నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: దేశంలోని ఉన్నత విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు చదువుతో పాటు సృజనాత్మకతకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సృజనాత్మకత అంటూ లేకుండాపోతే మానవ జీవితం దుర్భరమైపోతుందని వ్యాఖ్యానించారు. ‘అకడమిక్ లీడర్‌షిప్ ఆన్ ఎడ్యుకేషన్ ఫర్ రీసర్జెన్స్’ పేరుతో కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ(హెచ్‌ఆర్డీ) శనివారం నాడిక్కడ నిర్వహించిన సమావేశంలో ప్రధాని మాట్లాడారు. ‘జ్ఞానం అన్నది పుస్తకాలకు పరిమితమైన విషయం కాదు. చదువు ముఖ్యోద్దేశం అన్ని కోణాల్లోనూ మనల్ని మనం పరిపూర్ణులుగా మలచుకోవడమే. కానీ సృజనాత్మకత లేకుండా అది సాధ్యం కాదు.
సరికొత్త ఆలోచనలు లేకుంటే మానవ జీవితం దుర్భరమైపోతుంది. మన ప్రాచీన విశ్వవిద్యాలయాలైన తక్షశిల, నలంద, విక్రమశిల చదువుతో పాటు సృజనాత్మకతకు సమ ప్రాధాన్యం ఇచ్చాయి. కళాశాలలను, విశ్వవిద్యాలయాలను అనుసంధానం చేయడం ద్వారా వారిలో పరిశోధనలు, నూతన ఆవిష్కరణలపై ఆసక్తిని పెంపొందించాలి. తద్వారా దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలకు వినూత్నమైన పరిష్కారాలు లభించే వీలుంది’ అని మోదీ తెలిపారు. ‘చదువు, జ్ఞానం కంటే వ్యక్తిత్వ నిర్మాణానికి అంబేడ్కర్, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, రామ్‌మనోహర్ లోహియా అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పరిపూర్ణమైన విద్యే ఓ వ్యక్తిని మనిషిగా తీర్చిదిద్దుతుందని స్వామి వివేకానంద నొక్కి వక్కాణించారు’ అని అన్నారు.
ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమైంది
దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమయిందనీ, ఆ పార్టీ క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి దూరం జరిగిపోయిందని మోదీ విమర్శించారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం, అబద్ధాలను ప్రచారం చేయడమే ఏకైక అజెండాగా ఆ పార్టీ పెట్టుకుందని ఎద్దేవా చేశారు. బిలాస్‌పూర్, బస్తీ, చిత్తోర్‌గఢ్, ధనబాద్, మందసౌర్‌లోని బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి శనివారం ‘నమో యాప్’ ద్వారా ప్రధాని మాట్లాడారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు అన్ని మాధ్యమాలను విస్తృతంగా వాడుకోవాలనీ, ప్రజల్లోకి చొచ్చుకెళ్లాలని మోదీ కార్యకర్తలకు సూచించారు. దేశంలో విజన్(దూరదృష్టి) లేనివారు టెలివిజన్‌లా మారి కామెడీ చేస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
పెద్ద నోట్ల రద్దు కారణంగా రియల్‌ఎస్టేట్ రంగంలో నల్లధనం తుడిచిపెట్టుకుపోయిందనీ, స్థిరాస్తుల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. అలాగే ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రజలు పొదుపు చేస్తున్న మొత్తం గత నాలుగేళ్లలో పెరిగిందన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, తీసుకుంటున్న చర్యలతో 2014–17 మధ్యకాలంలో దాదాపు 3,500 మావోయిస్టులు లొంగిపోయారని ప్రధాని తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ సర్జికల్ స్ట్రైక్స్ యధార్థతను ప్రశ్నిస్తూ దేశానికి వ్యతిరేకంగా వెళుతోందని ప్రధాని విమర్శించారు. కార్గిల్ యుద్ధ విజయోత్సవాలను జరుపుకునేందుకు కాంగ్రెస్ నిరాకరించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment