Basic facilities
-
రూ. వేయి కోట్లు ఇస్తేనే ‘గృహ’ప్రవేశం
సాక్షి, హైదరాబాద్: దేశంలో మరే రాష్ట్రంలో నిర్మించని తరహాలో నిరుపేదల కోసం రూపుదిద్దుకున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం మూడొంతులు సిద్ధమైనా ఇప్పటికిప్పుడు ప్రజలు నివాసం ఉండే పరిస్థితి కనిపించటం లేదు. ఆ కాలనీలకు మంచినీళ్లు, కరెంటు, మురిగునీటి పారుదల, రోడ్లు.. లాంటి అతి ముఖ్య ప్రాథమిక వసతులు కూడా లేవు. ఇవన్నీ సిద్ధం కావాలంటే ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా రూ.వేయి కోట్లు కావాలి. కనీస వసతుల కల్పనకు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. సొంత జాగా ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.5 లక్షల చొప్పున, సొంత జాగా లేనివారికి ముందుగా భూమి ఇచ్చి ఇంటి నిర్మాణ యూనిట్ కాస్ట్ నిధులు ఇస్తామని ఈ ప్రభుత్వం పేర్కొంది. కానీ ఈ ఏడాది సొంత జాగా లేని వారిని పక్కన పెట్టేసింది. ఇక ఇందిరమ్మ ఇళ్ల కోసం 66 లక్షలను మించి వచ్చిన దరఖాస్తుల విషయంలో ఎలా ముందుకెళ్లాలో కూడా రూట్ మ్యాప్ సిద్ధం కాలేదు. 1.49 లక్షల ఇళ్లు సిద్ధమైనా.. రాష్ట్రవ్యాప్తంగా 2.29 లక్షల రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టగా, 1.49 లక్షల ఇళ్లు సిద్ధమయ్యాయి. మరో 80 వేలు తుది దశలో, వివిధ స్థాయిల్లో ఉన్నాయి. ఈ ఇళ్లను కూడా ఇందిరమ్మ ఇళ్ల కిందనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని తాజాగా ప్రభుత్వం భావిస్తోంది. ఇళ్లు సిద్ధంగా ఉన్నా, ప్రజలు మాత్రం వాటిల్లో ఉండే పరిస్థితి మాత్రం ప్రస్తుతం లేదు. ఆయా కాలనీల్లో ఇళ్లనైతే నిర్మించారు గానీ, వాటిల్లో మంచినీళ్లు, విద్యుత్ కనెక్షన్లు లేవు. వాననీళ్లు, మురుగునీళ్లు వెళ్లే వ్యవస్థ లేదు. రోడ్లతో అనుసంధానం కాలేదు. చాలా కాలనీలు ప్రస్తుత జనావాసాలకు దూరంగా ఉన్నందున.. చాలా వసతులు కల్పించాల్సి ఉంది. ఇటీవల అధికారులు వాటిపై సమీక్షించి లెక్కలు వేసి రూ.వేయి కోట్లకుపైగా నిధులు ఉంటే తప్ప ఆ ఏర్పాట్లు చేయటం సాధ్యం కాదని తేల్చారు. వాటి నిర్మాణం ప్రారంభించిన సమయంలో నాటి ప్రభుత్వం వేసిన అంచనాలు ఇప్పుడు పెరిగిపోయాయి. దీంతో వాటిని సవరించాల్సి ఉంది. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో హైదరాబాద్ నగరం, దాని శివారు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో లక్ష ఇళ్లను నిర్మించారు. వీటిల్లో కొన్నింటిలో లబ్ధిదారులు ఉంటుండగా, మిగ తా కాలనీలు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. ఆయా కాలనీల్లో మంచినీటి, మరుగునీటి పారుదలకు కావా ల్సిన ట్రంక్‌లైన్లు, విద్యుత్ అనుసంధాన వ్యవస్థ, వరదనీటి కాలువల కోసం దాదాపు రూ.650 కోట్లు కావాలి. పోలీసు స్టేషన్లు, అంగన్వాడీ కేంద్రాలు, బస్టాపులు, రేషన్ దుకాణాలు లాంటి వాటిని కూడా సమకూర్చాల్సి ఉంది. అందుకు మరికొన్ని నిధులు కా వాల్సి ఉంటుంది. ఇక జీహెచ్ఎంసీ వెలుపల.. జిల్లా ల్లో నిర్మించిన కాలనీల్లో మంచినీరులాంటి కనీస వస తులు కూడా లేవు. కాలనీలను నివాసయోగ్యంగా మార్చాలంటే రూ.456 కోట్లు కావాల్సి ఉంది. మిగిలిన నిధులు ఏమయ్యాయో? గత ప్రభుత్వం రూ.201 కోట్లను విడుదల చేసింది. వాటిల్లో రూ.39 కోట్లు మాత్రమే ఖర్చ య్యాయి. మిగతా నిధులేమయ్యాయో తేలాల్సి ఉంది. గత ప్రభుత్వం విడుదల చేయగా పోనూ మిగిలిన మొత్తాన్ని ఇప్పుడు విడుదల చేయాల్సి ఉంది. అంచనా వ్యయాలు పెరిగినందున అదనంగా వాటి అవసరం ఏర్పడింది. నిధులు ఇవ్వటంలో జాప్యం జరిగే కొద్దీ.. ఆ ఇళ్లు నిరుపయోగంగా ఉండాల్సిందే. మరింత ఆలస్యమైతే.. నిర్మాణాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. -
వసతుల కల్పనతో సత్వర న్యాయం
సాక్షి, హైదరాబాద్: కోర్టుల్లో మౌలిక వసతుల కల్పన సత్వర న్యాయానికి దోహదపడుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా న్యాయస్థానాల్లో ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. కోర్టుల్లో పనిచేసే వారికి వసతులు బూస్ట్‌లా పనిచేస్తాయని అన్నారు. దేశవ్యాప్తంగా దిగువ కోర్టుల్లోనే కాకుండా హైకోర్టుల్లోనూ సదుపాయాల కొరత ఉందని తెలిపారు. కనీసం టాయిలెట్లు లేని కోర్టులు కూడా ఉన్నాయని వెల్లడించారు. ‘మరి మహిళలు ఎక్కడికి పోవాలి? ఉదయం ఇంటి నుంచి వస్తే సాయంత్రం ఇల్లు చేరేవరకు వారు ఎలా ఉండాలి? పాలిచ్చే తల్లి కోసం ఓ గది, చిన్న పిల్లల కోసం ఊయల.. ఇలా కనీస వసతులు కూడా లేని పరిస్థితి ఉంది..’ అని ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో 100 ఎకరాల్లో నిర్మించనున్న తెలంగాణ హైకోర్టు నూతన ప్రాంగణానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్, జస్టిస్ ఎస్వీ భట్టి, రాష్ట్ర హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధేతో కలసి బుధవారం ఆయన భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు. కోర్టులు మార్గదర్శకంగా నిలవాలి ‘హైకోర్టు అనేది ప్రజల హక్కులను, విలువలను, విధులను పరిరక్షించే ఒక ప్రాంతం. మహిళలంటే వివక్ష తగదు. మహిళలకు, దివ్యాంగులకు కొత్త భవనంలో అన్ని సౌకర్యాలూ ఉండాలి. అన్ని వనరులతో పనిచేస్తూ కోర్టులు ఇతర ప్రభుత్వ శాఖలకు మార్గదర్శకంగా నిలవాలి. సాంకేతికతను వినియోగించుకోవాలి. ఈ–కోర్టుల్లో భాగంగా ఈ–సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయం. న్యాయవాదులైనా, న్యాయమూర్తులైనా.. జూనియర్లకు సీనియర్లు సలహాలు, సూచనలు ఇస్తుండాలి. ఇది న్యాయ విలువలను పెంపొందిస్తుంది. జస్టిస్ చిన్నపరెడ్డి, జస్టిస్ సుబ్బారావు, జస్టిస్ జీవన్‌రెడ్డి లాంటి వారు ఇక్కడినుంచి సుప్రీంకోర్టు వరకు ఎదిగి న్యాయ వ్యవస్థ విలువలు పెంపొందించారు..’ అని జస్టిస్ చంద్రచూడ్ గుర్తు చేశారు. నా కల నెరవేరుతోంది: జస్టిస్ పీఎస్ నరసింహ ‘నేను తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశా. న్యాయవాదిగా నమోదు చేసుకున్న కొత్తలో ఎప్పుడూ వసతుల లేమిపై ఆలోచిస్తుండేవాడిని. న్యాయమూర్తులతో పాటు న్యాయవాదులకు మౌలిక సదుపాయాలు ఉంటే వారు మరింత ఉత్సాహంగా పనిచేస్తారని అనిపించేది. నాటి కల ఇప్పుడు కొత్త భవన నిర్మాణంతో నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది. హైకోర్టు భవన నిర్మాణం వెనుక సీజే జస్టిస్ అలోక్ అరాధే కృషి అభినందనీయం. ప్రభుత్వాన్ని కూడా ప్రశంసించాల్సిందే. నిజాం కాలం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. ఇలా మూడు దశల్లోనూ వందేళ్లకు పైగా ప్రస్తుత భవనం సేవలందించింది. ప్రస్తుతం జడ్జిల చాంబర్లు కూడా బాగాలేవు. లాన్లో సమావేశాలు నిర్వహించుకోవాల్సి వస్తోంది. జడ్జిలకే కాదు.. న్యాయవాదులకు కూడా కన్సల్టేషన్ రూంలు అవసరం. మీటింగ్ చాంబర్, క్లినిక్ల్లాంటివి లగ్జరీ వసతులేం కావు. కనీస వసతులే. పూర్తి పర్యావరణ హితంగా హైకోర్టు నిర్మాణం జరగాలి..’ అని జస్టిస్ పీఎస్ నరసింహ సూచించారు. అందరికీ ఉపయుక్తంగా కొత్త కోర్టు: సీజే అలోక్ అరాధే ‘కోర్టులు అన్ని వసతులతో సిద్ధంగా ఉంటే వేగవంతంగా, పారదర్శకంగా కేసులు పూర్తి చేయవచ్చు. కొత్తగా నిర్మిస్తున్న హైకోర్టు న్యాయ వర్గాలకే కాదు.. ప్రజలకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది. పర్యావరణ హితంగా నిర్మాణం సాగుతుంది..’ అని హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే చెప్పారు. హైకోర్టు నిర్మాణానికి వేగంగా చర్యలు చేపట్టిన ప్రభుత్వానికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు, రిజి్రస్టార్లు, అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) నరసింహ శర్మ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) గాడి ప్రవీణ్‌కుమార్, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) సుదర్శన్‌రెడ్డి, ఏఏజీలు ఇమ్రాన్‌ఖాన్, తేరా రజనీకాంత్‌రెడ్డి, హెచ్‌సీఏఏ అధ్యక్షుడు, హైకోర్టు పీపీ పల్లె నాగేశ్వర్రావు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 32 జిల్లా కోర్టుల్లో ఈ–సేవా కేంద్రాలను జస్టిస్ చంద్రచూడ్ ప్రారంభించారు. విద్యార్థి సంఘాల నేతల అరెస్టు ఏజీ వర్సిటీ: నూతన హైకోర్టు భవనానికి శంకుస్థాపన పురస్కరించుకుని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు వర్సిటీలకు చెందిన 100 ఎకరాల్లో హైకోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పలు విద్యార్థి సంఘాల నాయకులు, వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల విద్యార్థులు గత 60 రోజులుగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. -
తిరోగమనంలో ‘పరిశోధనలు’
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ,అంతర్జాతీయ విద్యాసంస్థలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు. వివిధ రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు లెక్కకు మిక్కుటంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ తరువాత మన రాష్ట్రంలోనే 11 రాష్ట్రవిశ్వవిద్యాలయాలు , 3 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు , 2 జాతీయ స్థాయి సంస్థలు ఎన్ఐటి,త్రిపుల్ ఐటీ, 1 డీమ్డ్ విశ్వవిద్యాలయం.. ఇలా మొత్తం 17 విశ్వవిద్యాలయాలు తెలంగాణలో ఉన్నాయి. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో మెరుగైన వసతులు లేమి, ఆర్థిక సంక్షోభం వల్ల పరిశోధనలు ఆవిష్కరణలు వాటి ఫలితాల అభివృద్ధి కేవలం కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. నూతన పద్ధతులను ఉపయోగించి పరిశోధన చేయాలంటే పరిశోధనాత్మక పరికరాలు, ఆధునిక ప్రయోగశాలలు , విశాలమైన భవనాలతోపాటు అనుభవం కల్గిన ఆచార్యులు పూర్తిస్థాయి లో ఉండాలి. కానీ మన రాష్ట్రం లో ఇప్పటికే 1200 ఆచార్య, సహా ఆచార్య పోస్టులు ఖాళీగా ఉండగా రాబోయే రెండేళ్లలో చాల మంది సీనియర్ ఆచార్యులు పదవి విరమణ పొందే అవకాశం ఉంది ఇది పరిశోధనకు గొడ్డలి పెట్టులాంటి చర్య. దేశ వ్యాప్తంగా నేషనల్ ఫెలోషిప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ పేరు మీద కేంద్ర మానవ వనరుల శాఖ వారు షెడ్యూల్ కులాల వారికి 3000 ,ట్రైబల్ కులాలవారికి 800, వెనుకబడిన కులాలు ఓబీసీ వారికీ 300 స్లాట్స్ చొప్పున అందిస్తున్న సరిపోవడం లేదు. దేశవ్యాప్తంగా 331 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉండగా ఓబీసీ వారికి కేవలం 300 ఫెలోషిప్ మాత్రమే కల్పించడం వల్ల విశ్వవిద్యాలయానికి ఒక్కఫెలోషిప్ కూడా నోచుకోని స్థితిలో ఓబీసీ విద్యార్థులు ఉన్నారు కాబట్టి జనాభా ప్రాతిపదికన 50 శాతం ఉన్న ఓబీసీ లకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని 10000 స్లాట్స్ వారికి పెంచాలి. అలాగే.. ఎస్సీ, ఎస్టీ కులాల వారికీ అదనంగా 5000 స్లాట్స్‌ను పెంచాలి. మన విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోనే పరిశోధన రంగంలో అత్యున్నత స్థానాన్ని ఆక్రమించే ఆస్కారం వుండే దిశగా యూనివర్సిటీ నిధుల సంఘము, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం ఉండాలి. మన రాష్ట్ర ఉన్నత విద్య మండలి ప్రమాణాలకు పట్టం కట్టినపుడే తెలంగాణ పరిశోధన రంగంలో గొప్ప స్థానంలో ఉంటుంది. – ఈర్ల రాకేష్, పరిశోధక విద్యార్థి, కాకతీయ వర్సిటీ -
మా గ్రామానికి మౌలిక వసతులు లేవు
కందుకూరు రూరల్: ‘అద్దంకి మండలం పొటికలపూడి పంచాయతీలోని రామచంద్రాపురం ఎస్సీ కాలనీకి మౌలిక వసతులు కరువయ్యాయి. నాలుగేళ్ల క్రితం గుండ్ల ప్రాజెక్టు కింద ముప్పు గ్రామాల నుంచి ఇక్కడకి వచ్చాం. కేవలం స్థలాలు ఇచ్చారే తప్ప ఇళ్లు నిర్మించి ఇవ్వలేదు. కరేంట్ లేదు, మంచినీటి సరఫరా లేదు. గుండ్లకమ్మ ప్రాజెక్టు నుంచి మూడు కిలో మీటర్లు ఉంటుంది. కానీ మంచినీటి వసతి కల్పించడం లేదు. ఎన్ని సార్లు అధికారులు చుట్టూ తిరిగినా ఉపయోగం లేకుండా పోయింది’ అంటూ కాలనీకి చెందిన రామమోహన్‌రావు, చంద్రమ్మ, వెంకమ్మ, అరుణకుమారి, జగదీశ్వరి ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. నడవలేకపోతున్నాడు! చీరాల అర్బన్: ‘నా మేనల్లుడు బి.నానికి పుట్టుకతో కాలు బాగాలేదు. గతంలో కాలికి ఆపరేషన్ చేయించాం. ఆపరేషన్ తర్వాత కాలు నొప్పిగా ఉండడంతో నడిచేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం 9 సంవత్సరాల వయస్సు వచ్చినా నడిచేందుకు కాలు సహకరించడంలేదు’ అంటూ కుంకుపాడుకు చెందిన బాలుడి మేనమామ సైమన్ ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డికి సమస్యను వివరించాడు. -
సన్మానాలు, వినోదాలకు ఖర్చు పెట్టొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: గ్రామ పంచాయతీల్లో ఇష్టారాజ్యంగా నిధుల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. కేంద్రం నుంచి అందే నిధులను సన్మానాలు, వినోద కార్యక్రమాల ఏర్పాటు, వాహనాల కొనుగోళ్లు వంటి వాటికి వినియోగించడంపై ఆంక్షలు విధించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అందే నిధుల వినియోగానికి మార్గదర్శకాలను రూపొందించింది. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగానే గ్రామ పంచాయతీలు నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు అందే కేంద్ర నిధుల్లో కార్యాలయ నిర్వహణ కోసం ఇచ్చే పది శాతం సొమ్ముతో... సన్మానాలు, వినోద కార్యక్రమాలు, ఏసీలు, వాహనాల కొనుగోళ్లు చేపట్టరాదని స్పష్టం చేసింది. మౌలిక సదుపాయాలకు వెచ్చించొచ్చు.. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు గ్రామ పంచాయతీల కు కేటాయించే నిధుల వినియోగంపై మార్గదర్శకాలను రూ పొందించడానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఒక కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఆ కమిటీ రూపొందించిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు అంగీకరించాయి. ఈ మేరకు ఆ మార్గదర్శకాలను అమలు చేయాల్సిందిగా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం... కార్యాలయ నిర్వహణ కోసం వెసులుబాటు కల్పించిన పదిశాతం నిధులను వినియోగిస్తూ గ్రామ పంచాయతీలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించరాదు. అలంకరణ, ప్రారంభోత్సవ కార్యక్రమాలు, పారితోషికం చెల్లింపు, అవార్డులు అందించడం, ప్రజా ప్రతినిధులకు టీఏ, డీఏ చెల్లించడం వంటి చేయకూడదు. వేరే పథకాల కింద అమలవుతున్న కార్యక్రమాలకు ఈ పదిశాతం సొమ్మును వినియోగించరాదు. అయితే గ్రామ పంచాయతీ కార్యాలయానికి అవసరమైన ఫర్నీచర్, కంప్యూటర్ల కొనుగోలు, ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఈ నిధులను వినియోగించవచ్చు. గ్రామ పంచాయతీ విద్యుదీకరణ, కొనసాగుతున్న సివిల్ పనులను పరిశీలించడానికి వచ్చిన నిపుణులకు పారితోషికం చెల్లింపునకు వాడవచ్చు. ఇక గ్రామ పంచాయతీలకు ప్రస్తుతమున్న సిబ్బంది, మౌలిక వసతుల ఆధారంగా ప్రాధాన్యతలతో కూడిన జాబితాను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. -
మౌలిక రంగమే ‘కీ’లకం: మోదీ
సోనిపట్: దేశం ఆర్థికంగా దూసుకుపోవడానికి మౌలిక వసతుల కల్పనే అత్యంత కీలకమని ప్రధానిమోదీ అన్నారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతులకు సంబంధించి రూ.4 లక్షల కోట్ల ప్రాజెక్టులను చేపట్టినట్లు వివరించారు. దేశంలో నేటికీ 18 వేల గ్రామాలు విద్యుత్ వెలుగులకు దూరంగా ఉన్నాయని, వాటన్నింటికీ కరెంటు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం హరియాణాలో హైవే ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం సోనిపట్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రానికి రూ.32 వేల కోట్ల ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు తెలిపారు. ‘గత ఐదారు నెలల్లో పెండింగ్ ప్రాజెక్టులపై వివిధ రాష్ట్రాల సీఎంలతో మాట్లాడి, రూ.4 లక్షల కోట్లతో వివిధ ప్రాజెక్టులను చేపట్టాం. సేతుభారతం కింద 375 బ్రిడ్జిలను నిర్మిస్తామని, సాగరమాల ద్వారా తీర పట్టణాల్లో పోర్టులను అభివృద్ధి చేస్తామని వివరించారు. దేశీయంగా ఆయుధాల ఉత్పత్తి న్యూఢిల్లీ: విదేశాల నుంచి మనం భారీ ఎత్తున ఆయుధాలు, రక్షణ పరికరాలను దిగుమతి చేసుకుంటున్నామని... వాటిని దేశీయంగా ఉత్పత్తి చేసుకుంటే పదేళ్లలో రక్షణ బడ్జెట్ సగానికి తగ్గుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. -
తలుపుల్లేని మరుగుదొడ్లు.. నీళ్లు రాని బాత్రూమ్లు
ఎస్‌ఎస్‌తాడ్వాయి : గిరిజన ఆశ్రమ పాఠశాలలు సమస్యల వలయంలో కొట్టుమిట్టులాడుతున్నాయి. విద్యార్థులు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థినులు పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. తాడ్వాయి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 558 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఈ పాఠశాలలో 26 స్నానాల గదులు, 40 మరుగుదొడ్ల గదులు ఉన్నాయి. ఇందులో 16 మరుగుదొడ్లు వినియోగంలో ఉండగా, 24 మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. విద్యార్థినుల సంఖ్యకు తగిన స్నానాల గదులు, మరుగుదొడ్లు లేకపోవడంతో వారు తెల్లవారుజామునే లేచి మరుగుదొడ్లు, బాత్రూమ్ల ఎదుట గంటల తరబడి క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పాఠశాలలో భవనాల మీద భవనాలు నిర్మిస్తున్న గిరిజన సంక్షేమశాఖ అధికారులు విద్యార్థినులకు కావాల్సిన కనీస సౌకర్యాలపై దృష్టి సారించకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. మేడారం ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో.. మేడారం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలోనూ మరుగుదొడ్లు, స్నానాల గదుల కొరత ఉంది. 480 మంది విద్యార్థినులు ఉన్న ఈపాఠశాలలో 17 స్నానాల గదులు, 13 మరుగుదొడ్లు ఉన్నాయి. మేడారం జాతర సందర్భంగా నిర్మించిన 10 మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరి వినియోగించడానికి వీలులేకుండా ఉన్నాయి. వీటిని వినియోగంలోకి తీసుకొస్తే కొంతమేరకైనా సమస్య తీరుతుందని విద్యార్థినులు పేర్కొంటున్నారు. ఐటీడీఏ అధికారులు దృష్టి సారించి మరుగుదొడ్లు, స్నానాల గదులు నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తాడ్వాయి హాస్టల్లోనూ అంతే.. మండల కేంద్రంలోని గిరిజన బాలికల వసతి గృహాంలో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఈ పాఠశాలలో 250 మంది విద్యార్థినులు ఉన్నారు. పాఠశాలలోని 20 మరుగుదొడ్లు మరమ్మతుకు నోచుకోవడం లేదు. సెప్టిక్ ట్యాంక్ కనెక్షన్ పైపు పగిలిపోవడంతో మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. ఇటీవల కొత్తగా నిర్మించిన మరుగుదొడ్లకు వాటర్ కనెక్షన్ పైపులు పాడైపోవడంతో విద్యార్థినులు బకెట్లల్లో నీళ్లు తీసుకెళ్లాల్సి వస్తోంది. స్నానాలకు గదులు కూడా లేకపోవడంతో విద్యార్థినులు హౌస్ వద్దనే స్నానాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. హాస్టల్ భవనం కుడా శిథిలావస్థకు చేరింది. భవనం స్లాబ్ పెచ్చులూడి చువ్వలు తేలుతున్నాయి. భవనం ఎప్పుడు కూలుతోందనని విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై సంబంధిత అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని హెచ్‌డబ్ల్యూఓ వాపోయారు. వేసవి సెలవుల తర్వాత పాఠశాల పునఃప్రారంభం నాటికల్లా అదనపు మరుగుదొడ్లు, స్నానాల గదుల నిర్మాణంతోపాటు నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లు, స్నానాల గదులను వినియోగంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఐటీడీఏ అధికారులపై ఉంది. పీఓ స్పందించి ఆశ్రమ పాఠశాలల్లోని సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని విద్యార్థులు కోరుతున్నారు. -
సమస్యల ఒడిలో గురుకుల బడి
కీసర: ఒకప్పుడు ఆదర్శ విద్యాలయంగా పేరు సంపాదించిన ఆ గురుకుల పాఠశాల నేడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. అరకొర సౌకర్యాల మధ్య విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన సాగాల్సి ఉండగా అధ్వాన పరిస్థితుల్లో కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలనే సదాశయంతో 1978లో కీసరగుట్టలో గురుకుల విద్యాలయాన్ని ప్రారంభించారు. అందుకు తగ్గట్టుగానే మొదట్లో సకల సౌకర్యాలతో అత్యుత్తమ బోధనతో ఆదర్శ గురుకుల విద్యాలయంగా పేరు గడించింది. రానురాను పరిస్థితి దిగజారుతూ వస్తోంది. ఎప్పుడో 35 ఏళ్ల క్రితం కల్పించిన సౌకర్యాలు తప్పితే కొత్తగా చేసింది ఏమీ లేదు. ఒకప్పుడు ఐదు నుంచి పదో తరగతి వరకు 500 నుంచి 600 వరకు విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 370 మంది విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి ఇదీ.. ఏళ్లక్రితం విద్యార్థులకోసం నిర్మించిన ఐదు డార్మెంట్ హాళ్లు అధ్వాన స్థితికి చేరాయి. కిటికీలు, తలుపులు పూర్తిగా విరిగిపోయాయి. దీంతో విద్యార్థులు రాత్రి వేళ పడరానిపాట్లు పడుతున్నారు. దోమలు, ఈగల బాధకు తోడు చలికాలం, వర్షకాలంలో కంటికి కునుకు లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు. గతంలో విద్యార్థులకోసం ఇచ్చిన మంచాలు తుప్పుపట్టి పోవడంతో మూలన పడేశారు. వాటిస్థానంలో ఇప్పటి వరకు కొత్తవి మంజూరు కాకపోవడం విద్యార్థులు నేలపైనే నిద్రించాల్సి వస్తోంది. ఇక పాఠశాలకు పక్కా ప్రహరీ లేకపోవడం కుక్కలు, పందులు, పశువులు పాఠశాల ఆవరణలోనే తిరుగుతున్నాయి. విషసర్పాలు డార్మింట్ రూమ్ సమీపంలోనే సంచరిస్తూ విద్యార్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. డైనింగ్‌హాల్ సమీపంలోనే పందులు స్వైర విహారం చేస్తున్నాయి. సరైన బాత్రూమ్లు, మరుగుదొడ్లు లేకపోవడం విద్యార్థులు ఆరుబయటే స్నానాలు చేయడం, కాలకృత్యాలు తీర్చుకోవడం చేస్తున్నారు. మంచినీటి సమస్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పాఠశాలలో ఒకే ఒక్కబోరు ఉండటంతో నీటికోసం ప్రతిరోజు ఇబ్బందులు తప్పడంలేదు. ఉన్న ఒక్కబోరు చెడిపోతే విద్యార్థులు స్నానాలకోసం కీసరగుట్ట వేదపాఠశాల, పార్కు, టీటీడీ ధర్మశాల వద్దకు బకెట్లు పట్టుకొని పరుగులు తీయాల్సిందే. ఇక డైనింగ్‌హాల్, వంటగదిలో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులకు భోజనపాట్లు అదనంగా తోడయ్యాయి. పేరుకే గురుకుల పాఠశాల అయినా కనీసం సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉన్న కొద్దిపాటి వసతులు కూడా విద్యార్థులకు అందడం లేదు. అమ్మో ఆ స్కూలా..! ఒకప్పుడు ఇక్కడి పాఠశాలలో చేరేందుకు విద్యార్థులు ఉత్సాహం చూపేవారు. నేటి పరిస్థితులను చూసి ఇక్కడ ఉండడానికి, చదవడానికి జంకుతున్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చామా అని విద్యార్థులు.. తమ పిల్లలను ఎందుకు పంపించామా అని తల్లిదండ్రులు ఆవేదన చెందే పరిస్థితులు నెలకొన్నాయి. మూడు సంవ త్సరాలుగా పాఠశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఇక్కడ చదవలేక వెనుదిరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా వికారాబాద్ ఆలంపల్లికి చెందిన విఘ్నేశ్వర్‌రెడ్డి ఐదో తరగతిలో అడ్మిషన్ పొంది వారం రోజులు తిరక్కముందే ఇక్కడి పరిస్థితులు చూసి మంగళవారం వెనుదిరిగాడు. ఈ మేరకు విద్యార్థితండ్రి మహిపాల్‌రెడ్డి పాఠశాల దయనీయ పరిస్థితులను స్వయంగా కలెక్టర్‌కు తెలియజేశారు. తమ బిడ్డను కూలీనాలి చేసైనా ఎక్కడైనా చదివిస్తాను తప్ప ఈ గురుకుల పాఠశాలలో మాత్రం చదివించనని స్పష్టం చేయడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. కీసరగుట్ట గురుకులాన్ని జిల్లాలోనే ఆదర్శపాఠ శాలగా తీర్చిదిద్దుతామని దశాబ్దకాలంగా ప్రజాప్రతినిధులు, అధికారులు హామీలు గుప్పిస్తున్నా కార్యరూపం దాల్చలేదు. పూర్వ విద్యార్థులు అడపాదడపా విరాళాలు ఇస్తున్నా లెక్కలేకుండాపోయింది. విద్యార్థులకు సరైన వసతి సౌకర్యాలు కల్పించి పాఠశాలకు పూర్వవైభవం తేవాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు. -
వైజాగా... చాలదా
విశాఖలో రాజధాని ఏర్పాటుకు అందుబాటులో 15వేల ఎకరాలు సీఎం దృష్టికి తీసుకువెళ్లిన శివరామకృష్ణన్ కమిటీ గుంటూరువైపు ప్రభుత్వం మొగ్గుతో మనకొచ్చే అవకాశం తక్కువే బదులుగా ఈ భూముల్లో భారీగా కొత్త ప్రాజెక్టులొచ్చే వీలు ఐఐటీ,ఐటీఐఆర్ ఏదో ఒకటి దక్కే అవకాశం వేలాది ఎకరాల స్థలాల లభ్యత ఉన్నా నవ్యాంధ్రకు రాజధానిగా విశాఖ అవతరించేదీ లేనిదీ ఇంకా రూఢి కాలేదు. రాజమండ్రి,గుంటూరు ప్రాంతాల్లో ఇక్కడి కన్నా తక్కువ భూములున్నటు తేలింది. ఈ నేపథ్యంలో తాజాగా విశాఖలో రాజధానికి గల అవకాశాలపై మరోసారి చర్చ ప్రారంభమైంది. రాజ ధాని హోదా మాట ఎలా ఉన్నాఐఐటీ, ఐటీఐఆర్ ఏదో ఒక భారీ ప్రాజెక్టు దక్కే అవకాశం ఉంది. సాక్షి, విశాఖపట్నం : విభజన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధాని ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు ముమ్మరమవుతోంది. ఇప్పటికే విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని రావచ్చని సూచనప్రాయంగా ప్రచారం జరుగుతున్నా అధికారికంగా ఇంకా ఖరారు కాకపోవడంతో విశాఖకు ఆ అవకాశం వస్తుందనే కొద్దిపాటి ఆశలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో సమావేశమైన శివరామకృష్ణన్ కమిటీ విశాఖలో రాజధానికి గల అవకాశాలను కూడా వివరించింది. కమిటీ రాజమండ్రి, విశాఖపట్నం, గుంటూరు తదితర ప్రాంతాల్లో పర్యటించి రాజధానికి అనువైన భూముల వివరాలు కూడా గతంలో ఆరా తీసింది. ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి నివేదికలు రప్పించుకుంది. దాని ప్రకారం విశాఖలో రాజధాని ఏర్పాటుకు 15 వేల ఎకరాల భూములు అందుబాటులో ఉన్నట్లు కమిటీ వివరించింది. విశాఖలో అనేక రకాల ప్రాథమిక సౌకర్యాలు ఇప్పటికే ఉండడం, ప్రకృతి విపత్తుల భయం కూడా ఈ ప్రాంతానికి లేకపోవడం విశాఖకు మంచి అవకాశంగా ఉన్నట్లు ఈ కమిటీ అభిప్రాయపడింది. ఇదే విషయాన్ని శనివారం సీఎంకు వివరించింది. అదే రాజమండ్రి,గుంటూరు ప్రాంతాల్లో విశాఖ కన్నా తక్కువ భూములున్నటు తేల్చింది. ఈ నేపథ్యంలో తాజాగా విశాఖలో రాజధానికి గల అవకాశాలపై మరోసారి చర్చ ప్రారంభమైంది. రాజధాని ఎంపిక తుది నిర్ణయం ప్రభుత్వం చేతిలో ఉన్నందున, ఇప్పటికే గుంటూరువైపు ఆసక్తి చూపుతుండడంతో విశాఖ వైపు మొగ్గు చూపకపోవచ్చని స్పష్టమవుతోంది. విశాఖలో ఇప్పటికే రద్దీవాతావరణం, కాలుష్యం, దానికితోడు నగరం నుంచి గ్రామీణ ప్రాంతం వరకు తీరం వెంట పారిశ్రామిక కారిడార్ వస్తోన్న నేపథ్యంలో రాజధానికి అనువైన ప్రాంతంగా పరిగణించడం లేదు. విశాఖలో భూముల లభ్యత భారీగా ఉన్నట్లు ఇప్పటికే కలెక్టర్ కూడా వివరాలు సిద్ధం చేశారు. ఒకవేళ ప్రభుత్వం విశాఖవైపు మొగ్గుచూపకపోతే ఈ భూముల్లో ఎక్కడెక్కడ ఏయే ప్రాంతంలో ఏయే ప్రాజెక్టులు తీసుకు రావచ్చనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరిస్తున్నారు. కేబినెట్లో కదలిక విభజన తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్‌కు ఐఐటీ,ఐఐఎం,గిరిజన యూనివర్సిటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఆస్పత్రులు కేంద్రం నుంచి మంజూరయ్యే అవకాశం ఉంది. వీటిలో కొన్నింటిని విశాఖలో అందుబాటులో ఉన్న భూముల్లో స్థాపించవచ్చని తెలుస్తోంది. కేబినేట్ సమావేశానికి విశాఖకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అవుటర్ రింగ్ రోడ్డు, విద్యా,వైద్య,పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధితోపాటు ఐటీఐఆర్ ఏర్పాటుకు విశాఖలో ఖాళీ భూములపై మాస్టర్‌ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. దీంతో రాజధాని రాకపోయినా కొత్త ప్రాజెక్టులు ఇక్కడకు వచ్చే వీలుంది. ఆంధ్రలో ఐఐటీ ఏర్పాటుపై ఈనెల 17న పురపాలకశాఖ మంత్రి నారాయణ ఉన్నతాధికారులతో మరోసారి చర్చించనున్నారు. ఇప్పటికే ఆయన జిల్లా కలెక్టర్‌తో చర్చలు కూడా జరిపారు. ఖాళీ భూముల వివరాలు కోరారు. ఒక వేళ రాజధాని రాకపోతే ఇక్కడ కచ్చితంగా కేంద్రం మంజూరు చేసే ఐఐటీ తీసుకు రావచ్చు. కేంద్రం హైదరాబాద్‌కు 2.19లక్షల కోట్లతో ఇప్పటికే ఐటీఆర్ ప్రకటించింది. ఆ తర్వాత ఒత్తిడి పెరగడంతో విశాఖలో రూ.50వేల కోట్లతో ఐటీఐఆర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి వెల్లడించింది. నగరంతోపాటు గ్రామీణ ప్రాంతంలో కూడా ఐటీఐఆర్‌కు కావలసిన 10 వేల ఎకరాల భూముల లభ్యతపై సర్వే నిర్వహించింది. ప్రస్తుతం విశాఖలో ఐటీఐఆర్ ప్రాజెక్టు ప్రాథమిక పనులు పది నెలల నుంచి నిలిచిపోయాయి. ఇప్పుడు భూముల లభ్యత ఎలాగూ ఉంది కాబట్టి ఏదో ఒక కీలక ప్రాజెక్టు విశాఖకు వేగంగానే దక్కే అవకాశం ఉంది. -
మోడల్ కాలనీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు
చేగుంట, న్యూస్‌లైన్: మోడల్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని కలెక్టర్ స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. బుధవారం చేగుంటలో కలెక్టర్ చేతుల మీదుగా మోడల్ కాలనీ లబ్ధిదారులు పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేగుంటలో నిరుపేదలకు ఇండ్ల స్థలాలు అందించడం, లబ్ధిదారులు సర్టిపికెట్లకన్నా ముందుగా ఇండ్ల నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. మోడల్ కాలనీ ఏర్పాటుకు ఎమ్మెల్యే ముత్యంరెడ్డి చేస్తున్న కృషిని కలెక్టర్ అభినందించారు. కాలనీలో అంతర్గత రోడ్లు విద్యుత్ సౌకర్యం తదితర వసతుల కల్పనకు ప్రత్యేక నిధులు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మోడల్ కాలనీలో వాటర్ ట్యాంకు నిర్మాణానికి, షాదీఖానా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వందశాతం ఉత్తీర్ణత సాదించండి పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించి గ్రామం పేరు నిలబెట్టాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ రాంపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సూచించారు. పదోతరగతి పరీక్షల కొసం విద్యార్థులు చదువుతున్న తీరును అడిగితెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు బెంచీలు, క్రీడా సామాగ్రి అందించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వనజాదేవి, డీఎఫ్ఓ సుధాకర్‌రెడ్డి, డీఈఓ రమేశ్, తహశీల్దార్ వెంకన్న పాల్గొన్నారు.