వర్సిటీల్లో గ్రూప్స్‌కు ఫ్రీ కోచింగ్‌  | Telangana: Sabitha Indra Reddy Likely To Launch Free Coaching Centers | Sakshi
Sakshi News home page

వర్సిటీల్లో గ్రూప్స్‌కు ఫ్రీ కోచింగ్‌ 

Published Tue, Apr 19 2022 2:14 AM | Last Updated on Tue, Apr 19 2022 12:43 PM

Telangana: Sabitha Indra Reddy Likely To Launch Free Coaching Centers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్స్‌కు సన్నద్ధమయ్యే యూనివర్సిటీ విద్యార్థులకు ఉన్నత విద్యామండలి నేతృత్వంలో ఉచిత కోచింగ్‌ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. కోచింగ్‌ కోసం విద్యార్థులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ‘కొలువు కొట్టాల్సిందే’శీర్షికతో ‘సాక్షి’ప్రత్యేక కథనం ప్రచురించగా స్పందించిన ప్రభుత్వ వర్గాలు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశాయి. వర్సిటీల పరిధిలోని వేలాది మంది విద్యార్థులు కోచింగ్‌ కోసం అప్పులు చేయడం సరికాదని, వారికి ఉచితంగా కోచింగ్‌ ఇచ్చేందుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆదేశించారు.

దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సోమవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రికి చెప్పారు. దీంతో రాష్ట్రంలోని 6 వర్సిటీల ఉప కులపతులతో ఆయన సంప్రదింపులు జరిపారు. అనంతరం ఉచిత కోచింగ్‌ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభిస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయం నుంచి శిక్షణ కార్యక్రమాన్ని సబితారెడ్డి ప్రారంభించి అన్ని వర్సిటీల వీసీలతో చర్చిస్తారని ఉన్నత విద్యా మండలి పేర్కొంది. 

నిపుణులైన అధ్యాపకులను గుర్తించండి 
కోచింగ్‌ కోసం వర్సిటీల్లోని నిపుణులైన అధ్యాపకులను గుర్తించి వారి వివరాలు పంపాలని వీసీలకు లింబాద్రి సూచించారు. అవసరమైతే బయటి నుంచి కూడా ఫ్యాకల్టీని తీసుకోవాలన్నారు. గ్రూప్స్‌ అభ్యర్థులకు వర్సిటీ హాస్టళ్లల్లోనూ మౌలిక వసతులు కల్పించాలని మంత్రి సూచించినట్టు అధికారులు తెలిపారు.  

‘సాక్షి’ కథనం కదిలించింది 
సామర్థ్యం ఉండి కూడా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న అభ్యర్థుల దయనీయ కథనం కదిలించేలా ఉంది. వర్సిటీల్లో వేలాది మంది పేద, మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్లున్నారు. వారి సమర్థతకు ఆర్థిక ఇబ్బందులు అడ్డు కాకూడదన్న ఉద్దేశంతో ఉచిత కోచింగ్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడా రాజీ పడకుండా మంచి ఫ్యాకల్టీతో కోచింగ్‌ ఇవ్వాలని నిర్ణయించాం. వర్సిటీ విద్యార్థులు అనవసరంగా ప్రైవేటు కోచింగ్‌ సెంటర్లకు వెళ్లి ఆర్థికంగా నష్టపోవద్దు.  
– ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్‌)   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement