4 కాలేజీల్లో రూ.లక్షకు పైగా ఫీజు
69 ఇంజనీరింగ్ కాలేజీల్లో రూ.35 వేల కనీస ఫీజు
- ప్రతిపాదనలు సిద్ధం.. పరిశీలించిన ప్రభుత్వం?
- 2న టీఏఎఫ్‌ఆర్‌సీ కమిటీలో పూర్తిస్థాయిలో ఖరారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల ఖరారుకు సంబంధించి ప్రతిపాదనలను ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) సిద్ధం చేసింది. నాలుగు కాలేజీల్లో రూ.లక్ష, అంతకంటే ఎక్కువ ఫీజును నిర్ణయించింది. 69 కాలేజీలకు కనీస ఫీజు రూ.35 వేలు మాత్రమే ఇచ్చేలా నిర్దేశించింది. వీటన్నింటినీ ప్రభుత్వం కూడా పరిశీలించినట్లు సమాచారం. వచ్చే నెల 2న టీఏఎఫ్‌ఆర్‌సీ పూర్తి స్థాయి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుంది. అదే రోజు ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనలు పంపిస్తే 3న సవరించిన ఫీజుల అమలుకు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.
ఇవి వచ్చే మూడేళ్లపాటు (2016 - 17, 2017-18, 2018-19 విద్యా సంవత్సరాల్లో) అమల్లో ఉంటాయి. ఇక ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపును ఈ నెల 30న ఇచ్చేందుకు ప్రభుత్వం, జేఎన్‌టీయూహెచ్ సిద్ధమయ్యా యి. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, జేఎన్‌టీయూహెచ్ తనిఖీ నివేదికలను పరిశీలించి గుర్తింపుపై తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే దీనిపై జేఎన్‌టీయూహెచ్ ఓ అవగాహనకు వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో 30న వీలు కాకపోతే ఆ తరువాతి రోజున కాలేజీల జాబితాను ఉన్నత విద్యామండలికి అందజేసేందుకు చర్యలు చేపడుతోంది. కాగా, జూలై 3న ఫీజుల ఉత్తర్వులు వచ్చిన వెంటనే 5 నుంచి వెబ్ ఆప్షన్లను ప్రారంభించేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది.
సగటు ఫీజు రూ.49,768
రాష్ట్రంలోని 269 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో ప్రభుత్వ కాలేజీలు పోగా మిగితా 248 కళాశాలల్లో వచ్చే మూడేళ్ల పాటు వసూలు చేయాల్సిన ఫీజులను టీఏఎఫ్‌ఆర్‌సీ నిర్ణయించింది. వాటన్నింటి సగటు ఫీజును రూ.49,768గా ఖరారు చేసింది. గతంలో ఈ ఫీజు రూ.41 వేలకు పైగా ఉండగా, ఈసారి కనీస ఫీజు ఉన్న కాలేజీలు మినహా చాలా కాలేజీల్లో రూ.8 వేల నుంచి 10 వేల వరకు పెరిగింది. మరికొన్ని కాలేజీల్లో రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు పెరిగింది. ఇవన్నీ ప్రతిపాదిత ఫీజులే. ప్రభుత్వం వీటికి తుది ఆమోదం తెలిపేటపుడు కాలేజీల ఫీజుల్లో హెచ్చుతగ్గులుండవచ్చు. ఇక ఏపీలో సగటు ఫీజు 51,193గా నిర్ణయించింది. ప్రస్తుతం టాప్ కాలేజీల్లో కొన్నింటికి ఫీజులను తగ్గించగా, గతంలో సాధారణ ఫీజులున్న కాలేజీల్లో ఈసారి భారీగా రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు పెరిగింది. గతంలో రూ.1.13 లక్షలున్న చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ టెక్నాలజీలో ఫీజును ఈసారి రూ.1.09 లక్షలకు తగ్గించినట్లు తెలిసింది. ఇక గతంలో రూ. 75 వేలున్న వర్ధమాన్ కాలేజీ ఫీజు రూ.1.05 లక్షలకు పెరిగింది.
బయోమెట్రిక్ హాజరుంటేనే...
ప్రస్తుతం కాలేజీల వారీగా ఫీజులపై నిర్ణయం చేసిన ఏఎఫ్‌ఆర్‌సీ.. ప్రతి కాలేజీలో విద్యార్థులు, అధ్యాపకులకు బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేస్తేనే ఈ ఫీజులను ఇవ్వాలని సిఫారసు చేస్తున్నట్లు తెలిసింది. అలాగే మరోవైపు ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాల్లోనూ ఆధార్ నంబరు తప్పనిసరి చేస్తోంది.
23 కాలేజీలు కోర్టును ఆశ్రయించే అవకాశం
ఏఎఫ్‌ఆర్‌సీ నిర్ణయిం చిన ఫీజులను రాష్ట్రంలోని 23 కాలేజీలు నిరాకరించినట్లు తెలిసింది. ఏఎఫ్‌ఆర్‌సీ నిర్ణయం తమకు ఆమోదం కాదని ఆయా కాలేజీలు వెల్లడించినట్టు సమాచారం. తాము కల్పిస్తున్న సదుపాయాలకనుగుణంగా ఫీజుల్ని పెంచకపోవడంతో ఏఎఫ్‌ఆర్‌సీ నిర్ణయానికి ఆయా కాలేజీల యాజమాన్యాలు అంగీకరించలేదు. దీంతో వారు ఫీజుల ఉత్తర్వు వెలువడగానే కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.