రూ. వేయి కోట్లు ఇస్తేనే ‘గృహ’ప్రవేశం  | Sakshi
Sakshi News home page

రూ. వేయి కోట్లు ఇస్తేనే ‘గృహ’ప్రవేశం 

Published Mon, Apr 1 2024 2:03 AM

Estimation of basic amenities in double bedroom house colonies - Sakshi

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల కాలనీల్లో ప్రాథమిక వసతుల కల్పన అంచనా

నీళ్లు, విద్యుత్, డ్రెయిన్లు లేక అవి నిరుపయోగం

నగరం, శివారు ప్రాంతాలకు రూ.650 కోట్లు 

జిల్లాల్లో రూ.455 కోట్లుంటేనే పనులు

గత ప్రభుత్వ హయాంలో రూ.201 కోట్ల కేటాయింపు

కానీ ఖర్చు చేసింది రూ.39 కోట్లే

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో మరే రాష్ట్రంలో నిర్మించని తరహాలో నిరుపేదల కోసం రూపుదిద్దుకున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం మూడొంతులు సిద్ధమైనా ఇప్పటికిప్పుడు ప్రజలు నివాసం ఉండే పరిస్థితి కనిపించటం లేదు. ఆ కాలనీలకు మంచినీళ్లు, కరెంటు, మురిగునీటి పారుదల, రోడ్లు.. లాంటి అతి ముఖ్య ప్రాథమిక వసతులు కూడా లేవు. ఇవన్నీ సిద్ధం కావాలంటే ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా రూ.వేయి కోట్లు కావాలి.  కనీస వసతుల కల్పనకు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది.

సొంత జాగా ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.5 లక్షల చొప్పున, సొంత జాగా లేనివారికి ముందుగా భూమి ఇచ్చి ఇంటి నిర్మాణ యూనిట్‌ కాస్ట్‌ నిధులు ఇస్తామని ఈ ప్రభుత్వం పేర్కొంది. కానీ ఈ ఏడాది సొంత జాగా లేని వారిని పక్కన పెట్టేసింది. ఇక ఇందిరమ్మ ఇళ్ల కోసం 66 లక్షలను మించి వచ్చిన దరఖాస్తుల విషయంలో ఎలా ముందుకెళ్లాలో కూడా రూట్‌ మ్యాప్‌ సిద్ధం కాలేదు.

1.49 లక్షల ఇళ్లు సిద్ధమైనా..
రాష్ట్రవ్యాప్తంగా 2.29 లక్షల రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టగా, 1.49 లక్షల ఇళ్లు సిద్ధమయ్యాయి. మరో 80 వేలు తుది దశలో, వివిధ స్థాయిల్లో ఉన్నాయి. ఈ ఇళ్లను కూడా ఇందిరమ్మ ఇళ్ల కిందనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని తాజాగా ప్రభుత్వం భావిస్తోంది. ఇళ్లు సిద్ధంగా ఉన్నా, ప్రజలు మాత్రం వాటిల్లో ఉండే పరిస్థితి మాత్రం ప్రస్తుతం లేదు. ఆయా కాలనీల్లో ఇళ్లనైతే నిర్మించారు గానీ, వాటిల్లో మంచినీళ్లు, విద్యుత్‌ కనెక్షన్లు లేవు.

వాననీళ్లు, మురుగునీళ్లు వెళ్లే వ్యవస్థ లేదు. రోడ్లతో అనుసంధానం కాలేదు. చాలా కాలనీలు ప్రస్తుత జనావాసాలకు దూరంగా ఉన్నందున.. చాలా వసతులు కల్పించాల్సి ఉంది. ఇటీవల అధికారులు వాటిపై సమీక్షించి లెక్కలు వేసి రూ.వేయి కోట్లకుపైగా నిధులు ఉంటే తప్ప ఆ ఏర్పాట్లు చేయటం సాధ్యం కాదని తేల్చారు. వాటి నిర్మాణం ప్రారంభించిన సమయంలో నాటి ప్రభుత్వం వేసిన అంచనాలు ఇప్పుడు పెరిగిపోయాయి. దీంతో వాటిని సవరించాల్సి ఉంది.

హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో
హైదరాబాద్‌ నగరం, దాని శివారు ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో లక్ష ఇళ్లను నిర్మించారు. వీటిల్లో కొన్నింటిలో లబ్ధిదారులు ఉంటుండగా, మిగ తా కాలనీలు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. ఆయా కాలనీల్లో మంచినీటి, మరుగునీటి పారుదలకు కావా ల్సిన ట్రంక్‌లైన్లు, విద్యుత్‌ అనుసంధాన వ్యవస్థ, వరదనీటి కాలువల కోసం దాదాపు రూ.650 కోట్లు కావాలి.

పోలీసు స్టేషన్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, బస్టాపులు, రేషన్‌ దుకాణాలు లాంటి వాటిని కూడా సమకూర్చాల్సి ఉంది. అందుకు మరికొన్ని నిధులు కా వాల్సి ఉంటుంది. ఇక జీహెచ్‌ఎంసీ వెలుపల.. జిల్లా ల్లో నిర్మించిన కాలనీల్లో మంచినీరులాంటి కనీస వస తులు కూడా లేవు. కాలనీలను నివాసయోగ్యంగా మార్చాలంటే రూ.456 కోట్లు కావాల్సి ఉంది.

మిగిలిన నిధులు ఏమయ్యాయో?
గత ప్రభుత్వం రూ.201 కోట్లను విడుదల చేసింది. వాటిల్లో రూ.39 కోట్లు మాత్రమే ఖర్చ య్యాయి. మిగతా నిధులేమయ్యాయో తేలాల్సి ఉంది. గత ప్రభుత్వం విడుదల చేయగా పోనూ మిగిలిన మొత్తాన్ని ఇప్పుడు విడుదల చేయాల్సి ఉంది. అంచనా వ్యయాలు పెరిగినందున అదనంగా వాటి అవసరం ఏర్పడింది.  నిధులు ఇవ్వటంలో జాప్యం జరిగే కొద్దీ.. ఆ ఇళ్లు నిరుపయోగంగా ఉండాల్సిందే. మరింత ఆలస్యమైతే.. నిర్మాణాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది.  

Advertisement
 
Advertisement
 
Advertisement