సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ యూనివర్సిటీల బలోపేతమే తన లక్ష్యమని గవర్నర్, యూనివర్సిటీల చాన్సలర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నామని, ఖాళీల భర్తీ చేస్తామని తెలిపారు. శుక్రవారం ఆమె ఆన్‌లైన్ ద్వారా మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ప్రభుత్వం వైస్ చాన్సలర్ల నియామకం, అధ్యాపక ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టిందని, అవి ప్రస్తుతం కరోనా కారణంగా ఆగిపోయినట్లు వెల్లడించారు. దీనిపై సీఎం కేసీఆర్‌తోనూ చర్చించానన్నారు.
తాను ప్రతి యూనివర్సిటీతో మాట్లాడుతున్నానని, ఇందులో భాగంగా శుక్రవారం కాకతీయ యూనివర్సిటీతో మాట్లాడానని చెప్పారు. అన్ని వర్సిటీలకు ఫ్యాకల్టీ, ఖాళీలు, పరిశోధన, మౌలిక సదుపాయాలు, అవసరాలు, స్థలాలు తదితర 41 అంశాలపై వివరాలను తీసుకుంటున్నట్లు చెప్పారు. అన్ని రాగానే ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఒక్కరోజులోనే మ్యాజిక్‌లాగా మార్పు సాధ్యం కాదని పేర్కొన్నారు.
దీటుగా ప్రభుత్వ వర్సిటీల అభివృద్ధి..
రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలు రావడం వల్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని గవర్నర్ చెప్పారు. వాటికి దీటుగా ప్రభుత్వ యూనివర్సిటీల అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునేవారు గర్వపడేలా తీర్చిదిద్దుతామన్నారు. విద్యార్థులకు కేవలం డిగ్రీలు ఇవ్వడమే కాకుండా ఉపాధి అవకాశాలను పెంచడమే లక్ష్యంగా పని చేస్తామని పేర్కొన్నారు. యూనివర్సిటీ హాస్టళ్లలో భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
కొత్త భవనాలను నిర్మిస్తామని, అవసరమైతే కొన్ని క్లాస్ రూమ్‌లను హాస్టళ్లుగా మార్పు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో విద్యా బోధనకు చర్యలు చేపడుతున్నామని, కొత్త కరిక్యులమ్‌తో సరికొత్త విద్యా విధానం రాబోతోందని వెల్లడించారు. కొంతమంది హాస్టళ్లలో ఉండి ఆన్‌లైన్‌లో ఉంటే మరికొంత మంది తరగతి గదుల్లో ఉంటారని.. అలా షిప్ట్ పద్ధతుల్లో బోధనపైనా పరిశీలన జరుపుతున్నామని వివరించారు.
ట్రిపుల్ ఈ మోడ్‌లో విద్య..
ఎంజాయ్, ఎడ్యుకేట్, ఎంప్లాయిమెంట్ వంటి ట్రిపుల్‌ఈ మోడ్ విద్య ఉండేలా చర్యలు చేపట్టాలని యూనివర్సిటీలను ఆదేశించానని గవర్నర్ తమిళిసై చెప్పారు. పారిశ్రామిక రంగాలతో మాట్లాడాలని, నాణ్యమైన విద్యతో అవకాశాలు పెంచాలని చెప్పానన్నారు. ‘ప్రభుత్వ యూనివర్సిటీలు, కాలేజీల విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంచడమే నా లక్ష్యం. యూనివర్సిటీల్లో పరిశోధనలు పెరగాల్సి ఉంది. విద్యార్థుల హాజరు 20% తక్కువగా ఉంది. సరైన సౌకర్యాలు లేక ఆన్‌లైన్‌లో కూడా 30% విద్యార్థులు హాజరు కాలేకపోతున్నారు. డిజిటల్ లైబ్రరీలను అందుబాటులోకి తెస్తాం. విద్యార్థులు వీలైనంత ఎక్కువ లబ్ధి పొందాలన్నదే నా ఉద్దేశం.
వర్సిటీల భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. టీచర్ల జీతాల విషయంలో యాజమాన్యాలు మానవతా దృక్పథంతో ఆలోచించాలి. తెలంగాణ కోవిడ్‌ని బలంగా ఎదుర్కొంటోంది. వైరస్ కల్చర్‌ను రూపొందించిన సీసీఎంబీకి అభినందనలు.. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈసారి రాజ్‌భవన్‌లో దీపాలంకరణ ఉండదు.. పండ్ల మొక్కలతోనే అలంకరిస్తాం. రాజ్‌భవన్‌లో గోశాల ఏర్పాటు చేస్తాం. తలసేమియా బాధితులతో జూన్ 2న సెలబ్రేషన్స్ నిర్వహిస్తాం. కోవిడ్‌పై కనెక్ట్ చాన్సలర్ కింద 6,303 దరఖాస్తులు వచ్చాయి. అందులో 4 భాషల్లో బాగా రాసిన వారికి అవార్డులు ఇస్తాం. కన్సొలేషన్ బహుమతులు అందజేస్తాం. అన్ని యూనివర్సిటీల పూర్వ విద్యార్థులను అభివృద్ధిలో భాగస్వాములను చేస్తాం..’అని ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment