త్వరలో బీఏ ఆనర్స్‌ | Telangana State Board Of Higher Education Is Working Hard To Introduce BA Honours | Sakshi
Sakshi News home page

త్వరలో బీఏ ఆనర్స్‌

Published Tue, Sep 21 2021 2:24 AM | Last Updated on Tue, Sep 21 2021 2:24 AM

Telangana State Board Of Higher Education Is Working Hard To Introduce BA Honours - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం ఉన్న బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ (బీఏ) కోర్సును ఆధునీకరించబోతున్నారు. కొత్తగా బీఏ ఆనర్స్‌ ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. వీలైతే ఈ ఏడాది నుంచే దీన్ని అమల్లోకి తెస్తామని మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి తెలిపారు. కోర్సు స్వరూప, స్వభావాలపై త్వరలో విశ్వవిద్యాలయాల ఉప కులపతులతో చర్చించబోతున్నట్టు చెప్పారు. అన్ని వర్సిటీల పరిధిలోని కాలేజీల్లో ఈ కోర్సు అందుబాటులోకి తేవాలని అధికారులు యోచిస్తున్నారు.

బీఏ ఆనర్స్‌ కోసం రాష్ట్ర విద్యార్థులు ఢిల్లీ, బెంగళూరు ప్రాంతాలకు వెళ్తున్నారు. తెలంగాణలోనూ ఆనర్స్‌ ఉండాలన్న ఒత్తిడి పెరగడంతో విద్యాశాఖ దీనిపై దృష్టి పెట్టింది. ఇంజనీరింగ్‌ వంటి వృత్తి విద్యా కోర్సుల నేపథ్యంలో బీఏ కోర్సులకు ఆదరణ తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. సాంకేతికతను జోడించడం, ఇంజనీరింగ్‌ తరహాలో మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా కోర్సు సమయంలోనే తర్ఫీదు ఇవ్వడం చేస్తున్నారు.

దీనికోసం ఉన్నత విద్యామండలి ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థలతో అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది. కొత్తగా ఆనర్స్‌ కోర్సును అందుబాటులోకి తేవడం మరో మార్పుగా అధికారులు చెబుతున్నారు. బీఏ కోర్సు కాలపరిమితి ప్రస్తుతం మూడేళ్లు ఉండగా.. ఆనర్స్‌ జోడించడం వల్ల నాలుగేళ్లకు మారుతుంది. సబ్జెక్టులను మరింత లోతుగా, అధ్యయనానికి వీలుగా రూపొందించబోతున్నారు. దీనివల్ల డిగ్రీ దశలోనూ విద్యార్థిలో పరిపూర్ణత పెరుగుతుందని వర్సిటీల ప్రొఫెసర్లు చెబుతున్నారు.

ఆనర్స్‌ పూర్తి చేసిన తర్వాత పోస్టు–గ్రాడ్యుయేట్‌ కోర్సు కాలపరిమితి రెండేళ్ల నుంచి ఏడాదికి తగ్గుతుంది. ఈ కోర్సుకు సంబంధించిన ప్రతిపాదనలు 2020లోనే రూపొందించారు. కోవిడ్‌ కారణంగా ఇది ముందుకెళ్లలేదు. ఇప్పుడు దీన్ని వేగవంతం చేయబోతున్నారు. భవిష్యత్‌లో అన్ని చోట్లా ఆనర్స్‌ విధిగా ఉండే వీలుందని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) సభ్యుడు ప్రొఫెసర్‌ గోపాల్‌ రెడ్డి తెలిపారు. ఇది ఆహ్వానించదగ్గ కోర్సు అని చెప్పారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement