సాక్షి, న్యూఢిల్లీ: గ్రామ పంచాయతీల్లో ఇష్టారాజ్యంగా నిధుల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. కేంద్రం నుంచి అందే నిధులను సన్మానాలు, వినోద కార్యక్రమాల ఏర్పాటు, వాహనాల కొనుగోళ్లు వంటి వాటికి వినియోగించడంపై ఆంక్షలు విధించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అందే నిధుల వినియోగానికి మార్గదర్శకాలను రూపొందించింది. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగానే గ్రామ పంచాయతీలు నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు అందే కేంద్ర నిధుల్లో కార్యాలయ నిర్వహణ కోసం ఇచ్చే పది శాతం సొమ్ముతో... సన్మానాలు, వినోద కార్యక్రమాలు, ఏసీలు, వాహనాల కొనుగోళ్లు చేపట్టరాదని స్పష్టం చేసింది.
మౌలిక సదుపాయాలకు వెచ్చించొచ్చు..
14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు గ్రామ పంచాయతీల కు కేటాయించే నిధుల వినియోగంపై మార్గదర్శకాలను రూ పొందించడానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఒక కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఆ కమిటీ రూపొందించిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు అంగీకరించాయి. ఈ మేరకు ఆ మార్గదర్శకాలను అమలు చేయాల్సిందిగా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం... కార్యాలయ నిర్వహణ కోసం వెసులుబాటు కల్పించిన పదిశాతం నిధులను వినియోగిస్తూ గ్రామ పంచాయతీలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించరాదు. అలంకరణ, ప్రారంభోత్సవ కార్యక్రమాలు, పారితోషికం చెల్లింపు, అవార్డులు అందించడం, ప్రజా ప్రతినిధులకు టీఏ, డీఏ చెల్లించడం వంటి చేయకూడదు.
వేరే పథకాల కింద అమలవుతున్న కార్యక్రమాలకు ఈ పదిశాతం సొమ్మును వినియోగించరాదు. అయితే గ్రామ పంచాయతీ కార్యాలయానికి అవసరమైన ఫర్నీచర్, కంప్యూటర్ల కొనుగోలు, ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఈ నిధులను వినియోగించవచ్చు. గ్రామ పంచాయతీ విద్యుదీకరణ, కొనసాగుతున్న సివిల్ పనులను పరిశీలించడానికి వచ్చిన నిపుణులకు పారితోషికం చెల్లింపునకు వాడవచ్చు. ఇక గ్రామ పంచాయతీలకు ప్రస్తుతమున్న సిబ్బంది, మౌలిక వసతుల ఆధారంగా ప్రాధాన్యతలతో కూడిన జాబితాను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.
సన్మానాలు, వినోదాలకు ఖర్చు పెట్టొద్దు
Published Tue, Dec 29 2015 4:46 AM | Last Updated on Sun, Sep 3 2017 2:42 PM
Advertisement
Advertisement