ఇలా పాటించి.. అలా అరికట్టండి | Central Panchayati Raj Department says about Best practices to control corona outbreaks | Sakshi
Sakshi News home page

ఇలా పాటించి.. అలా అరికట్టండి

Published Wed, Apr 22 2020 1:58 AM | Last Updated on Wed, Apr 22 2020 10:36 AM

Central Panchayati Raj Department says about Best practices to control corona outbreaks - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి జిల్లా, గ్రామస్థాయిలో స్థానిక పాలనా యంత్రాంగాలు వివిధ చర్యలు తీసుకుంటున్నాయి. ఆయా రాష్ట్రాల్లో అనుసరిస్తున్న కొన్ని ఉత్తమ పద్ధతులను ఇతర రాష్ట్రాలు కూడా వాడొచ్చని కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ సూచించింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అమలు చేసిన సర్వే పద్ధతులను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించవచ్చని కేంద్రం గతంలోనే పేర్కొంది. 

తెలంగాణ
కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా..పాలనా యంత్రాంగం మొత్తం దానిమీదే అహర్నిశలు పనిచేస్తోంది. జిల్లా కలెక్టర్లు గ్రామాల్లోని ధాన్య సేకరణ కేంద్రాలను సందర్శించి, ఈ కేంద్రాలలో ఏవైనా అవకతవకలు జరుగుతున్నాయేమో తనిఖీ చేస్తున్నారు. యాదాద్రి, భైంసా కలెక్టర్లు పలు గ్రామాలకు వెళ్లి అక్కడి సెంటర్లను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి పారదర్శకమైన, జవాబుదారీ విధానం ఉండేలా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు. 

పంజాబ్‌
పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ జిల్లాలోని హరా గ్రామానికి చెందిన సర్పంచ్‌ తమ పంచాయితీలో వైరస్‌ వ్యాప్తి చెందకుండా చూసేందుకు స్ఫూర్తిదాయక చర్యలు తీసుకున్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యలను ప్రతి కుటుంబానికి వివరించేందుకు ఇంటింటికీ తిరిగి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఆమే స్వయంగా ముఖానికి తొడుక్కునే మాస్కులను తయారు చేశారు. గ్రామానికి అన్ని వైపులా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఇతర గ్రామాలను అనుసంధానం చేసే రోడ్లను మూసివేశారు. సర్పంచ్‌ పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలను ఐసోలేషన్‌ కేంద్రంగా మార్చారు.

కర్ణాటక
గ్రామస్తులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించడానికి, రామనగర జిల్లా కనకపుర తహసీల్‌కు చెందిన ఉయంబల్లి గ్రామ పంచాయతీలోని ఆశ కార్మికులకు గ్రామ పంచాయతీ థర్మల్‌ స్కానర్‌ను అందించింది.

రాజస్తాన్‌
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు నాగౌర్‌ జిల్లాలోని జయల్‌ గ్రామ పంచాయతీ పలు చర్యలు తీసుకుంది. సోడియం హైపో క్లోరైట్‌ను గ్రామాలలో స్ప్రే చేస్తున్నారు. గ్రామ పంచాయతీలో మాస్క్‌లు పంపిణీ చేస్తున్నారు. అధికారులు, సామాజిక సంస్థలు రేషన్‌ పంపిణీ చేస్తున్నారు. నివాసం లేని వారికి వండిన ఆహారాన్ని అందజేస్తున్నారు. సహా యక శిబిరాలను ఉన్నతాధికారులు తనిఖీ చేస్తున్నారు.  పాఠశాలలను, క్వారంటైన్‌ కేంద్రంగా మార్చింది.  

హిమాచల్‌ ప్రదేశ్‌
కిన్నౌర్‌ జిల్లా, దుని పంచాయతీకి చెందిన మహిళామండళ్లు, తమ సొంత డబ్బుతో ఫేస్‌ మాస్క్‌లు కుట్టాయి. ఈ మహిళలు రోజుకు 200 కు పైగా ఫేస్‌ మాస్క్‌లు తయారుచేసి పంచాయతీలో పరిధిలోని వారికి, పేద కార్మికులకు పంపిణీ చేస్తున్నారు. కిన్నౌర్‌ జిల్లా రోపా వ్యాలీలోని గోబాంగ్‌ గ్రామ పంచాయతీ అన్ని బహిరంగ ప్రదేశాలను శుభ్రపరిచింది. భౌతిక దూరాన్ని పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement