సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంచి విద్యార్థులు, అధ్యాపకులు ఉన్నా, జాతీయ ర్యాంకుల్లో తెలంగాణ వెనుకబడటం బాధాకరమని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. సమాజ శ్రేయస్సే లక్ష్యంగా, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ ధ్యేయంగా వర్సిటీల వీసీలు పనిచేయాల్సిన అవసరం ఉందని ఉద్బో«దించారు. రాజ్‌భవన్‌లో సోమవారం ఆమె విశ్వవిద్యాలయాల వైఎస్ చాన్స్‌లర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఎన్‌ఐఆర్‌ఎఫ్ వంటి జాతీయ స్థాయి ర్యాంకుల్లో మనం ఎందుకు వెనుకబడ్డామనేది గుర్తించాలని, ఈ లోపాన్ని అధిగమించేందుకు కృషి చేయాలని సూచించారు.
విశ్వవిద్యాలయాల నుంచి బయటకొచ్చే విద్యార్థులను ఉద్యోగాలు కల్పించే వారిగా తీర్చిదిద్దాలని, ఉన్నత విద్యలో మౌలిక వసతుల కల్పనకు తోడ్పడాలని సూచించారు. విద్యాలయాల్లో, ముఖ్యంగా అమ్మాయిలుండే కాలేజీల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలన్నారు. విద్యార్థులను సామాజిక బాధ్యత, పరిశోధన, కొత్తదనం వైపు నడిపించాల్సిన బాధ్యత విశ్వవిద్యాలయాలపైనే ఉందన్నారు. ఈ దిశగా కృషి చేసిన వర్సిటీలకు ఉత్తమ అవార్డులు అందిస్తామన్నారు. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు విషయంలో యూజీసీ, ఇతర విశ్వవిద్యాలయాలు, విద్యావేత్తలు నుంచి సమాచారం తీసుకున్నానని, తన వ్యాఖ్యలతో బిల్లును రాష్ట్రపతికి సిఫార్సు చేశానని గవర్నర్ తెలిపారు. ఈ క్రమంలో తాను వివిధ యూనివర్సిటీలను సందర్శించానని, కొంతమంది వీసీలను తొలగించాల్సి ఉన్నా కూడా కొనసాగించాల్సి వచ్చిందన్నారు. ప్రైవేటు వర్సిటీల బిల్లు విషయంలోనూ విద్యార్థులకు ఏది ఉపయోగమో అదే చేస్తానన్నారు. బిల్లును రాష్ట్రపతికి పంపినట్టు తెలిపారు.
పూర్వ విద్యార్థుల సేవలు వాడుకోవాలి..
వర్సిటీలు పూర్వ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలని, క్రీడలను ప్రోత్సహించాలని గవర్నర్ తమిళిసై సూచించారు. ఈ అంశాలపై తనకు నివేదిక ఇవ్వాలని వీసీలను ఆదేశించారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. వారిలో మనోధైర్యం నింపేలా విద్యాబోధన జరగాలన్నారు. వీసీలకు పరిమితులన్నా విద్యార్థుల కోసం పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులకోసం డిజిటల్ లైబ్రరీని ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో వివిధ వర్సిటీల వీసీలు.. లక్ష్మీకాంత్ రాథోడ్, గోపాల్‌రెడ్డి, నీరజ్ ప్రభాకర్, కవిత థరియా రావు, రవీందర్ రెడ్డి, బి.కరుణాకర్ రెడ్డి, విజ్జులత, కిషన్‌రావు, రిజిస్ట్రార్లు లక్ష్మీనారాయణ, వెంకటరమణ పాల్గొన్నారు. కాగా, జేఎన్‌టీయూహెచ్, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల వీసీలు గవర్నర్ సమావేశానికి రాకపోవడం చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment