సాక్షి, అనంతపురం: సిమెంట్ కాంక్రీట్‌ను పటిష్టంగా ఉంచడానికి మధ్యలో ఇనుప కడ్డీలను వినియోగిస్తారు. ఈ కడ్డీలు కాంక్రీట్‌కు అదనపు బలం చేకూర్చినా.. వాటివల్ల పగుళ్లు ఏర్పడతాయి. కాంక్రీట్ మిశ్రమాన్ని బట్టి కూడా చిన్నపాటి పగుళ్లు ఏర్పడుతుంటాయి. ఇందులోకి నీరు లేదా తేమ చేరి ఇనుప కడ్డీలు తుప్పు పట్టడం, పగుళ్లు పెరిగి పెచ్చులు ఊడిపోవడం వంటివి చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాల్లోని గృహాల్లో ఉప్పునీటి ఆవిరి కారణంగా స్లాబ్‌లలో పగుళ్లు ఏర్పడతాయి. పగుళ్లతో వచ్చే సమస్యను అధిగమించేందుకు ప్రస్తుతం వివిధ రకాల విధానాలు అనుసరిస్తున్నారు. గ్రౌటింగ్, ఎఫ్‌ఆర్‌సీ ఫిల్లింగ్ విధానాలు ఉన్నా.. వీటివల్ల కలిగే ప్రయోజనం తాత్కాలికమే. పైగా ఈ విధానాలు అత్యధిక ఖర్చుతో కూడుకున్నవి.
ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు అనంతపురం జేఎన్‌టీయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్లు హెచ్.సుదర్శనరావు, వైశాలి జి.గోర్పడే వినూత్న పరిశోధనకు శ్రీకారం చుట్టారు. అనంతపురం జేఎన్‌టీయూలో వివిధ విధానాలపై ఆరేళ్లపాటు పరిశోధనలు, ప్రయోగాలు జరిపి అత్యంత చౌకగా.. సుదీర్ఘకాలం మన్నికగా ఉండే ‘బ్యాక్టీరియల్ కాంక్రీట్’ విధానానికి రూపకల్పన చేశారు. వీరి పరిశోధన విజయవంతమై ఇండియన్ పేటెంట్ సైతం లభించింది.
మిత్ర బ్యాక్టీరియాలతో సమస్యకు చెక్
పరిశోధనలో భాగంగా ప్రొఫెసర్లు ఎయిరోఫిలియస్, ప్లెక్సెస్, స్టార్టోౖస్పెరికాస్ అనే మూడు రకాల మిత్ర బ్యాక్టీరియాలను ఉపయోగించారు. విభిన్న ప్రాంతాల నుంచి మురికి నీటిని సేకరించి అందులో మట్టి కలిపారు. అందులోనే బ్యాక్టీరియాను అభివృద్ధి చేశారు. తక్కువ కాలంలోనే బ్యాక్టీరియా రెట్టింపు అవుతున్నట్టు గుర్తించారు. ఈ బ్యాక్టీరియాలు
కాంక్రీట్‌లో ఉండే సీఎ‹Üహెచ్(కాల్షియం సిలికేట్ హైడ్రేట్) జెల్‌ను ఆహారంగా తీసుకుంటూ సుదీర్ఘకాలంపాటు బతికేస్తాయని గుర్తించారు.
అక్కడ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే కాల్షియం కార్బొనేట్ పగుళ్ల లోలోపలకి చొచ్చుకుంటూ వెళ్లి పగుళ్లను పూడుస్తాయి. కాంక్రీట్‌లో ఉన్న సీఎస్‌హెచ్ జెల్ తింటూ బ్యాక్టీరియా తన సంతానాన్ని వృద్ధి చేసుకుంటూపోతుంది. కాంక్రీట్‌లో ఉండే ‘సీఎస్‌హెచ్ జెల్’ పూర్తిగా వినియోగం కావడానికి చాలా ఏళ్లు పడుతుంది. కాబట్టి బ్యాక్టీరియా లోపల హాయిగా బతికేస్తుంది. మిత్ర బ్యాక్టీరియా కాబట్టి మానవాళికి హానికరం కాదు.
రెండు పరిశోధనలు విజయవంతం
► కాంక్రీట్ మిశ్రమాన్ని స్లాబ్‌పై వేసే సమయంలోనే బ్యాక్టీరియాను కలిపారు. భవనం పటిష్టంగా ఉండటంతో పాటు ఎక్కువ కాలం
మన్నిక ఉంటుందని తేటతెల్లమైంది.
► కాగా, భవనాలకు పగుళ్లు వచ్చిన తర్వాత బ్యాక్టీరియాను ప్రవేశపెట్టి.. అభివృద్ధి చేయడం ద్వారా పగుళ్లను వాటితోనే భర్తీ చేశారు. తద్వారా పగుళ్లు పూడుకుపోవడంతోపాటు భవనం పటిష్టత పెరుగుతూ వచ్చింది.
► ఈ రెండు పరిశోధనలు విజయవంతం కావడంతో ప్రొఫెసర్లు హెచ్.సుదర్శనరావు, వైశాలి జి.గోర్పడే ‘మెథడ్స్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ బ్యాక్టీరియల్ కాంక్రీట్ విత్ సెల్ఫ్ హీలింగ్ ఎబిలిటీస్ అండ్ ప్రొడక్ట్స్ దేర్ ఆఫ్’ పేరిట సమర్పించిన అంశానికి పేటెంట్ దక్కింది.
ఆరేళ్ల పరిశోధనల ఫలితమిది
కాంక్రీట్‌లో పగుళ్లు ఏర్పడినా.. భవనం దెబ్బతినకుండా ఉండేందుకు వీలుగా బ్యాక్టీరియల్ కాంక్రీట్ విధానంపై సుదీర్ఘమైన పరిశోధనలు చేశాం. అత్యంత చౌకైన విధానం ఇది. మెరుగైన ఫలితం వస్తుంది. భవనాలు ఎక్కువ కాలం మన్నిక వచ్చేలా సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాం. ఇందుకు పేటెంట్ దక్కడం చాలా ఆనందంగా ఉంది. ఆరేళ్లపాటు చేసిన పరిశోధనకు ఫలితం దక్కింది. నెదర్లాండ్స్‌లోని డెల్ఫ్‌ట్ యూనివర్సిటీ వారు ఈ పరిశోధన వినియోగించడానికి జేఎన్‌టీయూ(ఏ)తో సంప్రదింపులు జరుపుతున్నారు.
– ప్రొ. సుదర్శనరావు, ప్రొ.వైశాలి జి.గోర్పడే, సివిల్ ఇంజనీరింగ్ విభాగం, జేఎన్‌టీయూ అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment