సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో దాదాపు 66 వేల సీట్లకు కోత పడే అవకాశముంది. గడిచిన రెండేళ్లలో వరుసగా 25 శాతం సీట్లు కూడా భర్తీ కానీ కాలేజీల్లో ఈసారి ప్రవేశాలు చేపట్టొద్దని, వాటిల్లోని విద్యార్థులను ఇతర కాలేజీల్లోకి పంపాలని యూనివర్సిటీలు ఇప్పటికే నిర్ణయించాయి. ఇందులో భాగంగా అన్ని యూనివర్సిటీలు తమ పరిధిలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 25 శాతం లోపు సీట్లు భర్తీ కానీ కాలేజీల లెక్కలు తేల్చాయి. ఇందులో 51 కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదని, దాదాపు 250 కాలేజీల్లో 25 శాతంలోపే సీట్లు భర్తీ అయ్యాయని లెక్కలు వేశారు. ఒక్కరు కూడా చేరని కాలేజీల్లో మొత్తం 10,150 సీట్లు ఉండగా, 25 శాతంలోపు విద్యార్థులు చేరిన కాలేజీల్లో 56,285 సీట్లు ఉన్నట్లు తేలింది. అందులో 8,803 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. దీంతో ఆయా కాలేజీల్లో ఈసారి ప్రవేశాలు చేపట్టొద్దని వర్సిటీలు ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
25 వేల సీట్లలో 4 వేలే భర్తీ..
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో భర్తీ కానీ సీట్లు కాకతీయ యూనివర్సిటీ పరిధిలోనే అత్యధికంగా ఉన్నాయి. 25 శాతంలోపే సీట్లు భర్తీ అయిన కాలేజీల్లో మొత్తం సీట్లు 25,055 ఉంటే 4,047 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 25 శాతంలోపే భర్తీ అయిన కాలేజీల్లో మొత్తం సీట్లు 10,610 ఉంటే వాటిల్లో 1,731 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ నేపథ్యంలో అలాంటి కాలేజీల్లో ఈసారి ప్రవేశాలకు అవకాశం ఇవ్వొద్దని యూనివర్సిటీలు కసరత్తు చేస్తున్నాయి.
66 వేల డిగ్రీ సీట్లకు కోత!
Published Sat, Mar 24 2018 3:16 AM | Last Updated on Sat, Mar 24 2018 3:16 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment