ఎంసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
ఈ నెల 30 వరకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ దరఖాస్తుల గడువును రెండ్రోజుల పాటు పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఈ నెల 28తో ఆలస్య రుసుము లేకుండా చేసుకునే దరఖాస్తుల గడువు ముగిసిందని, అయితే విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నెల 30 వరకు పొడిగించినట్లు వెల్లడించారు. ప్రస్తుత మార్పు నేపథ్యంలో రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు గడువును ఈ నెల 31 నుంచి అమలు చేస్తామన్నారు.
2.36 లక్షలు దాటిన దరఖాస్తులు
సోమవారం వరకు 2,36,654 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్ కోసం 1,37,635 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోసం 97,077 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది కంటే ఈసారి అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఇందులో తెలంగాణ నుంచి 63,878 మంది దరఖాస్తు చేసుకోగా, ఏపీ, ఇతర రాష్ట్రాల నుంచి 33,199 మంది దరఖాస్తు చేసుకున్నారు.
గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పెంపు
తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును ఏప్రిల్ 4వ తేదీ వరకు పొడిగించినట్లు గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి శేషుకుమారి ఒక ప్రకటనలో తెలిపారు.