అనంతపురం), ఏ.సుధీర్ (పులివెందుల), కె.దేవహర్ష (పులివెందుల), బి.షేక్ షబీహా (పులివెందుల), కే. గురుతేజస్విని (పులివెందుల), యు.విష్ణువర్ధన్ రెడ్డి (అనంతపురం) ఒక్కొక్క బంగారు పతకం అందుకున్నారు. అలాగే వర్సిటీ అనుబంధ ప్రైవేటు కాలేజీల విభాగంలో ఎ.కిశోర్ ( విశ్వోదయ ఇంజినీరింగ్ కాలేజీ, కావలి), కె.సుప్రియ (ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజ్ ఆఫ్ ఉమెన్, తిరుపతి), టి.శ్రీకాంత్ ( శ్రీవెంకటేశ పెరుమాళ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, పుత్తూరు), ఆర్.విష్ణుశ్రీ (శ్రీవెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, కొడవలూరు, నెల్లూరు జిల్లా), టి.హరిత (పీబీఆర్ విశ్వోదయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కావలి), నాగరోహిణి (నారాయణ ఇంజినీరింగ్ కాలేజీ, నెల్లూరు), కె.మనోజ (ఎస్వీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, తిరుపతి), బి.పెంచల కుమారి (అన్నమాచార్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, రాజంపేట) ఒక్కొక్క పతకం కైవసం చేసుకున్నారు. తండ్రి మరణించినా.. : నెల్లూరుకు చెందిన డి.సుప్రజ (జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ, అనంతపురం) ఏకంగా ఆరు బంగారు పతకాలు కైవసం చేసుకుని సత్తా చాటారు. ఎలక్ట్రికల్ విభాగంలో విశేష ప్రతిభ చూపి ‘బంగారు కొండ’గా నిలిచారు. సుప్రజ తల్లిదండ్రులు శివప్రసాద్, సరోజ. రెండేళ్ల క్రితం శివప్రసాద్ గుండెపోటుతో మరణించారు. తల్లి సరోజ ప్రోత్సాహంతో బీటెక్‌ను విజయవంతగా పూర్తి చేశారు. కళాశాల టాపర్‌గా నిలవడంతో పాటు బెస్ట్ అకడమిక్ ఫెర్ఫార్మర్ అమాంగ్ గర్ల్స్, చల్లా సుబ్బరాయుడు ఎండోమెంట్ గోల్డ్‌మెడల్, టీఎస్ రాఘవన్ ఎండోమెంట్ గోల్డ్‌మెడల్, చందుపల్లె వెంకట్రాయులు, సరోజమ్మ ఎండోమెంట్ గోల్డ్‌మెడల్‌ను సుప్రజ సొంతం చేసుకున్నారు. ఎలక్ట్రికల్‌కు సంబంధించిన పబ్లిక్ రంగ కంపెనీలో ఉద్యోగం సాధిస్తానని, నూతన ఆవిష్కరణలపై దృష్టి సారిస్తానని ఈ సందర్భంగా సుప్రజ చెప్పారు. -
జేఎన్టీయూ అనంతపురం స్నాతకోత్సవం.. బంగారు కొండలు వీరే...
ఎంతో మంది జీవితాలకు మంచి పునాది వేసింది జేఎన్టీయూ... సమాజానికి శాస్త్రవేత్తలు, ఇంజినీరింగ్ నిపుణులను అందించింది నాణ్యమైన పరిశోధనలకూ కేరాఫ్‌గా మారింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అంశాల్లో అనంత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది జేఎన్టీయూ అనంతపురం. శనివారం 12వ స్నాతకోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అనంతపురం విద్య: జేఎన్టీయూ అనంతపురం 1946లో ఒక కళాశాలగా ఏర్పడింది. విశ్వవిద్యాలయంగా ఏర్పడిన ఆనతి కాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతి దక్కించుకుంది. పరిశోధనల్లో నాణ్యతా ప్రమాణాలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. బీటెక్, బీఫార్మసీ, ఫార్మాడీ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు అందిస్తోంది. విదేశీ వర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుని నూతన ప్రోగ్రామ్‌లను అందుబాటులోకి తెచ్చింది. వర్సిటీ పరిధిలో అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, వైఎస్సార్, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఉన్న అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏటా 1.70 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. జేఎన్టీయూ అనంతపురం క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల, కలికిరి ఇంజినీరింగ్, పులివెందుల ఇంజినీరింగ్ కళాశాలలు స్వతంత్య్ర ప్రతిపత్తి సాధించాయి. ప్రైవేట్ కళాశాలల్లోనూ పరిశోధన చేయడానికి వీలుగా 16 రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. జాతీయ సేవా పథకాన్ని సమర్థవంతంగా చేస్తున్నందుకు ఇందిరాగాంధీ జాతీయ సేవా పథకం అవార్డు జేఎన్టీయూ, అనంతపురం సొంతం చేసుకుంది. పూర్వ విద్యార్థుల చేయూత క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా ఇటీవలే వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించారు. ఇక్కడ చదివి ఉన్నత స్థానాల్లో అధిరోహించిన పూర్వ విద్యార్థులు చేయూతనందించారు. రూ.8 కోట్లు వెచ్చించి 100 గదులతో విద్యార్థుల హాస్టల్ నిర్మాణానికి చేయూతనిచ్చారు. పూర్వ విద్యార్థులు ఇచ్చిన సహకారంతో ప్రత్యేకంగా హాస్టల్ నిర్మిస్తుండడం విశేషం. రూ.50 లక్షలు విలువైన ల్యాబ్ సదుపాయాన్ని కూడా పూర్వ విద్యార్థుల సహకారంతో ఏర్పాటు చేశారు. సతీష్‌రెడ్డికి గౌరవ డాక్టరేట్ భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ–డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) చైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డికి జేఎన్టీయూ అనంతపురం గౌరవ డాక్టరేట్‌ను అందజేస్తోంది. గతేడాది ఎస్కేయూ కూడా ఆయనను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. సతీష్‌రెడ్డి జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ విభాగంలో 1984లో బీటెక్ పూర్తి చేశారు. ఎంటెక్, పీహెచ్‌డీని జేఎన్టీయూ హైదరాబాద్‌లో పూర్తిచేసిన తర్వాత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబోరేటరీలో శాస్త్రవేత్తగా చేరారు. వివిధ హోదాల్లో పనిచేసి కీలకమైన డీఆర్డీఓ చైర్మన్ హోదాలో పనిచేస్తున్నారు. 35,177 మందికి డిగ్రీలు.. 81 మందికి పీహెచ్‌డీలు జేఎన్టీయూ అనంతపురం 12వ స్నాతకోత్సవానికి అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథులతో పాటు విద్యార్థులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. స్నాతకోత్సవానికి చాన్సలర్ విశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మొత్తం 35,177 మంది విద్యార్థులకు డిగ్రీలు, 81 మందికి పీహెచ్‌డీలు ప్రదానం చేయనున్నారు. బంగారు కొండలు వీరే... జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో కే. మైథిలి, ఈఈఈలో డి. సుప్రజ, మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఎం. సతీష్‌కుమార్‌రెడ్డి, ఈసీఈలో టి. అనూష, సీఎస్ఈలో బి. సరయూ, కెమికల్ ఇంజినీరింగ్‌లో బి. వీరవంశీకుమార్ బంగారు పతకాలను సాధించారు. సువర్ణ విజేత.. సుప్రజ జేఎన్టీయూ అనంతపురం ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్ పూర్తిచేసిన సుప్రజ ఆరు బంగారు పతకాలు దక్కించుకున్నారు. 9.14 జీజీపీఏ సాధించి బ్రాంచ్ టాపర్‌గా నిలిచారు. అలాగే ప్రొఫెసర్ తిరువెంగళం గోల్డ్‌మెడల్, చల్లా సుబ్బరాయుడు ఎండోమెంట్ గోల్డ్‌మెడల్, ప్రొఫెసర్ టీఎస్ రాఘవన్ గోల్డ్‌మెడల్, చండుపల్లి వెంకటరాయుడు– సరోజమ్మ గోల్డ్‌మెడల్, కళాశాల టాపర్ మహిళా విభాగం కోటాలోనూ గోల్డ్‌మెడల్ దక్కించుకున్నారు. ఎలక్ట్రికల్ రంగంలో వినూత్న ఆవిష్కరణలు చేస్తానని సుప్రజ పేర్కొన్నారు. చదువుల తల్లి .. మైథిలి జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలోని సివిల్ బ్రాంచ్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన మైథిలి మూడు బంగారు పతకాలు దక్కించుకున్నారు. సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ టాపర్‌గా నిలవడంతో పాటు చల్లా సుబ్బరాయుడు ఎండోమెంట్ గోల్డ్‌మెడల్, కే.వెంకటేశ్వరరావు గోల్డ్‌మెడల్‌కు ఎంపికయ్యారు. సివిల్ ఇంజినీరింగ్‌లో చదవాలనే ఆకాంక్షతోనే కష్టపడి చదివానని, బ్రాంచ్ టాపర్ రావడం ఆనందంగా ఉందని మైథిలీ పేర్కొన్నారు. మెకానికల్ టాపర్ .. సతీష్ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఎం.సతీష్‌రెడ్డి మూడు బంగారు పతకాలకు ఎంపికయ్యారు. మెకానికల్ బ్రాంచ్ టాపర్‌తో పాటు కళాశాల టాపర్, టీవీ లక్ష్మణరావు గోల్డ్‌మెడల్ దక్కింది. నానోటెక్నాలజీ రంగంపై దృష్టి సారించినట్లు సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. మెకానికల్ రంగంలోని అధునాతన పరిశోధనలే తన లక్ష్యమన్నారు. అగ్రగామిగా తీర్చిదిద్దుతాం జేఎన్టీయూ అనంతపురాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతాం. నాణ్యమైన పరిశోధనలతో పాటు అత్యుత్తమ బోధన ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను అందించే దిశగా విద్యా ప్రణాళికను సమూలంగా మార్పు చేశాం. కోర్సు పూర్తియ్యేలోపు ఇంటర్న్‌షిప్ తప్పనిసరి. విద్యార్థుల సర్టిఫికెట్ల భద్రతకు డీజీ లాకర్ విధానాన్ని అమల్లోకి తెచ్చాం. క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలకు ఎన్బీఏ గుర్తింపు దక్కేలా కృషి చేశాం. – జింకా రంగజనార్దన, వీసీ, జేఎన్టీయూ అనంతపురం -
డిస్టర్బ్ చేశావు, ఎలా నిద్రపోనిస్తాను?
సాక్షి, అనంతపురం విద్య: జేఎన్టీయూ అనంతపురం మాజీ వీసీ ప్రొఫెసర్ ఎస్.శ్రీనివాస్‌కుమార్‌పై ఓ ఉద్యోగి బెదిరింపులకు దిగారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను మాజీ వీసీ శ్రీనివాస్‌కుమార్ ‘సాక్షి’కి వెల్లడించారు. జేఎన్టూయూ అనంతపురం సూపరింటెండెంట్ ఎం.డీ నాగభూషణం తనను వాట్సాప్ మేసేజ్‌ల ద్వారా బెదిరిస్తున్నారని చెప్పారు. ‘మీ జాతకంలో ఏమైనా గండాలు ఉన్నాయా? ఉంటే చూసుకోండి... నీకు.. నాకు వ్యక్తిగత కక్షలు లేవు.. మరి ఎందుకు నన్ను బదిలీ చేశారు? నేను అక్కడికి రావాలా.. వద్దా....? ఆన్సర్ చెప్పండి సార్.. మౌనంగా ఉంటే ఎలా? నిన్ను ఎలా నిద్రపోనిస్తాను?' అంటూ హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జేఎన్టీయూ అనంతపురం నుంచి ఇటీవల సూపరింటెండెంట్ నాగభూషణంను కలికిరికి బదిలీ చేశారన్నారు. జేఎన్టీయూ అనంతపురం నుంచి కలికిరి బదిలీకి తానే కారణమన్నట్లు తనను బెదిరిస్తున్నారని చెప్పారు. అతని బదిలీ జరిగిన కొద్ది రోజులకే అంటే గతేడాది డిసెంబర్ 8న వీసీ పదవీ విరమణ పొందానన్నారు. వీసీ పదవిలో లేననే ఉద్దేశంతో సదరు సూపరింటెండెంట్ వార్నింగ్‌లు ఇస్తున్నాడన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు నానా అవస్థలు పడుతుంటే ఉన్న ఉద్యోగం చేసుకోలేక మాజీ అధికారికి సూపరింటెండెంట్ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. (చదవండి: వాట్సాప్‌లో పెళ్లి పిలుపు, ఫేస్బుక్లో లైవ్) -
వికేంద్రీకరణపై విద్యార్థులతో అవగాహన సదస్సు
-
ఎంటెక్కు.. ‘కొత్త’లుక్కు
జేఎన్టీయూ(ఏ)కు ఎన్బీఏ(నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్) గుర్తింపు రాలేదు. ఫలితంగా నిధుల మంజూరుకు ఆటంకం కలుగుతోంది. దీంతో ఆలోచనలో పడిన వర్సిటీ ఉన్నతాధికారులు ఎంటెక్కుకు ‘కొత్త’ లక్కు దక్కేలా ప్లాన్ చేశారు. జేఎన్టీయూ క్యాంపస్‌లో మరో కళాశాల ఏర్పాటు చేసి అధ్యాపక, విద్యార్థి నిష్పత్తి తగ్గించి నిధులు రాబట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధం చేసిన ఉన్నతాధికారులు పాలకమండలి ముందుంచి ఆమోదం పొందాలని చూస్తున్నారు. – జేఎన్టీయూ జేఎన్టీయూ(ఏ) క్యాంపస్‌లో మరో ఇన్స్టిట్యూట్ కళాశాల ఏర్పాటు చేయనున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ పేరుతో నూతనంగా ప్రత్యేక కళాశాలను ఏర్పాటు చేయడానికి కసరత్తు జరుగుతోంది. వచ్చే పాలకమండలి సమావేశంలో ఆమోదించడానికి ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. నూతన కోర్సులతో పాటు ఎంటెక్ కోర్సులను ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్‌లో తీసుకొచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎన్బీఏ గుర్తింపు రాక.... జేఎన్టీయూ(ఏ) ఇంజినీరింగ్ కళాశాలకు ఎన్బీఏ( నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్) గుర్తింపుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ మంజూరు కాలేదు. మరో దఫా ఎన్బీఏ గుర్తింపునకు పునఃసమీక్ష కోరినా నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో క్యాంపస్ కళాశాలకు రావాల్సిన నిధుల మంజూరుకు ఆటంకం ఏర్పడింది. దీంతో కళాశాలలో సాంకేతిక పరికరాలు, నూతన ల్యాబ్‌లు , సెమినార్లు, సింపోజియంలు, ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు నిర్వహించుకోవడానికి మంజూరు చేసే నిధులకు బ్రేక్ పడింది. ప్రస్తుతం టెక్విప్–3 (టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్) నడుస్తుండగా...2020 ఆగస్టు తర్వాత ప్రారంభమయ్యే టెక్విప్–4 నిధుల మంజూరుకు అవరోధం ఏర్పడింది. దీంతో నష్టనివారణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమైన వర్సిటీ అధికారులు ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్సెడ్ స్టడీస్ కళాశాలను నూతనంగా ఏర్పాటు చేయనున్నారు. అధ్యాపక.. విద్యార్థి నిష్పత్తిలో వ్యత్యాసం జేఎన్టీయూ (ఏ)క్యాంపస్ కళాశాలకు ఎన్బీఏ గుర్తింపు రాకపోవడానికి ప్రధాన కారణం విద్యార్థి.. అధ్యాపక నిష్పత్తికి వ్యత్యాసం అధికంగా ఉంది. ప్రస్తుతం 6 బీటెక్ బ్రాంచ్‌లు, 24 ఎంటెక్ బ్రాంచ్‌లను నిర్వహిస్తున్నారు. బీటెక్ బ్రాంచ్‌లో అయితే 20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు, ఎంటెక్‌లో అయితే ప్రతి 12 మందికి ఒక ఫ్యాకల్టీ మెంబర్ ఉండాలి. ఒక బ్రాంచ్ మొత్తానికి 1:2:6 ( ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్, ఆరు మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు) కేడర్ రేషియో ప్రకారం నియమించాలని ఏఐసీటీఈ(ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) నిర్ధారించింది. ప్రస్తుతం జేఎన్టీయూ(ఏ) క్యాంపస్‌లో మొత్తం 286 మంది ఫ్యాకల్టీ మెంబర్లు అవసరం కాగా, 101 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. తక్కిన 185 మంది ఫ్యాకల్టీ మెంబర్లను భర్తీ చేయాల్సి ఉంది. అవసరమైన మేరకు ఫ్యాకల్టీ మెంబర్లు లేకపోవడంతో ఎన్బీఏ గుర్తింపు రాలేదు. దీంతో బీటెక్ బ్రాంచ్‌లకు ఒక కళాశాల, ఎంటెక్ బ్రాంచ్‌లకు మరో కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో విద్యార్థి, అధ్యాపక నిష్పత్తి వ్యత్యాసం లేకుండా ఉంటుంది. ఎంటెక్‌లో 24 బ్రాంచ్‌ల్లో 12 బ్రాంచులను ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్సెడ్ స్టడీస్ కళాశాలకు బదిలీ చేయనున్నారు. ప్రత్యేక అనుమతితో ఉపకార వేతనాలు వర్సిటీలోని కొందరు ఎంటెక్ విద్యార్థులకు ఇప్పటికే ఉపకారవేతనాలు అందుతున్నాయి. ఈ క్రమంలో ప్రత్యేక కళాశాలను ఏర్పాటు చేస్తే ఉపకారవేతనాల మంజూరుకు ఆటంకం ఏర్పడకుండా న్యూఢిల్లీకి ప్రత్యేక కమిటీని పంపనున్నారు. ఏఐసీటీఈ ప్రత్యేక అనుమతితో విద్యార్థుల ఉపకారవేతనాలు మంజూరుకు చొరవ తీసుకోనున్నారు. వచ్చే పాలకమండలి సమావేశంలో ప్రత్యేక కళాశాలకు ఆమోదం తెలపనుంది. 39 ఎకరాల్లో నూతన ఎంబీఏ కళాశాల జేఎన్టీయూ(ఏ) క్యాంపస్‌లో ఎంబీఏ కళాశాలకు నూతన భవనాలను నిర్మించనున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అనంతపురం నుంచి 39 ఎకరాలను జేఎన్టీయూ(ఏ)కు బదలాయించనున్నారు. ఇందులో నూతనంగా ఎంబీఏ కళాశాల నిర్మించేందుకు టెండర్లు ఆహ్వానించనున్నారు. ఎంటెక్ కోర్సులను బలోపేతం చేస్తాం ఎంటెక్ కోర్సులను బలోపేతం చేయడానికి ప్రత్యేక కళాశాల, వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. అధ్యాపక. విద్యార్థి నిష్పత్తి వ్యత్యాసం తగ్గాలి. శాశ్వత ప్రాతిపదికన బోధన ఉద్యోగాల భర్తీ చేయాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాము. ఎంటెక్ కోర్సులో 24 బ్రాంచుల్లో 12 బ్రాంచులను నూతన కళాశాలలో నిర్వహించనున్నాం. – ప్రొఫెసర్ ఎస్.శ్రీనివాస్ కుమార్, వీసీ, జేఎన్టీయూ(ఏ) -
ఇంటి దొంగల పనే..!
సాక్షి, జేఎన్టీయూ : రమేష్ అనే విద్యార్థి ఇటీవల సప్లిమెంటరీ పరీక్షలు రాశాడు. ఎలాగైనా బీటెక్ ఉత్తీర్ణత సాధించాలనే ఉద్దేశంతో ఓ మధ్యవర్తిని కలిశాడు. ఆయన నేరుగా పరీక్షల విభాగంలోని ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగితో సంప్రదింపులు జరిపాడు. ఆ సబ్జెక్టుకు సంబంధించి ఎలా ఉత్తీర్ణుడిని చేయించాలనే అంశంపై ప్రణాళికను వివరించాడు. కోడింగ్ సెక్షన్లో నిబద్ధతగా పనిచేసే అధికారి ఉండటంతో నిర్ధేశించిన జవాబుపత్రాన్ని మూల్యాంకనం (వాల్యుయేషన్)లో పసిగట్టడం చాలా కష్టం. దీంతో జవాబుపత్రంలో ఒక సింబల్‌ను హైలైట్ చేసి పరీక్ష రాయమని సూచించాడు. ఆ మేరకు రమేష్ ఓ సింబల్‌ను హైలైట్ చేసి పరీక్ష రాశాడు. ఇదే జవాబు పత్రాన్ని తనకు అనుకూలమైన ఎగ్జామినర్ వద్దకు మూల్యాంకనానికి పంపాడు. కచ్చితంగా రమేష్ ఉత్తీర్ణుడయ్యాడు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చేస్తున్న అక్రమాలకు ఇదొక ఉదాహరణ మాత్రమే. జయసింహ అనే అధ్యాపకుడు ప్రైవేట్ అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తున్నాడు. అక్కడ ఇచ్చే రెమ్యునరేషన్ చాలా తక్కువ. అదే మూల్యాంకనం(వాల్యుయేషన్) డ్యూటీకి వెళ్తే మంచి రెమ్యునరేషన్ వస్తుంది. ఆన్‌డ్యూటీ మీద కళాశాల జీతం కూడా చెల్లిస్తుంది. అయితే ఏడాదిలో రెండు సెమిస్టర్ల పరీక్షలు జరిగితే.. ఐదు దఫాలు పైగానే వాల్యుయేషన్ డ్యూటీ వేశారు. ఈ లెక్కన తరచూ వాల్యుయేషన్ డ్యూటీ వేయడానికి రెమ్యునరేషన్లో కొంత నజరానా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ దందాను ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నడిపిస్తున్నాడు. ఇలా నిత్యం వాల్యుయేషన్‌కు అనుకూలమైన అధ్యాపకులను వేయిస్తూ.. ప్రతి రోజూ రూ.20వేలకు పైగా సంపాదన ధ్యేయంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కోడింగ్ ముగిసిన వెంటనే విద్యార్థి జవాబు పత్రంలో ముందస్తుగా నిర్ధేశించిన విధంగా ఏదో ఒక సింబల్‌ను హైలైట్ చేసి ఉంటారు. వేలల్లో జవాబు పత్రాలు ఉంటాయి. కానీ ఆ జవాబుపత్రాన్ని గుర్తుపట్టడానికి ఓ అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న అటెండర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆ అటెండర్ నేరుగా వాల్యుయేషన్ హాలులో ప్రాతినిధ్యం వహిస్తున్న అవుట్సోర్సింగ్ బాస్ అయిన ఉద్యోగికి ఇస్తాడు. సదరు ఉద్యోగి ముందే నిర్ధారించుకున్న ఎగ్జామినర్‌కు ఆ జవాబుపత్రాన్ని ఇచ్చి విశాలహృదయంతో మార్కులు వేయిస్తాడు. జేఎన్టీయూ అనంతపురం పరీక్షల విభాగంలో ముగ్గురు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమిష్టిగా అక్రమాలకు తెరతీస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐదు సంవత్సరాల సర్వీసు లేకుండానే మూల్యాంకనం జేఎన్టీయూ అనంతపురంలో పరీక్షల విభాగం వర్సిటీకి హృదయం లాంటిది. చాలా నిబద్ధతగా పనిచేసే రెగ్యులర్ అధికారులు కోడింగ్ సెక్షన్లో, కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ఉన్నారు. ఏదైనా ఒక చిన్న పొరుపాటు జరిగితే వర్సిటీ పరువు పోతుందని అంకితభావంతో పనిచేసే ఉద్యోగులు కూడా ఉన్నారు. అలాంటి వారు ఉండటంతోనే జేఎన్టీయూ అనంతపురం పరీక్షల విభాగం విశ్వసనీయతను నిలుపుకుంటోంది. అయితే రెగ్యులర్ ఉద్యోగాలు కాకపోవడంతో, కేవలం అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలు కావడంతో .. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే రీతిలో అక్రమాలకు తెరతీస్తున్నారు. ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి కాకుండనే అధ్యాపకులకు మూల్యాంకనం అవకాశం కల్పిస్తున్నారు. అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలు పంపించే డేటా ఆధారంగా మూల్యాంకనం విధులకు వేస్తున్నారు. అయితే పదేపదే వారినే మూల్యాంకనానికి వేస్తుండటంతోనే అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతోంది. రోస్టర్ వారీగా అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులందరికీ మూల్యాంకనం విధులకు కేటాయించాలి. కానీ అలా జరగలేదు. ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఎవరైతే అక్రమాలకు దన్నుగా నిలుస్తున్నారో అలాంటి అధ్యాపకులనే విధులకు వేస్తుండటం అక్రమాలకు తావిస్తోంది. కళాశాల ఉద్యోగులే మధ్యవర్తులు అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రత్యేకంగా పరీక్షల విభాగం పేరుతో ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. అలాంటి ఉద్యోగులు పరీక్షల విభాగంలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో నిత్యం ఫోన్లో సంభాషణలు జరుగుతున్నాయి. ఇటీవలే ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల పరీక్షల విభాగంలో పనిచేసే ఉద్యోగి నుంచి ఒక రోజులోనే ఈ ముగ్గురి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 30 దఫాల కాల్స్ వెళ్లాయి. అధికారికంగా వారితో ఎలాంటి లావాదేవీలు జరపకూడదు. ఏదైనా పని ఉంటే పరీక్షల విభాగం ఉన్నతాధికారులతోనే ఉంటుంది. కానీ ఈ ముగ్గురు ఉద్యోగులు దందా నడుపుతున్నట్లు స్పష్టమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చర్యలు తీసుకుంటాం అధ్యాపకులను వాల్యుయేషన్‌కు కేటాయించే విధానంపై అక్రమాలకు పాల్బడి ఉంటే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. ముగ్గురు ఉద్యోగుల తీరుపై అనుమానాలు ఉన్నాయి. ఉన్నతాధికారులకు ఇది వరకే విన్నవించాం. – ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్, జేఎన్టీయూ అనంతపురం -
హాస్టల్.. హడల్!
జేఎన్టీయూ(ఏ) పరిధిలోని పులివెందుల, కలికిరిలోని కళాశాల హాస్టళ్లలో ఉద్యోగుల జీతాలను, విద్యుత్ బిల్లులను విద్యార్థులతో సంబంధం లేకుండా చెల్లిస్తున్నారు. అయితే ఒక్క అనంతపురంలోనే విద్యార్థులపై భారం వేస్తుండటం గమనార్హం. జేఎన్టీయూ:రాయలసీమలోనే ప్రతిష్టాత్మకమైన జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలో సీటు దక్కితే చాలు మురిసిపోతారు. ఇలాంటి కళాశాలలో వెలుగులోకి వచ్చిన వ్యాపార ధోరణి ఆ పేరుప్రఖ్యాతలకు మచ్చ తీసుకొస్తోంది. విద్యార్థి భాగస్వామ్య హాస్టల్స్ పేరిట సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేయడం విమర్శలకు తావిస్తోంది. సాంకేతిక విద్య కావడంతో విద్యార్థులు కూడా భారమైనా భరించక తప్పని పరిస్థితి నెలకొంది. క్యాంపస్ హాస్టళ్లలో కనీస వసతుల కల్పన వర్సిటీతో పాటు అధికారుల కనీస బాధ్యత. మొత్తం 8 హాస్టళ్లలో 1,932 మంది విద్యార్థులు ఉండగా.. నిర్వహణకు 110 మంది ఉద్యోగులను నియమించారు. ఈ ఉద్యోగుల జీతభత్యాలను నేరుగా జేఎన్టీయూ(ఏ) చెల్లించాల్సి ఉండగా.. విద్యార్థి మెస్ బిల్లుల్లో కలుపుతున్నారు. ప్రతి ఉద్యోగికి నెల జీతం రూ.6,500 చొప్పున 110 మంది ఉద్యోగులకు ఏడాదికి రూ.85.80 లక్షలు చెల్లిస్తున్నారు. ఈ భారం విద్యార్థులపై పడుతోంది. ఇదే కాదు.. ఏడాదికి వచ్చే విద్యుత్ బిల్లు రూ.33లక్షలు కూడా విద్యార్థుల నుండే వసూలు చేస్తున్నారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థి యేటా అదనంగా రూ.6,300 చెల్లించాల్సి వస్తోంది. అంటే విద్యార్థులు తిన్నా తినకపోయినా ఈ భారం మాత్రం మోయాల్సిందే. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు నెలకు రూ.1200, బీసీ కేటగిరీ విద్యార్థులకు నెలకు రూ.1200 చొప్పున ప్రభుత్వం ఉపకార వేతనాలను అందిస్తోంది. ఇందులో ఏడాదికి రూ.6,300 ఉపకార వేతనాల సొమ్మును ప్రతి విద్యార్థి సిబ్బంది జీతాలకు జమ చేయాల్సి వస్తోంది. ఈ దోపిడీ గత పది సంవత్సరాలుగా సాగుతోంది. ఇలా ఇప్పటి వరకు సిబ్బంది జీతాలు, విద్యుత్ బిల్లుల రూపంలో విద్యార్థులు రూ.12.10 కోట్లు అర్పించుకున్నారు. బ్లాక్ గ్రాంట్ మొత్తం ఏమవుతోంది! జేఎన్టీయూ అనంతపురం విద్యార్థులను ఏ విధంగా దగా చేస్తుందో బ్లాక్‌గ్రాంట్ వివరాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. హాస్టళ్లకు సంబంధించి 90 శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేస్తామని పదేళ్ల కిందట ప్రకటించారు. అయితే 19 మందిని మాత్రమే భర్తీ చేశారు. అయితే 90 మంది ఉద్యోగులకు చెల్లించే జీతాల మొత్తాన్ని బ్లాక్‌గ్రాంట్‌గా ప్రతి యేటా ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకుంటోంది. కానీ హాస్టల్ ఉద్యోగులకు మాత్రం ఆ మొత్తాన్ని చెల్లించని పరిస్థితి. నిధులు ఉన్నా జీతాల భారాన్ని విద్యార్థులపై మోపుతుండటం గమనార్హం. ఈ బ్లాక్‌గ్రాంట్ మొత్తాలను వర్సిటీ ఇతర అవసరాలకు వినియోగించుకోవడం విమర్శలకు తావిస్తోంది. కాషన్ డిపాజిట్ కూడా తిరిగివ్వలేదు హాస్టల్లో అడ్మిట్ అయిన వెంటనే కాషన్ డిపాజిట్‌గా రూ.3 వేలు కట్టించుకున్నారు. కోర్సు పూర్తయ్యాక వచ్చిన మెస్ బిల్లుకు ఈ మొత్తాన్ని కలపాలి. కానీ అలా చేయలేదు. మెస్ బిల్లు మొత్తం కట్టినా కాషన్ డిపాజిట్ తిరిగివ్వలేదు. మా అన్న గతేడాది బీటెక్ ఫైనలియర్ పూర్తి చేశారు. కానీ కాషన్ డిపాజిట్ వెనక్కివ్వలేదు. ఉద్యోగం వచ్చిన వారితో ముందస్తుగానే మెస్ బిల్లు కట్టించుకున్నారు. మెస్ బిల్లు పోనూ తక్కిన మొత్తం తిరిగివ్వడం లేదు.– విశాల్, బీటెక్ మూడో సంవత్సరం, జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల. విద్యార్థులపై భారం తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం హాస్టల్స్ విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తున్నాం. విద్యుత్ బిల్లులు తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలిస్తున్నాం. సోలార్ విద్యుదుత్పత్తితో కరెంట్ బిల్లులు తగ్గే అవకాశం ఉండటంతో ఆ దిశగా ప్రయత్నిస్తున్నాం.– ప్రొఫెసర్ రామానాయుడు, ప్రిన్సిపాల్, చీఫ్ వార్డెన్,జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల -
అప్పనంగా భోం చేశారు
జేఎన్టీయూ: జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలోని హాస్టల్ కార్యాలయంలో భారీగా అవినీతి చోటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గుర్తింపు ఉన్న ఇంజినీరింగ్ కళాశాల అయినా విద్యార్థి భాగస్వామ్య హాస్టల్స్ పేరుతో నిర్వహిస్తున్నారు. విద్యార్థులు చెల్లించే మొత్తంతోనే హాస్టల్లో ఉద్యోగుల జీతాలు, కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లులు తదితర అన్నింటికీ చెల్లిస్తున్నారు. ఇంతటితో ఆగకుండా ఆసొమ్ముతోనే అవినీతికి పాల్పడ్డారు. ఒకటికాదు..రెండుకాదు అవకాశం ఉన్న ప్రతి చోటా విద్యార్థుల సొమ్మును దిగమింగారనే ప్రచారం జరుగుతోంది. విద్యార్థులపైనే మళ్లీ భారం.. జేఎన్టీయూ అనంతపురం కానిస్టిట్యూట్ కళాశాలగా కలికిరి ఇంజినీరింగ్ కళాశాల ఉంది. అక్కడ ల్యాబ్ సదుపాయం లేదు, పర్మినెంట్ ఫ్యాకల్టీ లేకపోవడంతో ప్రయోగాలు చేసుకోవడానికి క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలకు విద్యార్థులు వస్తారు. ఏడాదిలో నాలుగు దఫాలు పైగా ఇక్కడి ల్యాబ్‌లు ఉపయోగించుకుంటారు. దీంతో క్యాంపస్ కళాశాల హాస్టల్స్‌లోనే వారికి వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. కలికిరి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల నుంచి నేరుగా మెస్ బిల్లులు కట్టించుకున్నారు. ఆ నగదు ఏ ఖాతాల్లోనూ చూపకుండా నామమాత్రంగా కొందరు విద్యార్థులతో చలానాలు మొక్కుబడిగా కట్టించుకున్నారు. ప్రాక్టికల్స్‌కు హాజరైన మొత్తం విద్యార్థుల హాజరు పట్టికను, నామమాత్రంగా తీసిన చలానాలను పరిశీలిస్తే మొత్తం భాగోతం బహిర్గతమయ్యే అవకాశం ఉంది. గత రెండేళ్లుగా కలికిరి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు వస్తున్నారు. ఇందులో అరకోటి పైగానే స్వాహా జరిగినట్లు ఉద్యోగులే చెప్తున్నారు. స్వాహా చేసిన రూ.అరకోటి పైగా మొత్తం హాస్టల్ ఖాతాకు చేరకపోవడంతో జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులపై భారం పడింది. ఇండెంట్‌కు.. బిల్లులకు పొంతనలేదు.. ఇండెంట్లో నిర్ధారించిన రేటుకు, కొనుగోలు బిల్లుకు మధ్య వ్యత్యాసం ఉంది. గతేడాది జనవరి 24న ఇండెంట్లో ఎర్రగడ్డలు కేజీ రూ. 14, మిర్చి రూ. 10లుగా నిర్ధారించారు. కానీ బిల్లులో మాత్రం కేజీ ఎర్రగడ్డలు రూ. 20, మిర్చి రూ.13లుగా చూపించారు. అంటే కేజీకి రూ.6 అదనంగా బిల్లు వేశారు. తిరిగి జనవరి 27న ఇండెంట్లో ఎర్రగడ్డలు రూ.13లు, ఉర్లగడ్డ రూ.10, కానీ బిల్లులో ఎర్రగడ్డలు రూ. 20.60, ఉర్లగడ్డ రూ.25గా బిల్లు వేశారు. బిల్లులోని ప్రతి వస్తువుపైనా అదనంగా బిల్లులు వేశారు. వ్యూహంతో విద్యార్థులు బలి.. సాధారణంగా వరుసగా మూడు రోజులు మెస్‌కు గైర్జాజరయితే సెలవుగా ప్రకటించరు. సెలవు రోజులకు కూడా మెస్‌బిల్లు వేస్తారు. మూడు రోజులకు పైగా మెస్‌కు గైర్హాజరయితే మాత్రమే సెలవుగా ప్రకటించాలి. మూడు రోజులకు పైగా తీసుకున్న సెలవు రోజులకు మెస్ బిల్లు వేయరాదు. నెల రోజులు సెలవులో ఉన్న విద్యార్థులకు సైతం మెస్ బిల్లు వేశారు. దీంతో స్వాహా జరిగిన మొత్తం బహిర్గతం కాకుండా వ్యూహం పన్నారు. హాస్టల్స్‌లో అంతా సజావుగా జరుగుతున్నట్లు భ్రమ కల్పిస్తూ ఉన్నతాధికారులను సైతం దృష్టి మళ్లిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాప్ట్వేర్ రూపకల్పనకు రూ. 4లక్షలు ఖర్చు.. పేరెన్నికగల టెక్నాలజీ కళాశాలలో సాప్ట్‌వేర్‌ను రూపకల్పన చేసే విద్యార్థులు లేక సాప్ట్‌వేర్‌ను రూపకల్పనకు రూ. 4లక్షలు వెచ్చించారు. మెస్‌బిల్లు వసూలుకు సాప్ట్వేర్ దోహదపడుతుందన్న ఉద్దేశంతో భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టారు. ఇందుకు ఎలాంటి విధివిధానాలు, అనుమతి లేకుండా ఖర్చు పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
జేఎన్టీయూ(ఏ) వీసీ దుర్మరణం
-
జేఎన్టీయూ(ఏ) వీసీ దుర్మరణం
⇒ అదుపుతప్పి లారీ కిందకు దూసుకెళ్లిన ఇన్నోవా కారు ⇒ వీసీ సర్కార్‌తో పాటు పీఏ, కారు డ్రైవర్ మృతి పామిడి (గుంతకల్లు): అనంతపురం జిల్లా పామిడి మండల కేంద్రానికి సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, అనంతపురం (జేఎన్టీయూ–ఏ) వైస్ చాన్స్‌లర్ ఎంఎంఎం సర్కార్ (65) దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఆయనతోపాటు వ్యక్తిగత సహాయకుడు (పీఏ) బాబా ఫకృద్దీన్ (32), డ్రైవర్ నాగప్రసాద్ (30) అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. కర్నూలులోని పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవం కోసం బుధవారం సాయంత్రం జేఎన్టీయూ వీసీ తన పీఏతో కలిసి కారులో బయల్దేరారు. పామిడికి సమీపంలోని ఖల్సా దాబా వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని కుడివైపు రోడ్డులోకి దూసుకెళ్లింది. అదే సమయంలో గుత్తి నుంచి అనంతపురం వైపు లారీ (ఏపీ21 టీడబ్ల్యూ 6801) వస్తోంది. లారీ డ్రైవర్ అప్రమత్తమై బ్రేకు వేసేలోపు కారు వేగంగా లారీ ముందుభాగం కిందకు దూసుకెళ్లింది. కారు డ్రైవర్ నాగప్రసాద్, వెనుక సీటులో కూర్చున్న వీసీ ఎంఎంఎం సర్కార్, ఆయన పక్కనే కూర్చున్న పీఏ బాబా ఫకృద్దీన్ దుర్మరణందారు. కారు టైరు పగలడంతో డివైడర్‌ను ఢీకొట్టి.. కుడివైపు రోడ్డులోని లారీ కిందకు దూసుకెళ్లిందని ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. వీసీ అంత్యక్రియలు శుక్రవారం వైజాగ్‌లో జరుగుతాయని బంధువులు తెలిపారు. వీసీ మృతికి గవర్నర్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: జేఎన్టీయూ వీసీ ఎమ్.ఎమ్.ఎమ్.సర్కార్ మృతి పట్ల తెలుగు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సర్కార్ మరణించడంతో రాష్ట్రం ఒక విద్యావేత్తను కోల్పోయిందన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
ఘోర ప్రమాదం: జేఎన్టీయూ వీసీ మృతి