సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు ఎంసెట్ ప్రవేశాల కమిటీ షెడ్యూలు ఖరారు చేసింది. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శుక్రవారం జరిగిన సెట్ ప్రవేశాల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సమావేశంలో మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, ఎంసెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ పాల్గొన్నారు. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ను ఈనెల 24న https://tseamcet.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. 2017లో ఏ ర్యాంకు వారికి ఏయే కాలేజీల్లో సీట్లు వచ్చాయో తెలుసుకునేందుకు, తల్లిదండ్రులు విద్యార్థుల అంచనా కోసం సంబంధిత వివరాలను www.tsche.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. పూర్తి స్థాయి నోటిఫికేషన్ వివరాలతో పాటు కాలేజీల వారీగా ఉన్న సీట్ల వివరాలను ఈనెల 24న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
సీబీఎస్‌ఈ విద్యార్థులకు 25 తర్వాతే ర్యాంకులు..
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) సిలబస్ స్కూళ్లలో 12వ తరగతి పూర్తయిన విద్యార్థులకు ఈ నెల 25 తర్వాతే ఇంజనీరింగ్ ప్రవేశాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. వారికి ఈ నెల 19న ఎంసెట్ ర్యాంకులు ప్రకటించట్లేదని తెలిపింది. వారి ఫలితాలు ఈ నెల 25న విడుదల కానున్నాయి. ఫలితాలొచ్చాక 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎంసెట్ కమిటీకి తమ మార్కుల మెమోలు పంపాల్సి ఉంటుందని పేర్కొంది. ఆ తర్వాత వారి మార్కులకు వెయిటేజీ ఇచ్చి, జేఎన్‌టీయూ ర్యాంకు ఖరారు చేస్తుంది. వారి ర్యాంకులు ప్రవేశాల క్యాంపు కార్యాలయానికి వచ్చాక ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించింది.
ఇంజనీరింగ్ ప్రవేశాలను మూడు దశల్లో చేపట్టాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఇప్పటివరకు రెండు దశల్లో కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్న సాంకేతిక విద్యా శాఖ ఈసారి మూడో దశను కూడా నిర్వహించనుంది. జేఈఈ ప్రవేశాలు పూర్తయ్యాక మిగిలిపోయే విద్యార్థులను పరిగణనలోకి తీసుకునేందుకు మూడో దశ కౌన్సెలింగ్‌ను నిర్వహించనుంది. ఈసారి ఇంటర్నల్ స్లైడింగ్‌ను కూడా ప్రవేశాల కమిటీ ఆధ్వర్యంలోనే నిర్వహించనుంది. విద్యార్థులకు సీట్లు వచ్చిన కాలేజీల్లోనే బ్రాంచీ మార్చుకునే అవకాశాన్ని కల్పించనుంది. విద్యార్థులకు ప్రత్యేకంగా ఆప్షన్లకు అవకాశం కల్పించి సంబంధిత కాలేజీల్లో విద్యార్థులు కోరుకునే బ్రాంచీల్లో సీట్లు ఉంటే వాటిని కేటాయించనుంది. గతంలో కాలేజీల్లో ఇంటర్నల్ స్లైడింగ్ ఉన్నా ఆ ప్రక్రియను కాలేజీలే చేసేవి. అయితే అలా బ్రాంచి మారిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వచ్చేది కాదు. ప్రవేశాల కౌన్సెలింగ్ ఫీజు ఈసారి స్వల్పంగా పెంచింది. గతేడాది ఎస్సీ, ఎస్టీలకు రూ. 500 ఉంటే ఈసారి రూ.600 చేసింది. ఇతర విద్యార్థులకు గతేడాది రూ.1000 ఉంటే ఈసారి రూ.1200కు పెంచింది.
ఇదీ ప్రవేశాల షెడ్యూలు
25–5–2018 నుంచి 2–6–2018 వరకు: ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు
28–5–2018 నుంచి 3–6–2018 వరకు: సర్టిఫికెట్ల వెరిఫికేషన్
28–5–2018 నుంచి 5–6–2018 వరకు: వెబ్ ఆప్షన్లకు అవకాశం
5–6–2018: వెబ్ ఆప్షన్ల గడువు పూర్తి
8–6–2018: మొదటి దశ ప్రొవిజనల్ సీట్ అలాట్‌మెంట్
8–6–2018 నుంచి 12–6–2018 వరకు: ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్ రిపోర్టింగ్
ఇంజనీరింగ్ ప్రవేశాల షెడ్యూలు జారీ
Published Sat, May 19 2018 12:52 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment