‘ఉన్నత’ విద్య సమున్నతం  | AP Govt Actions For Radical Reforms For Higher Education Council | Sakshi
Sakshi News home page

‘ఉన్నత’ విద్య సమున్నతం 

Published Sun, Aug 30 2020 6:01 AM | Last Updated on Sun, Aug 30 2020 6:01 AM

AP Govt Actions For Radical Reforms For Higher Education Council - Sakshi

సాక్షి, అమరావతి: నూతన జాతీయ విద్యావిధానాన్ని (ఎన్‌ఈపీ) కేంద్ర ప్రభుత్వం ప్రకటించకముందే ఉన్నత విద్యను సమూల మార్పులతో సంస్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా రంగానికి అధిక ప్రాధాన్యమిస్తూ పలుదఫాలు సమీక్షలు జరిపి మార్గనిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి సమగ్ర ప్రణాళిక రూపొందించింది. ఉన్నత విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరిస్తూ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన లక్ష్యంగా ఇది రూపొందింది. ఎన్‌ఈపీలో కూడా అవే అంశాలను  పొందుపరచడం విశేషం. 2020–21 విద్యా సంవత్సరం నుంచే వీటిని అమల్లోకి తేనుంది. 

ముందే సన్నద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం.. 
► ఎన్‌ఈపీలో ప్రస్తావించిన నైపుణ్యాభివృద్ధి, నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రాములపై రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మార్గ నిర్దేశం చేసింది. ఎన్‌ఈపీ డాక్యుమెంటు రాకముందే ఉన్నత విద్యామండలి ద్వారా కరిక్యులమ్‌ను పటిష్టం చేసి విడుదల చేశారు.  
► ఇంటర్న్‌షిప్, ఆనర్స్‌ డిగ్రీ, నాలుగేళ్ల యూజీ ప్రోగ్రామ్,  క్రెడిట్‌ బ్యాంకు, క్రెడిట్‌ ట్రాన్స్‌ఫర్‌ తదితరాలను కరిక్యులమ్‌లో ముందే చేర్చారు. 

పక్కాగా అమలు చేసేలా ప్రణాళిక.. 
కేవలం కరిక్యులమ్‌లో ఆయా అంశాలను పొందుపరచడమే కాకుండా పక్కాగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. కొత్త కోర్సులను సులభంగా బోధించేందుకు ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్, ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ కార్యక్రమాలను చేపడుతున్నాం. ‘ఎన్‌ఈపీ’ ఆలోచనా సరళిని ముందుగానే అందిపుచ్చుకోవడమే కాకుండా సమర్థంగా ఉన్నత విద్యాసంస్థల ద్వారా అమలు చేసేలా సంపూర్ణ ప్రణాళిక రూపొందించాం. ఎన్‌ఈపీలో 3, 4 ఏళ్ల డిగ్రీ కోర్సులను ప్రతిపాదించినందున రాష్ట్రంలో కూడా ఆ రెండింటినీ విద్యార్థులకు అందుబాటులోకి తెస్తాం. 
– ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌

విద్యార్థులకు అదనపు క్రెడిట్లు.. 
► విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనా కార్యక్రమాలు, ఈ–బుక్స్‌ను ప్రతిచోటకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం రిమోట్‌ లెర్నింగ్‌ కాన్సెప్ట్‌ను  తెస్తోంది. మార్కెట్‌ ఓరియెంటెడ్‌ కోర్సులతోపాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులను తీర్చిదిద్దేలా కరిక్యులమ్‌ను సిద్ధం చేశారు. 
► నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేకంగా విశ్వవిద్యాలయంతో పాటు 30 నైపుణ్యాభివృద్ధి  కాలేజీలను ఏర్పాటు చేసింది. 
► ఎన్‌ఈపీలో పేర్కొన్నట్లుగా జిల్లాకు ఒక మల్టీ డిసిప్లినరీ కాలేజీల ఏర్పాటుకు నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాకొక వర్సిటీ రాష్ట్రంలో ఉన్నాయి. 
► వర్సిటీలు, అటానమస్‌ కాలేజీలలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్, స్టార్టప్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 
► నిరంతర సమగ్ర మూల్యాంకచిన పద్ధతిలో ప్రాజెక్టులు, సెమినార్లు, అసైన్‌మెంట్లు, పరీక్షలతో విద్యార్థుల ప్రతిభను పరిగణనలోకి తీసుకుంటారు. 
► సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే అదనపు క్రెడిట్లు ఇస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement