ఇంటి దొంగల పనే..!  | Endless Irregularities In The JNTU Examination Department | Sakshi
Sakshi News home page

జేఎన్‌టీయూలో అంతులేని అక్రమాలు

Published Wed, Jun 19 2019 7:00 AM | Last Updated on Wed, Jun 19 2019 8:27 AM

Endless Irregularities In The JNTU Examination Department - Sakshi

సాక్షి, జేఎన్‌టీయూ : రమేష్‌ అనే విద్యార్థి ఇటీవల సప్లిమెంటరీ పరీక్షలు రాశాడు. ఎలాగైనా బీటెక్‌ ఉత్తీర్ణత సాధించాలనే ఉద్దేశంతో ఓ మధ్యవర్తిని కలిశాడు. ఆయన నేరుగా పరీక్షల విభాగంలోని ఓ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగితో సంప్రదింపులు జరిపాడు. ఆ సబ్జెక్టుకు సంబంధించి ఎలా ఉత్తీర్ణుడిని చేయించాలనే అంశంపై ప్రణాళికను వివరించాడు. కోడింగ్‌ సెక్షన్‌లో నిబద్ధతగా పనిచేసే అధికారి ఉండటంతో నిర్ధేశించిన జవాబుపత్రాన్ని మూల్యాంకనం (వాల్యుయేషన్‌)లో పసిగట్టడం చాలా కష్టం. దీంతో జవాబుపత్రంలో ఒక సింబల్‌ను హైలైట్‌ చేసి పరీక్ష రాయమని సూచించాడు. ఆ మేరకు రమేష్‌ ఓ సింబల్‌ను హైలైట్‌ చేసి పరీక్ష రాశాడు. ఇదే జవాబు పత్రాన్ని తనకు అనుకూలమైన ఎగ్జామినర్‌ వద్దకు మూల్యాంకనానికి పంపాడు. కచ్చితంగా రమేష్‌ ఉత్తీర్ణుడయ్యాడు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి చేస్తున్న అక్రమాలకు ఇదొక ఉదాహరణ మాత్రమే. 

జయసింహ అనే అధ్యాపకుడు ప్రైవేట్‌ అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాలలో పనిచేస్తున్నాడు. అక్కడ ఇచ్చే రెమ్యునరేషన్‌ చాలా తక్కువ. అదే మూల్యాంకనం(వాల్యుయేషన్‌) డ్యూటీకి వెళ్తే మంచి రెమ్యునరేషన్‌ వస్తుంది. ఆన్‌డ్యూటీ మీద కళాశాల జీతం కూడా చెల్లిస్తుంది. అయితే ఏడాదిలో రెండు సెమిస్టర్ల పరీక్షలు జరిగితే.. ఐదు దఫాలు పైగానే వాల్యుయేషన్‌ డ్యూటీ వేశారు. ఈ లెక్కన తరచూ వాల్యుయేషన్‌ డ్యూటీ వేయడానికి రెమ్యునరేషన్‌లో కొంత నజరానా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ దందాను ఓ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి నడిపిస్తున్నాడు. ఇలా నిత్యం వాల్యుయేషన్‌కు అనుకూలమైన అధ్యాపకులను వేయిస్తూ.. ప్రతి రోజూ రూ.20వేలకు పైగా సంపాదన ధ్యేయంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 

కోడింగ్‌ ముగిసిన వెంటనే విద్యార్థి జవాబు పత్రంలో ముందస్తుగా నిర్ధేశించిన విధంగా ఏదో ఒక సింబల్‌ను హైలైట్‌ చేసి ఉంటారు. వేలల్లో జవాబు పత్రాలు ఉంటాయి. కానీ ఆ జవాబుపత్రాన్ని గుర్తుపట్టడానికి ఓ అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న అటెండర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆ అటెండర్‌ నేరుగా వాల్యుయేషన్‌ హాలులో ప్రాతినిధ్యం వహిస్తున్న అవుట్‌సోర్సింగ్‌ బాస్‌ అయిన ఉద్యోగికి ఇస్తాడు. సదరు ఉద్యోగి ముందే నిర్ధారించుకున్న ఎగ్జామినర్‌కు ఆ జవాబుపత్రాన్ని ఇచ్చి విశాలహృదయంతో మార్కులు వేయిస్తాడు. జేఎన్‌టీయూ అనంతపురం పరీక్షల విభాగంలో ముగ్గురు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు సమిష్టిగా అక్రమాలకు తెరతీస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఐదు సంవత్సరాల సర్వీసు లేకుండానే మూల్యాంకనం 
జేఎన్‌టీయూ అనంతపురంలో పరీక్షల విభాగం వర్సిటీకి హృదయం లాంటిది. చాలా నిబద్ధతగా పనిచేసే రెగ్యులర్‌  అధికారులు కోడింగ్‌ సెక్షన్‌లో, కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌లో ఉన్నారు. ఏదైనా ఒక చిన్న పొరుపాటు జరిగితే వర్సిటీ పరువు పోతుందని అంకితభావంతో పనిచేసే ఉద్యోగులు కూడా ఉన్నారు. అలాంటి వారు ఉండటంతోనే జేఎన్‌టీయూ అనంతపురం పరీక్షల విభాగం విశ్వసనీయతను నిలుపుకుంటోంది. అయితే రెగ్యులర్‌ ఉద్యోగాలు కాకపోవడంతో, కేవలం అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాలు కావడంతో .. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే రీతిలో అక్రమాలకు తెరతీస్తున్నారు. ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి కాకుండనే అధ్యాపకులకు మూల్యాంకనం అవకాశం కల్పిస్తున్నారు.

అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాలలు పంపించే డేటా ఆధారంగా మూల్యాంకనం విధులకు వేస్తున్నారు. అయితే పదేపదే వారినే మూల్యాంకనానికి వేస్తుండటంతోనే అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతోంది. రోస్టర్‌ వారీగా అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులందరికీ మూల్యాంకనం విధులకు కేటాయించాలి. కానీ అలా జరగలేదు. ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఎవరైతే అక్రమాలకు దన్నుగా నిలుస్తున్నారో అలాంటి అధ్యాపకులనే విధులకు వేస్తుండటం అక్రమాలకు తావిస్తోంది.  

కళాశాల ఉద్యోగులే మధ్యవర్తులు 
అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రత్యేకంగా పరీక్షల విభాగం పేరుతో ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. అలాంటి ఉద్యోగులు పరీక్షల విభాగంలో పనిచేసే అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతో నిత్యం ఫోన్‌లో సంభాషణలు జరుగుతున్నాయి. ఇటీవలే ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల పరీక్షల విభాగంలో పనిచేసే ఉద్యోగి నుంచి ఒక రోజులోనే ఈ ముగ్గురి అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 30 దఫాల కాల్స్‌ వెళ్లాయి. అధికారికంగా వారితో ఎలాంటి లావాదేవీలు జరపకూడదు. ఏదైనా పని ఉంటే పరీక్షల విభాగం ఉన్నతాధికారులతోనే ఉంటుంది. కానీ ఈ ముగ్గురు ఉద్యోగులు దందా నడుపుతున్నట్లు స్పష్టమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

చర్యలు తీసుకుంటాం 
అధ్యాపకులను వాల్యుయేషన్‌కు కేటాయించే విధానంపై అక్రమాలకు పాల్బడి ఉంటే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. ముగ్గురు ఉద్యోగుల తీరుపై అనుమానాలు ఉన్నాయి. ఉన్నతాధికారులకు ఇది వరకే విన్నవించాం.  
– ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణ, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్, జేఎన్‌టీయూ అనంతపురం   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement