పరీక్షలు పాసైనా.. ధ్రువపత్రాలివ్వరు!
అటానమస్ ఉన్న కాలేజీలు యూనివర్సిటీతో సంబంధం లేకుండా స్వయంపాలనలో కొనసాగుతాయి. పరీక్షల నిర్వహణతోపాటు పలు అకడమిక్ నిర్ణయాలను సొంతంగా తీసుకోవచ్చు.
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీలు.. విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు
అటానమస్ అంటే..
అటానమస్ ఉన్న కాలేజీలు యూనివర్సిటీతో సంబంధం లేకుండా స్వయంపాలనలో కొనసాగుతాయి. పరీక్షల నిర్వహణతోపాటు పలు అకడమిక్ నిర్ణయాలను సొంతంగా తీసుకోవచ్చు.
సప్లిమెంటరీ పేరుతో కాలయాపన..
ఇబ్రహీంపట్నం సమీపంలోని ఓ అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు ధ్రువపత్రాలు ఇవ్వడంలేదు. తాజాగా అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయని, వాటి ఫలితాలు వచ్చిన తర్వాతే విద్యార్థులందరికి ఒకేసారి సర్టిఫికెట్లు ఇస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది. మరికొన్ని కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి.
విద్యార్థుల తిప్పలు..
పని భారం తగ్గించుకునే క్రమంలో కాలేజీ తీసుకున్న నిర్ణయంతో విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకున్న విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో కొందరు విద్యార్థులు సర్టిఫికెట్ల విషయంలో గురువారం ఇబ్రహీంపట్నంలోని ఇంజనీరింగ్ కాలేజీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అలాగే పలు కాలేజీల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు.
చేతులెత్తేసిన జేఎన్‌టీయూ...
సర్టిఫికెట్ల జారీ విషయంలో అలసత్వాన్ని విద్యార్థులు జేఎన్‌టీయూహెచ్ దృష్టికి తీసుకెళ్లారు. వారు కూడా కాలేజీ యాజమాన్యంతో చర్చించి సమస్య పరిష్కరించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలోని మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలు 179
జేఎన్‌టీయూహెచ్ పరిధిలో ఉన్నవి 145
ఇందులో అటానమస్ హోదా ఉన్నవి 8
స్వయం ప్రతిపత్తి(అటానమస్) గల ఇంజనీరింగ్ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. వాటి సౌకర్యార్థం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయి. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లివ్వకుండా కాలయాపన చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీనిపై జేఎన్‌టీయూహెచ్ కూడా చేతులెత్తేయడంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– సాక్షి, హైదరాబాద్