జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల
జేఎన్‌టీయూ: జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలోని హాస్టల్ కార్యాలయంలో భారీగా అవినీతి చోటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గుర్తింపు ఉన్న ఇంజినీరింగ్ కళాశాల అయినా విద్యార్థి భాగస్వామ్య హాస్టల్స్ పేరుతో నిర్వహిస్తున్నారు. విద్యార్థులు చెల్లించే మొత్తంతోనే హాస్టల్‌లో ఉద్యోగుల జీతాలు, కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లులు తదితర అన్నింటికీ చెల్లిస్తున్నారు. ఇంతటితో ఆగకుండా ఆసొమ్ముతోనే అవినీతికి పాల్పడ్డారు. ఒకటికాదు..రెండుకాదు అవకాశం ఉన్న ప్రతి చోటా విద్యార్థుల సొమ్మును దిగమింగారనే ప్రచారం జరుగుతోంది.
విద్యార్థులపైనే మళ్లీ భారం..
జేఎన్‌టీయూ అనంతపురం కానిస్టిట్యూట్ కళాశాలగా కలికిరి ఇంజినీరింగ్ కళాశాల ఉంది. అక్కడ ల్యాబ్ సదుపాయం లేదు, పర్మినెంట్ ఫ్యాకల్టీ లేకపోవడంతో ప్రయోగాలు చేసుకోవడానికి క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలకు విద్యార్థులు వస్తారు. ఏడాదిలో నాలుగు దఫాలు పైగా ఇక్కడి ల్యాబ్‌లు ఉపయోగించుకుంటారు. దీంతో క్యాంపస్ కళాశాల హాస్టల్స్‌లోనే వారికి వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. కలికిరి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల నుంచి నేరుగా మెస్ బిల్లులు కట్టించుకున్నారు. ఆ నగదు ఏ ఖాతాల్లోనూ చూపకుండా నామమాత్రంగా కొందరు విద్యార్థులతో చలానాలు మొక్కుబడిగా కట్టించుకున్నారు. ప్రాక్టికల్స్‌కు హాజరైన మొత్తం విద్యార్థుల హాజరు పట్టికను, నామమాత్రంగా తీసిన చలానాలను పరిశీలిస్తే మొత్తం భాగోతం బహిర్గతమయ్యే అవకాశం ఉంది. గత రెండేళ్లుగా కలికిరి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు వస్తున్నారు. ఇందులో అరకోటి పైగానే స్వాహా జరిగినట్లు ఉద్యోగులే చెప్తున్నారు. స్వాహా చేసిన రూ.అరకోటి పైగా మొత్తం హాస్టల్ ఖాతాకు చేరకపోవడంతో జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులపై భారం పడింది.
ఇండెంట్‌కు.. బిల్లులకు పొంతనలేదు..
ఇండెంట్‌లో నిర్ధారించిన రేటుకు, కొనుగోలు బిల్లుకు మధ్య వ్యత్యాసం ఉంది. గతేడాది జనవరి 24న ఇండెంట్‌లో ఎర్రగడ్డలు కేజీ రూ. 14, మిర్చి రూ. 10లుగా నిర్ధారించారు. కానీ బిల్లులో మాత్రం కేజీ ఎర్రగడ్డలు రూ. 20, మిర్చి రూ.13లుగా చూపించారు. అంటే కేజీకి రూ.6 అదనంగా బిల్లు వేశారు. తిరిగి జనవరి 27న ఇండెంట్‌లో ఎర్రగడ్డలు రూ.13లు, ఉర్లగడ్డ రూ.10, కానీ బిల్లులో ఎర్రగడ్డలు రూ. 20.60, ఉర్లగడ్డ రూ.25గా బిల్లు వేశారు. బిల్లులోని ప్రతి వస్తువుపైనా అదనంగా బిల్లులు వేశారు.
వ్యూహంతో విద్యార్థులు బలి..
సాధారణంగా వరుసగా మూడు రోజులు మెస్‌కు గైర్జాజరయితే సెలవుగా ప్రకటించరు. సెలవు రోజులకు కూడా మెస్‌బిల్లు వేస్తారు. మూడు రోజులకు పైగా మెస్‌కు గైర్హాజరయితే మాత్రమే సెలవుగా ప్రకటించాలి. మూడు రోజులకు పైగా తీసుకున్న సెలవు రోజులకు మెస్ బిల్లు వేయరాదు. నెల రోజులు సెలవులో ఉన్న విద్యార్థులకు సైతం మెస్ బిల్లు వేశారు. దీంతో స్వాహా జరిగిన మొత్తం బహిర్గతం కాకుండా వ్యూహం పన్నారు. హాస్టల్స్‌లో అంతా సజావుగా జరుగుతున్నట్లు భ్రమ కల్పిస్తూ ఉన్నతాధికారులను సైతం దృష్టి మళ్లిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సాప్ట్‌వేర్ రూపకల్పనకు రూ. 4లక్షలు ఖర్చు..
పేరెన్నికగల టెక్నాలజీ కళాశాలలో సాప్ట్‌వేర్‌ను రూపకల్పన చేసే విద్యార్థులు లేక సాప్ట్‌వేర్‌ను రూపకల్పనకు రూ. 4లక్షలు వెచ్చించారు. మెస్‌బిల్లు వసూలుకు సాప్ట్‌వేర్ దోహదపడుతుందన్న ఉద్దేశంతో భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టారు. ఇందుకు ఎలాంటి విధివిధానాలు, అనుమతి లేకుండా ఖర్చు పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment