ప్రతికాత్మక చిత్రం
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ,అంతర్జాతీయ విద్యాసంస్థలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు. వివిధ రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు లెక్కకు మిక్కుటంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ తరువాత మన రాష్ట్రంలోనే 11 రాష్ట్రవిశ్వవిద్యాలయాలు , 3 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు , 2 జాతీయ స్థాయి సంస్థలు ఎన్‌ఐటి,త్రిపుల్ ఐటీ, 1 డీమ్డ్ విశ్వవిద్యాలయం.. ఇలా మొత్తం 17 విశ్వవిద్యాలయాలు తెలంగాణలో ఉన్నాయి. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో మెరుగైన వసతులు లేమి, ఆర్థిక సంక్షోభం వల్ల పరిశోధనలు ఆవిష్కరణలు వాటి ఫలితాల అభివృద్ధి కేవలం కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. నూతన పద్ధతులను ఉపయోగించి పరిశోధన చేయాలంటే పరిశోధనాత్మక పరికరాలు, ఆధునిక ప్రయోగశాలలు , విశాలమైన భవనాలతోపాటు అనుభవం కల్గిన ఆచార్యులు పూర్తిస్థాయి లో ఉండాలి. కానీ మన రాష్ట్రం లో ఇప్పటికే 1200 ఆచార్య, సహా ఆచార్య పోస్టులు ఖాళీగా ఉండగా రాబోయే రెండేళ్లలో చాల మంది సీనియర్ ఆచార్యులు పదవి విరమణ పొందే అవకాశం ఉంది ఇది పరిశోధనకు గొడ్డలి పెట్టులాంటి చర్య.
దేశ వ్యాప్తంగా నేషనల్ ఫెలోషిప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ పేరు మీద కేంద్ర మానవ వనరుల శాఖ వారు షెడ్యూల్ కులాల వారికి 3000 ,ట్రైబల్ కులాలవారికి 800, వెనుకబడిన కులాలు ఓబీసీ వారికీ 300 స్లాట్స్ చొప్పున అందిస్తున్న సరిపోవడం లేదు. దేశవ్యాప్తంగా 331 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉండగా ఓబీసీ వారికి కేవలం 300 ఫెలోషిప్ మాత్రమే కల్పించడం వల్ల విశ్వవిద్యాలయానికి ఒక్కఫెలోషిప్ కూడా నోచుకోని స్థితిలో ఓబీసీ విద్యార్థులు ఉన్నారు కాబట్టి జనాభా ప్రాతిపదికన 50 శాతం ఉన్న ఓబీసీ లకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని 10000 స్లాట్స్ వారికి పెంచాలి. అలాగే.. ఎస్సీ, ఎస్టీ కులాల వారికీ అదనంగా 5000 స్లాట్స్‌ను పెంచాలి. మన విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోనే పరిశోధన రంగంలో అత్యున్నత స్థానాన్ని ఆక్రమించే ఆస్కారం వుండే దిశగా యూనివర్సిటీ నిధుల సంఘము, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం ఉండాలి. మన రాష్ట్ర ఉన్నత విద్య మండలి ప్రమాణాలకు పట్టం కట్టినపుడే తెలంగాణ పరిశోధన రంగంలో గొప్ప స్థానంలో ఉంటుంది. – ఈర్ల రాకేష్, పరిశోధక విద్యార్థి, కాకతీయ వర్సిటీ
Comments
Please login to add a commentAdd a comment