సాక్షి, అమరావతి: దేశ, రాష్ట్ర బడ్జెట్‌ల మాదిరిగానే రాష్ట్రంలో 13,029 గ్రామ పంచాయతీలకు వేర్వేరుగా ప్రత్యేక బడ్జెట్‌ను రూపొందించారు. దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)ల పేరుతో గ్రామ స్థాయి బడ్జెట్‌ను రూపొందించాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అన్ని రాష్ట్రాలకు సూచించింది. అందుకనుగుణంగా దేశవ్యాప్తంగా మే 1 నుంచి జూన్ 15 వరకు గ్రామ పంచాయతీల వారీగా జీపీడీపీల ఖరారు ప్రక్రియ కొనసాగుతోంది. మన రాష్ట్రంలో 13,066 గ్రామ పంచాయతీలు (ఇటీవల కొత్తగా ఏర్పడిన వాటిని కలుపుకుంటే మొత్తం 13,371 గ్రామ పంచాయతీలు) ఉండగా, 13,029 గ్రామ పంచాయతీల్లో జీపీడీపీలను రూపొందించే ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. మిగిలిన 37 గ్రామ పంచాయతీలను ఇటీవల వాటి సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేయడంతో ఆయా చోట్ల జీపీడీపీ రూపకల్పన జరగలేదు.
–కేంద్రం.. రాష్ట్రాలకు విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధుల్లో సగం మొత్తాన్ని జీపీడీపీల రూపకల్పన, అమలు ఆధారంగానే విడుదల చేస్తుంది.
–ఏడాదిలో ఒక్కో గ్రామ పంచాయతీకి సొంత పన్నుల రూపంలో ఎంత ఆదాయం వస్తుంది.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎంత మొత్తంలో ప్రత్యేక నిధులు అందుతాయి.. వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా గ్రామ పరిధిలో ఎంత మేర నిధులు వచ్చే అవకాశం ఉందనే అంశాలను పరిగణనలోకి తీసుకొని, గ్రామానికి అందే మొత్తం నిధులతో ఏడాది కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో ఒక్కో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు ఖరారు చేశాయి.
–2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించి గ్రామ పంచాయతీల వారీగా జీపీడీపీల రూపకల్పన కొనసాగింది.
గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల్లో ప్రాధాన్యతనిచ్చిన అంశాలు..
► 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి రావడంతో కొత్త నిబంధనలతో కేంద్రం.. రాష్ట్రాల వారీగా గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించింది.
► రాష్ట్రాల వారీగా జరిగిన నిధుల కేటాయింపు, మారిన నిబంధనల మేరకు తిరిగి మరోసారి 2020–21కి రివైజ్డ్ జీపీడీపీలు ఖరారు చేశారు.
► 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి అందే నిధుల్లో అంచనాగా 50 శాతం మొత్తాన్ని గ్రామంలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా వ్యవస్థలను మెరుగుపరచడానికి, భూగర్భజలం పెరగడానికి దోహదపడే కార్యక్రమాలకు కేటాయించారు.
► మిషన్ అంత్యోదయ కార్యక్రమంలో భాగంగా ఏటా గ్రామ పంచాయతీల్లో వసతులపై కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సర్వే నిర్వహిస్తుంది. దీని ద్వారా ఏ గ్రామంలో ఎలాంటి సమస్యలున్నాయో గుర్తిస్తుంది.
► సర్వే ద్వారా ఆ గ్రామంలో కొత్తగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యక్రమాలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment