ఐదేళ్లలో అన్నింటికీ న్యాక్‌ గుర్తింపు | NAAC Identification for all in five years | Sakshi
Sakshi News home page

ఐదేళ్లలో అన్నింటికీ న్యాక్‌ గుర్తింపు

Published Sun, Dec 1 2019 4:11 AM | Last Updated on Sun, Dec 1 2019 4:11 AM

NAAC Identification for all in five years - Sakshi

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, యూనివర్సిటీలు రానున్న ఐదేళ్లలో నేషనల్‌ అసెస్‌మెంట్, అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌(న్యాక్‌) గ్రేడింగ్‌ సాధించేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. అన్ని విద్యాసంస్థలకు న్యాక్‌ గుర్తింపు ఉండాలని, వర్సిటీలకు న్యాక్‌ ఏ–గ్రేడ్‌ ఉండాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో దశలవారీగా విద్యాసంస్థలు న్యాక్‌ గ్రేడింగ్‌ సాధించేలా ‘ఇంటర్నల్‌ క్వాలిటీ అసెస్‌మెంట్‌ సెల్‌’ను ఏర్పాటు చేస్తోంది.

విద్యారంగ నిపుణులు, పలువురు ఆచార్యులు ఇందులో సభ్యులుగా ఉంటారు. న్యాక్, దాని గ్రేడింగ్‌ ప్రాధాన్యం, ఆ గుర్తింపు లేకుంటే వచ్చే నష్టాలు వివరిస్తూ దాన్ని ఎలా సాధించాలనే దానిపై విద్యాసంస్థలకు ఉన్నత విద్యామండలి మార్గనిర్దేశం చేయడం ప్రారంభించింది. ఇప్పటికే కాకినాడ జేఎన్‌టీయూ పరిధిలోని ఇంజనీరింగ్‌ కాలేజీలతో సమావేశం నిర్వహించింది. అనంతపురం జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కాలేజీలతో సమావేశాలను ఏర్పాటు చేయనున్నారు. ఇతర వర్సిటీల పరిధిలోని యూజీ, పీజీ కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు న్యాక్‌ గుర్తింపును సొంతం చేసుకునేలా ప్రణాళికను అమల్లోకి తేనున్నారు. ఇంటర్నల్‌ క్వాలిటీ అసెస్‌మెంట్‌సెల్‌ నుంచి కాలేజీలకు సహకారం అందిస్తారు.


80 కాలేజీలకే గుర్తింపు 
రాష్ట్రంలో పాత విశ్వవిద్యాలయాలకు తప్ప గత దశాబ్ద కాలంలో కొత్తగా ఏర్పడిన వాటిలో కొన్నింటికి ఇప్పటికీ న్యాక్‌ గ్రేడింగ్‌ లేకపోవడం గమనార్హం. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ గుర్తింపు లేని వర్సిటీలు కూడా ఉన్నాయి. కొన్ని వర్సిటీలకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ ర్యాంకు సైతం దక్కలేదు. ఇక కాలేజీల్లో కేవలం 80 కాలేజీలకు న్యాక్‌ గుర్తింపు ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఆయా విద్యాసంస్థల అభివృద్ధికి నిధులేవీ ఇవ్వలేదు. అన్ని రకాల మౌలిక వసతులు, బోధన, బోధనేతర సిబ్బంది ఉన్న విద్యాసంస్థలకే న్యాక్‌ గుర్తింపు దక్కుతుంది. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక అన్ని విద్యా సంస్థలు న్యాక్‌ గుర్తింపు సాధించడానికి వీలుగా సహకారం అందిస్తున్నారు. 

న్యాక్‌ గుర్తింపు తప్పనిసరి
న్యాక్‌ గుర్తింపు ఉంటేనే విద్యాసంస్థలకు మనుగడ ఉంటుంది. అన్ని కాలేజీలు న్యాక్‌ గుర్తింపు పొందేలా మార్గనిర్దేశం చేస్తున్నాం. నూతన విద్యావిధానం ప్రకారం అన్ని విద్యాసంస్థలకూ న్యాక్‌ గుర్తింపు తప్పనిసరి. రాష్ట్రంలో 2 వేలకు పైగా కాలేజీలు ఉండగా, కేవలం 80 సంస్థలకు మాత్రమే న్యాక్‌ గుర్తింపు ఉంది. 2030 కల్లా అన్ని సంస్థలు న్యాక్‌ గుర్తింపు సాధించాలి. కొత్త వర్సిటీలు కూడా న్యాక్‌ గ్రేడింగ్‌ సాధించాల్సి ఉంది. 
–ప్రొఫెసర్‌హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement