కామన్‌ బోర్డుపై జగడం! యూనివర్సిటీలపై సర్కార్‌ దృష్టి | Telangana Governor Common Recruitment Board Controversy | Sakshi
Sakshi News home page

కామన్‌ బోర్డుపై జగడం! యూనివర్సిటీలపై సర్కార్‌ దృష్టి

Nov 11 2022 2:59 AM | Updated on Nov 11 2022 9:15 AM

Telangana Governor Common Recruitment Board Controversy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విశ్వవిద్యాలయాల్లో టీచింగ్, నాన్‌–టీచింగ్‌ సిబ్బంది పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కామ­న్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వివాదాస్పదంగా మారింది. అసలీ బోర్డును ఎందుకు తెచ్చా­రో చెప్పాలని గవర్నర్‌ తమిళిసై సౌంద­ర­రాజన్‌ ప్రభుత్వాన్ని వివరణ కోరారు. యూ­ని­వర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ (యూజీసీ) నిబంధనల మేరకే బోర్డు ఏర్పాటు జరిగిందా? అని ఆమె సందేహాలు లేవనెత్తారు. ప్రభు­త్వం మాత్రం అన్ని నిబంధనలకు లోబడే ఉమ్మడి నియామక బోర్డును ఏర్పా­టు చే­శామని సమర్థించుకుంటోంది. గత అసెంబ్లీ సమావేశాల్లో ఉభ­య­సభల ఆమో­దం పొం­దిన ఈ బిల్లు, ప్రస్తుతం గవర్నర్‌ వద్ద ఉంది. గవర్నర్‌ ఆమోదిస్తే చట్టంగా మారుతుంది. ఈ దశలోనే వివాదం మొదలైంది.

ఏమిటీ వివాదం?
రాష్ట్రంలోని 15 వర్సి­టీల్లో 8 ఏళ్లుగా నియా­మ­కాలు జరగలేదు. టీచింగ్, నాన్‌–టీచింగ్‌ కలిపి 8 వేల పోస్టుల ఖాళీలున్నాయి. గతంలో వర్సి­టీల్లో ఎక్కడికక్కడే సిబ్బందిని నియమించుకునే వాళ్లు. ఈ విధానంలో అవినీతి జరుగుతోందని భావించిన ప్రభుత్వం ఎవరికి వారు ఇష్టానుసారంగా మార్గదర్శ­కాలు పెట్టుకోవ­డం సరికాదంటూ ఉమ్మడి నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. అయితే, ఇది తమ అధికారాన్ని తగ్గించేలా ఉందంటూ వీసీలూ అంతర్గతంగా వ్యతిరే­కిస్తు­న్నారు. ఉమ్మడి బోర్డులో ఉన్నత విద్యామండలి చైర్మన్, ఇతర ఐఏఎస్‌ అధికారుల పాత్రను వాళ్లు జీర్ణించుకోలే­కపోతున్నారు.

ఇదే కోణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జగడం ఈ వివాదానికి ఆజ్యం పోసింది. వర్సిటీల చాన్స్‌లర్‌గా ఉండే గవర్నర్‌ ఉమ్మడి బోర్డుపై మరింత స్పష్టత కోరుతూ విద్యామంత్రికి లేఖ రాసి, వివాదా­న్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఉమ్మడి బోర్డు పేరుతో ప్రభుత్వం రాజకీయ నియామకా­లు చేపట్టే వీలుందనే అనుమానం ఆమె వ్యక్తం చేశారు. మొత్తం మీద అటు గవర్నర్, ఇటు ప్రభుత్వం మధ్యలో వర్సిటీల్లో నియామకాలు ఇప్పట్లో జరిగే అవకాశం కన్పించడం లేదని అంటున్నారు.

భారీగా ఖాళీలు... తగ్గుతున్న నాణ్యత
వర్సిటీల్లో నియామకాలు లేకపోవడంతో భారీగా ఖాళీలు ఏర్పడాయి. ఇది ఉన్నత విద్యపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రెగ్యు­ల­ర్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫె­సర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు లేకపోవడంతో పరిశో­ధ­నలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. కాంట్రాక్టు సిబ్బందితో ఏదో నెట్టుకొస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు.
► 2021 జనవరి 31 నాటికి 11 వర్సిటీల్లో 2,837 పోస్టులుంటే అందులో 1,869 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. కేవలం 968 మంది (34.12 శాతం) మాత్రమే రెగ్యులర్‌ అధ్యాపకులున్నారు.
► 1,869 ఖాళీల్లో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం మూడేళ్ల కిందటే ఆమోదం తెలిపినా భర్తీ చేయలేదు.
► శాతవాహన, మహాత్మాగాంధీ, పాల­మూ­రు, ఆర్‌జీయూకేటీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయా­ల్లో ప్రస్తుతం ఒక్క ప్రొఫెసర్‌ కూడా లేరు. శాతవాహన, రాజీవ్‌గాంధీ యూనివర్సి­టీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నా­ల­జీ (ఆర్‌జీయూకేటీ), అంబేడ్క­ర్‌ ఓపెన్‌ యూనివర్సిటీల్లో ఒక్క అసోసియేట్‌ ప్రొఫెసర్‌ కూడా లేరు. పొట్టి శ్రీరాము­లు తెలుగు యూనివ­ర్సిటీలో అసోసియే­ట్‌ ప్రొఫెసర్‌ ఒకే ఒకరున్నారు. 
► 11 వర్సిటీల్లో 61.65 శాతం ప్రొఫెసర్, 85.82 శాతం అసోసియేట్‌ ప్రొఫెసర్, 55.48 శాతం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
చదవండి: గవర్నర్ తమిళిసై ప్రశ్నల వర్షం.. మాట్లాడకుండా వెళ్లిపోయిన సబిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement