సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టబోతున్నారు. ‘చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్’ను ఉన్నత విద్యా మండలి అందుబాటులోకి తెచ్చింది. దీనిద్వారా విద్యార్థి తనకు నచ్చిన సబ్జెక్టును, నచ్చిన చోట పూర్తిచేసే వీలుంది. ఆఖరుకు ఆన్‌లైన్ ద్వారా చేసినా ఆమోదం లభిస్తుంది. అయితే, డిగ్రీలో 40 శాతం క్రెడిట్స్‌కు దీన్ని పరిమితం చేయాలని యూని వర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) షరతు పెట్టింది.
గతంలో ఈ విధానంలో 20శాతం క్రెడిట్లకే అనుమతించేవారు. విస్తృత విద్యావకాశాలను విద్యార్థులు సొంతం చేసుకునేందుకే దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు చెబుతున్నారు. అయితే, యూజీసీ అనుమతించిన ఆన్‌లైన్ సంస్థలనే ఎంచుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో క్లస్టర్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ఈ ఏడాది నుంచే అమల్లోకి తెచ్చారు. హైదరాబాద్ పరిధిలో ఉండే మొత్తం తొమ్మిది కాలేజీలను అనుసంధానం చేసి, ఒకే పాఠ్యప్రణాళిక, పరీక్ష విధానం, బోధనా పద్ధతులు ఉండేలా ఏర్పాట్లు చేశారు.
విద్యార్థి ఏదైనా ఒక సబ్జెక్టును తనకు నచ్చిన కాలేజీలో పూర్తి చేసే విధానం అమల్లోకి తెచ్చారు. కొన్ని కాలేజీల్లో వనరులు, మరికొన్ని కళాశాలల్లో ఫ్యాకల్టీ, ఇంకొన్ని చోట్ల లైబ్రరీ లేదా లేబొరేటరీ అందుబాటులో ఉంటుంది. వీటిని ఉపయోగించుకునే అవకాశం క్లస్టర్ విధానంలో కలుగుతుంది. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ దీన్ని మరింత విస్తృతం చేయనుంది.
ఆన్‌లైన్ ఎలా?
ఉదాహరణకు విద్యార్థి బీఏ హెచ్‌పీపీలో ఒక కాలేజీలో ప్రవేశం పొందాడు. హిస్టరీ సబ్జెక్టులో అతనికి యూరోపియన్ హిస్టరీ చేయాలనే ఆసక్తి ఉంటుంది. కానీ తెలంగాణలో ఇది అందుబాటులో లేదు. అలాంటప్పుడు మిగతా సబ్జెక్టులన్నీ ప్రవేశం పొందిన కాలేజీలోనే పూర్తిచేసి, యూరోపియన్ హిస్టరీ సబ్జెక్టును ఆన్‌లైన్ ద్వారా> చేసుకోవచ్చు. దేశంలో మాసివ్ ఆన్‌లైన్ కోర్సెస్, స్వయం సహా అనేక సంస్థలకు యూజీసీ గుర్తింపు ఇచ్చింది.
అంతర్జాతీయ ప్రమాణాలతో ఆన్‌లైన్ ద్వారానే విద్యాబోధన అందిస్తున్నాయి. కోర్సు పూర్తి చేసిన తర్వాత ఆ సబ్జెక్టుకు సంబంధించిన పరీక్షను కూడా ఆన్‌లైన్ ద్వారానే నిర్వహిస్తారు. అందులో వచ్చిన క్రెడిట్స్‌ను విద్యార్థి మాతృ కాలేజీకి ఆన్‌లైన్ సంస్థ బదిలీ చేస్తుంది. తాను చేసే కోర్సు వివరాలను ముందే సంబంధిత మాతృ కాలేజీకి, ఏ కాలేజీలో ప్రవేశం పొందింది ఆన్‌లైన్ కాలేజీకి ముందే చెప్పాల్సి ఉంటుంది.
కరోనా తర్వాత అన్ని రాష్ట్రాల యూనివర్సిటీలు ఈ దిశగా కసరత్తు చేస్తున్నాయి. దీనివల్ల విద్యార్థికి సానుకూలమైన సబ్జెక్టులతో ఫ్యాకల్టీ సమస్యను అధిగమించే వీలుందని అధికారులు అంటున్నారు. దీంతోపాటు ఆన్‌లైన్ సంస్థలు అంతర్జాతీయ నాలెడ్జ్‌తో కోర్సులను అందించేందుకు పోటీ పడుతున్నాయని చెబుతున్నారు.
మార్పునకు నాంది
ఈ తరహా కోర్సులకు యూజీసీ ఇప్పటికే అనుమ తించింది. భవిష్యత్‌లో దీనికి మరింత ఆదరణ పెరిగే వీలుంది. జాతీయ, అంతర్జాతీయ బోధనతో పోటీపడేందుకు ఆన్‌లైన్ విధానం దోహదపడుతుంది. ఇప్ప టికే చాలామంది విద్యార్థులు వృత్తిపరమైన కొన్ని కోర్సులను ఆన్‌లైన్ ద్వారానే నేర్చుకుంటున్నారు. ఇవి కేవలం ఉపాధి కోసమే సాగుతున్నాయి. ప్రస్తుత విధానం విజ్ఞానం విస్తృతమవ్వడానికీ దోహదపడుతుంది.
– ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యామండలి చైర్మన్)
Comments
Please login to add a commentAdd a comment