Central Panchayati Raj Department
-
పంచాయతీ గ్రాంట్ల కింద రూ.969 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఈ ఆర్థిక సంవత్సరంలో పంచాయతీ గ్రాంట్ల కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,939 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు రూ.969 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయమంత్రి కె.ఎం.పాటిల్ చెప్పారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. గత ఆర్థిక సంవత్సరంలో పంచాయతీ గ్రాంట్ల కింద ఏపీకి కేటాయించిన రూ.2,625 కోట్లను విడుదల చేసినట్లు తెలిపారు. వరద సాయంగా రూ.895 కోట్లు ముందే ఇచ్చాం ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వలన సంభవించిన పంట, ఆస్తి నష్టానికి సంబంధించి రూ.895 కోట్లను రాష్ట్ర విపత్తుల ప్రతిస్పందన (ఎస్డీఆర్ఎఫ్) నిధికి కేంద్ర ప్రభుత్వ వాటాగా ముందస్తుగానే విడుదల చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్రాయ్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. గత నవంబర్‌లో సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా పెద్ద ఎత్తున పంట, ఆస్తి నష్టం జరిగినట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపిందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు సంభవించినపుడు బాధితులకు తక్షణ సాయం, పునరావాసం కల్పించేందుకు ఎస్డీఆర్ఎఫ్ నుంచి నిధులను వినియోగించేందుకు వీలుగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీకి కేటాయించిన రూ.1,192.80 కోట్లలో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.895.20 కోట్లను రెండు వాయిదాలుగా విడుదల చేసినట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించి పరిస్థితి తీవ్రతను అంచనా వేసిన అనంతరం అవసరమైతే జాతీయ విపత్తుల ప్రతిస్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) నుంచి అదనపు సహాయం అందుతుందన్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ నిధులను సహాయ చర్యలకు మాత్రమే వినియోగించాలి తప్ప నష్టపరిహారం చెల్లించడానికి కాదని స్పష్టంచేశారు. దిశ బిల్లులు న్యాయశాఖకు.. ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు – క్రిమినల్ లా (ఆంధ్రప్రదేశ్ సవరణ) బిల్లు–2019, ఆంధ్రప్రదేశ్ దిశ (మహిళలు మరియు పిల్లలపై నిర్దిష్ట నేరాలకు సంబంధించిన ప్రత్యేక న్యాయస్థానాలు) బిల్లు–2020 రాష్ట్రపతి పరిశీలన, ఆమోదం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి స్వీకరించామని వైఎస్సార్సీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌కుమార్ మిశ్రా తెలిపారు. ఈ బిల్లులపై వివిధ మంత్రిత్వ శాఖలతో సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. ఈ రెండు బిల్లులపై మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ తమ అభిప్రాయాలు, వ్యాఖ్యలను తెలిపిందన్నారు. అనంతరం ఈ బిల్లులను న్యాయశాఖకు పంపామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు – క్రిమినల్ లా (ఆంధ్రప్రదేశ్ సవరణ) బిల్లు–2019కి సంబంధించి కేంద్ర హోంశాఖ మహిళా భద్రతా విభాగం వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. -
సర్వేకు అదనంగా డ్రోన్లు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష కార్యక్రమంలో భాగంగా గ్రామ కంఠాల్లో ఇళ్లు, ఇతర ఖాళీ స్థలాలకు కొత్తగా ఆస్తి సర్టిఫికెట్ల జారీకి సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డ్రోన్ల ద్వారా సర్వే కొనసాగుతోంది. రాష్ట్రంలో ఆరు డ్రోన్లు అందుబాటులో ఉండగా, తాజాగా జిల్లాకొకటి చొప్పున మొత్తం 13 డ్రోన్లను కేంద్రం సమిత్వ పథకంలో భాగంగా సమకూర్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ అలోక్ ప్రేమ్ నగరతో పాటు సర్వే ఆఫ్ ఇండియా మాజీ చీఫ్, ప్రస్తుత కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ అడ్వయిజర్ కల్నల్ గిరీష్ బుధవారం రాష్ట్రంలో పర్యటించారు. కృష్ణా జిల్లాలో పలు గ్రామాల్లో జరుగుతున్న సర్వే ప్రక్రియను పరిశీలించారు. అనంతరం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. అక్టోబర్ 2 నాటికి దాదాపు 2,500 గ్రామాల్లో డ్రోన్ల ద్వారా సర్వే పూర్తి చేసి మ్యాప్‌లను రాష్ట్రానికి అందజేసేందుకు చర్యలు చేపడతామని కేంద్ర అధికారులు హామీ ఇచ్చారు. గ్రామాల్లో డ్రోన్ల ద్వారా సర్వే సమయంలో చెట్లు వంటివి అడ్డం వచ్చినప్పుడు, ఇంటి సరిహద్దుల మధ్య విస్తీర్ణాన్ని నిర్ధారించడంలో ఏర్పడుతున్న ఇబ్బందులను పలు జిల్లాల కలెక్టర్లు సర్వే ఆఫ్ ఇండియా ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించారు. ఆ సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలను సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధులు వివరించారు. సీసీఎల్ఏ నీరబ్‌కుమార్ ప్రసాద్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్, సర్వే ఆఫ్ ఇండియా ప్రాంతీయ డైరెక్టర్ మాలిక్, వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష కార్యక్రమం ఓఎస్డీ ఏకే నాయక్, వర్చువల్ విధానంలో పలు జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. -
ఏపీకి 15 ప్రతిష్టాత్మక పురస్కారాలు
సాక్షి, అమరావతి : గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు గాను ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏకంగా 15 పురస్కారాలు దక్కాయి. ఏటా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో ఇచ్చే అవార్డుల్లో భాగంగా 2020 సంవత్సరానికిగానూ రాష్ట్రానికి ఈ పురస్కారాలు దక్కాయి. ప్రతిష్టాత్మక అవార్డులు సాధించడంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. (సబ్‌కలెక్టర్లుగా 12 మంది ప్రొబేషనరీ ఐఏఎస్‌లు) ► 2020 సంవత్సరానికి గానూ ఈ–పంచాయత్ పురస్కార్ కేటగిరి–ఐఐ(ఎ)లో రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. 8 ప.గో. జిల్లాకు సాధారణ కేటగిరిలో జిల్లాస్థాయి పురస్కారం లభించింది. ► చిత్తూరు జిల్లా బంగారుపాలెం, గుంటూరు జిల్లా మేడికొండూరు, చిత్తూరు జిల్లా రామచంద్రాపురం, వైఎస్సార్ కడప జిల్లా చెన్నూరులకు జనరల్ కేటగిరిలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ శశక్తికరణ్ పురస్కారాలు లభించాయి. ► విజయనగరం జిల్లా బొందపల్లె మండలంలోని కొండకింద, ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని వేములకోట, గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని అంగలకుదురు గ్రామ పంచాయతీలకు ధిమాటిక్ కేటగిరీలో పురస్కారాలు దక్కాయి. ►జనరల్ కేటగిరిలో తూ.గో. జిల్లా రాయవరం మండలంలోని చెల్లూరు, ప్రకాశం జిల్లా కురిచేడు, గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని కట్టేవరం గ్రామ పంచాయతీలు పురస్కారాలు సాధించుకున్నాయి. 8 గ్రామాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవడంలో విజయనగరం జిల్లాలోని బొండపల్లి, నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ గ్రామసభ పురస్కారం కింద తూ.గో. జిల్లాలోని చెల్లూరు, చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయత్ అవార్డు కింద తూ.గో. జిల్లాలోని మూలస్థానంకు అవార్డులు దక్కాయి. -
పల్లెకూ పద్దు..
సాక్షి, అమరావతి: దేశ, రాష్ట్ర బడ్జెట్ల మాదిరిగానే రాష్ట్రంలో 13,029 గ్రామ పంచాయతీలకు వేర్వేరుగా ప్రత్యేక బడ్జెట్‌ను రూపొందించారు. దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)ల పేరుతో గ్రామ స్థాయి బడ్జెట్‌ను రూపొందించాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అన్ని రాష్ట్రాలకు సూచించింది. అందుకనుగుణంగా దేశవ్యాప్తంగా మే 1 నుంచి జూన్ 15 వరకు గ్రామ పంచాయతీల వారీగా జీపీడీపీల ఖరారు ప్రక్రియ కొనసాగుతోంది. మన రాష్ట్రంలో 13,066 గ్రామ పంచాయతీలు (ఇటీవల కొత్తగా ఏర్పడిన వాటిని కలుపుకుంటే మొత్తం 13,371 గ్రామ పంచాయతీలు) ఉండగా, 13,029 గ్రామ పంచాయతీల్లో జీపీడీపీలను రూపొందించే ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. మిగిలిన 37 గ్రామ పంచాయతీలను ఇటీవల వాటి సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేయడంతో ఆయా చోట్ల జీపీడీపీ రూపకల్పన జరగలేదు. –కేంద్రం.. రాష్ట్రాలకు విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధుల్లో సగం మొత్తాన్ని జీపీడీపీల రూపకల్పన, అమలు ఆధారంగానే విడుదల చేస్తుంది. –ఏడాదిలో ఒక్కో గ్రామ పంచాయతీకి సొంత పన్నుల రూపంలో ఎంత ఆదాయం వస్తుంది.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎంత మొత్తంలో ప్రత్యేక నిధులు అందుతాయి.. వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా గ్రామ పరిధిలో ఎంత మేర నిధులు వచ్చే అవకాశం ఉందనే అంశాలను పరిగణనలోకి తీసుకొని, గ్రామానికి అందే మొత్తం నిధులతో ఏడాది కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో ఒక్కో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు ఖరారు చేశాయి. –2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించి గ్రామ పంచాయతీల వారీగా జీపీడీపీల రూపకల్పన కొనసాగింది. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల్లో ప్రాధాన్యతనిచ్చిన అంశాలు.. ► 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి రావడంతో కొత్త నిబంధనలతో కేంద్రం.. రాష్ట్రాల వారీగా గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించింది. ► రాష్ట్రాల వారీగా జరిగిన నిధుల కేటాయింపు, మారిన నిబంధనల మేరకు తిరిగి మరోసారి 2020–21కి రివైజ్డ్ జీపీడీపీలు ఖరారు చేశారు. ► 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి అందే నిధుల్లో అంచనాగా 50 శాతం మొత్తాన్ని గ్రామంలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా వ్యవస్థలను మెరుగుపరచడానికి, భూగర్భజలం పెరగడానికి దోహదపడే కార్యక్రమాలకు కేటాయించారు. ► మిషన్ అంత్యోదయ కార్యక్రమంలో భాగంగా ఏటా గ్రామ పంచాయతీల్లో వసతులపై కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సర్వే నిర్వహిస్తుంది. దీని ద్వారా ఏ గ్రామంలో ఎలాంటి సమస్యలున్నాయో గుర్తిస్తుంది. ► సర్వే ద్వారా ఆ గ్రామంలో కొత్తగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యక్రమాలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తారు. -
ఇలా పాటించి.. అలా అరికట్టండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి జిల్లా, గ్రామస్థాయిలో స్థానిక పాలనా యంత్రాంగాలు వివిధ చర్యలు తీసుకుంటున్నాయి. ఆయా రాష్ట్రాల్లో అనుసరిస్తున్న కొన్ని ఉత్తమ పద్ధతులను ఇతర రాష్ట్రాలు కూడా వాడొచ్చని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సూచించింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అమలు చేసిన సర్వే పద్ధతులను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించవచ్చని కేంద్రం గతంలోనే పేర్కొంది. తెలంగాణ కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా..పాలనా యంత్రాంగం మొత్తం దానిమీదే అహర్నిశలు పనిచేస్తోంది. జిల్లా కలెక్టర్లు గ్రామాల్లోని ధాన్య సేకరణ కేంద్రాలను సందర్శించి, ఈ కేంద్రాలలో ఏవైనా అవకతవకలు జరుగుతున్నాయేమో తనిఖీ చేస్తున్నారు. యాదాద్రి, భైంసా కలెక్టర్లు పలు గ్రామాలకు వెళ్లి అక్కడి సెంటర్లను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి పారదర్శకమైన, జవాబుదారీ విధానం ఉండేలా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు. పంజాబ్ పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లాలోని హరా గ్రామానికి చెందిన సర్పంచ్ తమ పంచాయితీలో వైరస్ వ్యాప్తి చెందకుండా చూసేందుకు స్ఫూర్తిదాయక చర్యలు తీసుకున్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యలను ప్రతి కుటుంబానికి వివరించేందుకు ఇంటింటికీ తిరిగి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఆమే స్వయంగా ముఖానికి తొడుక్కునే మాస్కులను తయారు చేశారు. గ్రామానికి అన్ని వైపులా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఇతర గ్రామాలను అనుసంధానం చేసే రోడ్లను మూసివేశారు. సర్పంచ్ పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలను ఐసోలేషన్ కేంద్రంగా మార్చారు. కర్ణాటక గ్రామస్తులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించడానికి, రామనగర జిల్లా కనకపుర తహసీల్‌కు చెందిన ఉయంబల్లి గ్రామ పంచాయతీలోని ఆశ కార్మికులకు గ్రామ పంచాయతీ థర్మల్ స్కానర్‌ను అందించింది. రాజస్తాన్ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు నాగౌర్ జిల్లాలోని జయల్ గ్రామ పంచాయతీ పలు చర్యలు తీసుకుంది. సోడియం హైపో క్లోరైట్‌ను గ్రామాలలో స్ప్రే చేస్తున్నారు. గ్రామ పంచాయతీలో మాస్క్‌లు పంపిణీ చేస్తున్నారు. అధికారులు, సామాజిక సంస్థలు రేషన్ పంపిణీ చేస్తున్నారు. నివాసం లేని వారికి వండిన ఆహారాన్ని అందజేస్తున్నారు. సహా యక శిబిరాలను ఉన్నతాధికారులు తనిఖీ చేస్తున్నారు. పాఠశాలలను, క్వారంటైన్ కేంద్రంగా మార్చింది. హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లా, దుని పంచాయతీకి చెందిన మహిళామండళ్లు, తమ సొంత డబ్బుతో ఫేస్ మాస్క్‌లు కుట్టాయి. ఈ మహిళలు రోజుకు 200 కు పైగా ఫేస్ మాస్క్‌లు తయారుచేసి పంచాయతీలో పరిధిలోని వారికి, పేద కార్మికులకు పంపిణీ చేస్తున్నారు. కిన్నౌర్ జిల్లా రోపా వ్యాలీలోని గోబాంగ్ గ్రామ పంచాయతీ అన్ని బహిరంగ ప్రదేశాలను శుభ్రపరిచింది. భౌతిక దూరాన్ని పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. -
మండల, జిల్లా పరిషత్‌లకు కేంద్ర నిధులు
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లుగా నిధుల లేమితో కొట్టుమిట్టాడిన జిల్లా, మండల పరిషత్‌లకు ఊరట దక్కనుంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లోని పంచాయతీరాజ్ సంస్థలకు ఇచ్చే నిధులను గ్రామ పంచాయతీలతో పాటు మండల, జిల్లా పరిషత్‌లకు సైతం కేటాయించాలని నిర్ణయించారు. ఈ మేరకు పంచాయతీరాజ్ సంస్థలకు 15 ఆర్థిక సంఘం నిధుల విడుదలకు సంబంధించిన విధివిధానాలు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేసింది. శుక్రవారం రాష్ట్రాలకు సమాచారమిచ్చింది. మొండిచేయి చూపిన 14వ ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వం తనకు వచ్చే పన్ను వాటాలో కొంత మొత్తాన్ని ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రాలతో పాటు స్థానిక సంస్థలకు నేరుగా అందజేస్తుంది. 2015 ఏప్రిల్ నుంచి 2020 మార్చి మధ్య ఐదేళ్ల కాలానికి అమల్లో ఉన్న 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్రం విడుదల చేసే నిధుల్లో 100 శాతం నిధులను గ్రామ పంచాయతీలకే కేటాయిస్తూ అప్పట్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు 13వ ఆర్థిక సంఘం అమల్లో ఉన్నప్పుడు కేంద్రం ఇచ్చే నిధుల్లో 70 శాతం గ్రామ పంచాయతీలకు, 20 శాతం జిల్లా పరిషత్‌లకు, 10 శాతం మండల పరిషత్‌లకు కేటాయించేవారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా మండల, జిల్లా పరిషత్‌లు నిధులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా నిధులివ్వకపోవడంతో మండల, జిల్లా పరిషత్‌ల్లో అభివృద్ధి నిలిచిపోయింది. రాష్ట్రాలకు కొంత స్వేచ్ఛ కేంద్రం విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధుల్లో 70–85 శాతం నిధులను గ్రామ పంచాయతీలకు.. 10–25 శాతం నిధులను మండల పరిషత్‌లకు.. 5–15 శాతం నిధులను జిల్లా పరిషత్‌లకు కేటాయించాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రాలను ఆదేశించింది. నిర్ణీత పరిమితికి లోబడి ఎంతెంత కేటాయింపులు చేయాలన్న దానిపై రాష్ట్రాలకు కొంత స్వేచ్ఛ ఇస్తున్నట్టు పేర్కొంది. రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉన్నచోట(ఆంధ్రప్రదేశ్ కాదు) గ్రామ పంచాయతీలకు 70–85 శాతం.. జిల్లా పరిషత్‌లకు 15–30 శాతం నిధులు కేటాయించాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,625 కోట్లు 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీలోని గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లకు కలిపి రూ.2,625 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రానికి రూ.1,847 కోట్లు కేటాయించింది. పరిమితికి లోబడి ఏ పంచాయతీరాజ్ సంస్థకు ఎన్ని నిధులను కేటాయిస్తారన్న వివరాలను ఏప్రిల్‌లోగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖకు తెలియజేస్తే జూన్‌లో మొదటి విడత నిధులు విడుదల చేస్తామని కేంద్రం వెల్లడించింది. -
సన్మానాలు, వినోదాలకు ఖర్చు పెట్టొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: గ్రామ పంచాయతీల్లో ఇష్టారాజ్యంగా నిధుల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. కేంద్రం నుంచి అందే నిధులను సన్మానాలు, వినోద కార్యక్రమాల ఏర్పాటు, వాహనాల కొనుగోళ్లు వంటి వాటికి వినియోగించడంపై ఆంక్షలు విధించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అందే నిధుల వినియోగానికి మార్గదర్శకాలను రూపొందించింది. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగానే గ్రామ పంచాయతీలు నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు అందే కేంద్ర నిధుల్లో కార్యాలయ నిర్వహణ కోసం ఇచ్చే పది శాతం సొమ్ముతో... సన్మానాలు, వినోద కార్యక్రమాలు, ఏసీలు, వాహనాల కొనుగోళ్లు చేపట్టరాదని స్పష్టం చేసింది. మౌలిక సదుపాయాలకు వెచ్చించొచ్చు.. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు గ్రామ పంచాయతీల కు కేటాయించే నిధుల వినియోగంపై మార్గదర్శకాలను రూ పొందించడానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఒక కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఆ కమిటీ రూపొందించిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు అంగీకరించాయి. ఈ మేరకు ఆ మార్గదర్శకాలను అమలు చేయాల్సిందిగా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం... కార్యాలయ నిర్వహణ కోసం వెసులుబాటు కల్పించిన పదిశాతం నిధులను వినియోగిస్తూ గ్రామ పంచాయతీలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించరాదు. అలంకరణ, ప్రారంభోత్సవ కార్యక్రమాలు, పారితోషికం చెల్లింపు, అవార్డులు అందించడం, ప్రజా ప్రతినిధులకు టీఏ, డీఏ చెల్లించడం వంటి చేయకూడదు. వేరే పథకాల కింద అమలవుతున్న కార్యక్రమాలకు ఈ పదిశాతం సొమ్మును వినియోగించరాదు. అయితే గ్రామ పంచాయతీ కార్యాలయానికి అవసరమైన ఫర్నీచర్, కంప్యూటర్ల కొనుగోలు, ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఈ నిధులను వినియోగించవచ్చు. గ్రామ పంచాయతీ విద్యుదీకరణ, కొనసాగుతున్న సివిల్ పనులను పరిశీలించడానికి వచ్చిన నిపుణులకు పారితోషికం చెల్లింపునకు వాడవచ్చు. ఇక గ్రామ పంచాయతీలకు ప్రస్తుతమున్న సిబ్బంది, మౌలిక వసతుల ఆధారంగా ప్రాధాన్యతలతో కూడిన జాబితాను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.