పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసిన మండలి చైర్మన్ లింబాద్రి, ఇతర అధికారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీజీఈటీ–2022) నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి సోమవారం విడుదల చేశారు. జూలై 20న ఈ పరీక్ష ఉస్మానియా వర్సిటీ పర్యవేక్షణలో జరుగుతుంది.
ఆన్‌లైన్ ద్వారా ఎలాంటి అపరాధ రుసుము లేకుండా జూలై 7వ తేదీ వరకూ దరఖాస్తు చేసు కోవచ్చు. ప్రవేశ పరీక్ష కంప్యూటర్ ఆధారితంగానే ఉంటుంది. ప్రవేశ పరీక్షలో ర్యాంకును బట్టి ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, కొత్తగా ఏర్పడబో తున్న తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్ టీయూహెచ్ పరిధిలోని 320 కాలేజీల్లో ప్రవేశాలు పొందవచ్చు.
మొత్తం 50 కోర్సుల్లో 112 విభాగాలకు విద్యార్థులు ఒకే ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు పొందే వీలుంది. పరీక్ష ఫీజును ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600గా నిర్ణయించారు. అదనపు సబ్జెక్టులకు ఒక్కో దానికి రూ.450 చెల్లించాలి. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో లింబాద్రితో పాటు ఓయూ ఇన్‌చార్జి వీసీ సీతారామారావు, రిజి స్ట్రార్ పి. లక్ష్మీనారాయణ, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వి. వెంకటరమణ, సెక్రటరీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింబాద్రి సెట్ వివరాలు వెల్లడించారు.
డిగ్రీ ఏదైనా పీజీలో నచ్చిన కోర్సు..
►రాష్ట్రవ్యాప్తంగా 44,604 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది ఇంతే సంఖ్యలో సీట్లున్నా, చేరిన వారి సంఖ్య 22,812 మాత్రమే. వీరిలోనూ 16,163 (71%) మహిళలు, 6,649 (29%) పురుషులు చేశారు.
►ఈసారి పీజీ కోర్సుల ప్రవేశాల ప్రక్రియలో గుణాత్మక మార్పులు తెచ్చారు. డిగ్రీలో ఏ సబ్జెక్టు చేసినా, పీజీలో ఇష్టమొచ్చిన సామాజిక కోర్సుల్లో చేరేందుకు వీలు కల్పిస్తున్నారు. ఆఖరుకు ఎంబీబీఎస్, బీటెక్ విద్యార్థులు కూడా ఎంఏ, ఎంకామ్ వంటి కోర్సుల్లో చేరే వీలుంది. ఎంఏ తెలుగు, ఇంగ్లిష్ కోర్సులకు ఏ గ్రూపుతో డిగ్రీ చేసినా అర్హులే.
►నేషనల్ ఇంటిగ్రేషన్ కోటాను 5% నుంచి 20%కి పెంచారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులు చేరేందుకు ముందుకొస్తే సూపర్ న్యూమరరీ పోస్టులు క్రియేట్ చేస్తారు. ఆన్‌లైన్, డిస్టెన్స్‌మోడ్‌లోనూ వర్సిటీ నుంచి పీజీ కోర్సులు చేసే అవకాశం కల్పిస్తున్నారు.
►పీజీ సెట్ రాయాలనుకునే వారు తాజాగా తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని జతచేయాలి. కుల ధ్రువీకరణ, ఇతర సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి.
మిగిలిపోతున్న సీట్లు..
ప్రతీ ఏటా సీట్లు మిగిలిపోతున్నాయి. కొన్ని సబ్జెక్టుల్లో మరీ తక్కువ ప్రవేశాలుంటున్నాయి. గతేడాది గజ్వేల్ కాలేజీలో పీజీ కెమిస్ట్రీలో ఐదుగురే చేరారు. వాళ్లను వేరే కాలేజీలకు పంపాల్సి వచ్చింది. దీనిపై ఉన్నత విద్యా మండలి సరైన విధానం అనుసరించాలి. ఈ ఏడాది కూడా 44 వేల సీట్లున్నాయి. కొత్త కోర్సులకు అనుమతిస్తే మరో వెయ్యి సీట్లు పెరిగే వీలుంది.
– ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి (సీపీజీఈటీ–2022 కన్వీనర్)
Comments
Please login to add a commentAdd a comment