సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ సంవత్సరం విద్యార్థుల ప్రవేశం పెరిగింది. అన్ని దశల ప్రవేశాల ప్రక్రియ ముగియడంతో ఈ ఏడాది కాలేజీల్లో ప్రవేశాలపై ఉన్నత విద్యా మండలి ఓ నివేదిక రూపొందించింది. దాని ప్రకారం.. 177 కాలేజీల్లో 1.10 లక్షల సీట్లకు సాంకేతిక విద్యా విభాగం కౌన్సెలింగ్ నిర్వహించింది. 2021–22లో కన్వీనర్, యాజమాన్య కోటా కలిపి 70 వేల మంది ఇంజనీరింగ్‌లోని వివిధ బ్రాంచ్‌ల్లో చేరగా.. ఈ ఏడాది (2022–23) ప్రవేశాల సంఖ్య 80 వేలు దాటింది. అయినప్పటికీ 30 వేల సీట్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఈ ఏడాది 61,972 సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేశారు. మిగతావి యాజమాన్య కోటా కింద భర్తీ అయ్యాయి.
కంప్యూటర్ కోర్సుల్లోనే పెరుగుదల
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఈ ఏడాది డిమాండ్ లేని కోర్సులు తగ్గించుకుని, డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో దాదాపు వంద కాలేజీలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో 10 వేల సీట్లు తగ్గించుకున్నాయి. వీటి స్థానంలో సీఎస్‌సీ, ఇతర కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పెంచుకున్నాయి. ఇప్పుడివన్నీ భర్తీ అయ్యాయి.
కన్వీనర్ కోటా కింద భర్తీ అయిన 61,972 సీట్లలో 45 వేలకుపైగా సీట్లు కంప్యూటర్ సంబంధిత కోర్సులవే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (ఈసీఈ)లో 12,503 సీట్లుంటే, 10,789 సీట్లు భర్తీ అయ్యాయి. మెకానికల్‌లో 4,653 సీట్లకు గాను 1,249 మంది చేరగా, సివిల్‌లో 5,060 సీట్లు ఉంటే, ప్రవేశాలు పొందిన విద్యార్థుల సంఖ్య 1,683 మంది మాత్రమే కావడం గమనార్హం.
యాజమాన్య కోటాలోనూ కంప్యూటర్ కిక్
రాష్ట్రవ్యాప్తంగా యాజమాన్య కోటాలో 30 వేలకు పైగా సీట్లు ఉండగా.. ఇందులోనూ 18 వేల సీట్లు కంప్యూటర్ సంబంధిత కోర్సుల్లోనే భర్తీ అయ్యాయి. ఈ కోటా కింద ఒక్కో సీటు కనిష్టంగా రూ.8 లక్షల నుంచి గరిష్టంగా రూ.16 లక్షల వరకూ అమ్ముడుపోయింది. వాస్తవానికి ఎంసెట్ ఫలితాల వెల్లడి తర్వాత యాజమాన్య కోటా కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ఎగబడ్డారు. స్పాట్ అడ్మిషన్ల దశలో టాప్ టెన్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ సీటు ఒక్కటీ మిగల్లేదు. ఆఖరి దశలో సీటు పొందాలనుకునే వారు రెండవ ఆప్షన్‌గా ఎలక్ట్రానిక్స్‌ను ఎంపిక చేసుకున్నారు.
ముందు వరుసలో సీట్లు రిజర్వు చేసుకున్న వాళ్లల్లో ఎక్కువ మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులకు ప్రాధాన్యమిచ్చారు. ఇక సివిల్, మెకానికల్ బ్రాంచీల్లో సీట్లను భర్తీ చేసుకునేందుకు కాలేజీలు తంటాలు పడాల్సి వచ్చింది. ఆఖరి దశలో ఎలాంటి అదనపు ఫీజు లేకుండానే కొన్ని కాలేజీలు సీట్లు ఇచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment