naac identify
-
‘న్యాక్’ వద్దు బాబోయ్!
సాక్షి, హైదరాబాద్: ‘నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్’(న్యాక్) గుర్తింపు అంటేనే ప్రైవేటు కాలేజీలు పెదవి విరుస్తున్నాయి. దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న భావన వ్యక్తం చేస్తున్నాయి. విద్యా సంస్థల్లో ఉన్నత ప్రమాణాలకు సంబంధించి న్యాక్ ఇచ్చే గుర్తింపు పొందాలని ఉన్నతాధికారులు చెబుతున్నా.. వారి ప్రయత్నాలకు కాలేజీల యాజమాన్యాలు స్పం దించకుండా, సవాలక్ష కారణాలు చూపుతున్నా యి. అంతిమంగా కరోనా కష్టకాలం దాటాక చూ ద్దాంలే.. అంటూ పక్కకు తప్పుకుంటున్నాయి. ఈ పరిస్థితిపై రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కూడా నిస్సహాయత వ్యక్తం చేస్తోంది. గత నెల న్యాక్ తన నివేదికను వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నత విద్య ప్రమాణాలను మెరుగుపరచాలని సూచించింది. జాతీయ స్థాయిలో నాక్ గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థలు 21 శాతం ఉంటే, తెలంగాణలో అది 11 శాతమే ఉం ది. పరిశోధన, మౌలిక వసతుల కల్పనలో ఉన్నత విద్యా సంస్థలు వెనుకబడి ఉండటమే దీనికి కారణమని ఆ నివేదిక పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 1,976 ఉన్నత విద్యాసంస్థలుంటే, అందులో కేవలం 141 ఉన్నత విద్యాసంస్థలకే న్యాక్ గుర్తింపు లభించింది. ఉన్నత విద్యా ప్రమాణాలు పాటిస్తున్న కాలేజీలు (న్యాక్ గుర్తింపు ఉన్నవి) పట్టణ ప్రాంతాల్లోనే 72 వరకు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో న్యాక్ గుర్తింపుకోసం కాలేజీలు ఏమాత్రం ప్రయత్నించడం లేదని స్పష్టమవుతోంది. అయితే ఈ పరిస్థితులపై విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎంత చెప్పినా వినేదే లేదు.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలోనూ మార్పులు అవసరమని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ సూచిస్తోంది. జాతీయ సాంకేతిక విద్యామండలి ఈ దిశగా అనేక ప్రయత్నాలు చేస్తోంది. ముందుగా విద్యా సంస్థల్లో ఉన్నత ప్రమాణాలు పెంచాలని నిర్ణయించింది. రాష్ట్రాల ఉన్నత విద్యామండళ్ల ముందు ఈ లక్ష్యాలను పెట్టింది. దీంతో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి న్యాక్ గుర్తింపు కోసం విస్తృతంగా ప్రచారం మొదలు పెట్టింది. గుర్తింపు కోసం ప్రయత్నించే విద్యా సంస్థలకు రూ.లక్ష పారితోషికం ఇస్తామని కూడా ప్రకటించింది. కానీ ప్రైవేటు కాలేజీలు మాత్రం దీనికి ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదు. పైగా ప్రస్తుత పరిస్థితుల్లో కాలేజీల నిర్వహణే కష్టంగా ఉందని, న్యాక్ గుర్తింపు తెచ్చుకునే స్థాయిలో ప్రమాణాలు మెరుగు చేయడం కష్టమని చెబుతున్నాయి. కారణాలేంటి? న్యాక్ గుర్తింపు పొందాలంటే ముందుగా కాలేజీల్లో మౌలిక వసతులు మెరుగు పర్చాలి. పాఠ్యప్రణాళికను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దాలి. అత్యున్నత ప్రమాణాలున్న ఫ్యాకల్టీని అందుబాటులోకి తేవాలి. పరిశోధన, ప్రాజెక్టు వర్క్ మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఇలాంటివన్నీ చేయాలంటే ప్రతీ కాలేజీ కనీసం రూ.10 నుంచి 25 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు పెరిగే కొద్దీ ఏటా మౌలిక వసతుల కల్పనకు డబ్బు వెచ్చించాలి. ఇలా చేస్తే విద్యార్థుల ఫీజులు భారీగా పెంచాల్సి ఉంటుందని యాజమాన్యాలు అంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కాలేజీల్లో దీనివల్ల ఆర్థికంగా నష్టం వస్తుందని చెబుతున్నాయి. కరోనా వచ్చాక ఫీజుల వసూలే కష్టంగా ఉందని, అదనంగా ఫీజులు పెంచితే వసూలు సాధ్యమయ్యే పనే కాదంటున్నాయి. ఈ కారణంగానే న్యాక్‌కు దూరంగా ఉంటున్నామని చెబుతున్నాయి. అనుకున్నంత స్పందన లేదు న్యాక్ గుర్తింపు దిశగా కాలేజీలను ప్రోత్సహిస్తూనే ఉన్నాం. కానీ అనుకున్నంత స్పందన కనిపించని మాట వాస్తవమే. న్యాక్ నిబంధనలు పాటించాలంటే కాలేజీలు పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించాలి. ఇదే సమస్య అని యాజమాన్యాలు భావిస్తున్నాయి. అయితే, ఉన్నత ప్రమాణాల దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ -
ఐదేళ్లలో అన్నింటికీ న్యాక్ గుర్తింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, యూనివర్సిటీలు రానున్న ఐదేళ్లలో నేషనల్ అసెస్మెంట్, అక్రిడిటేషన్ కౌన్సిల్(న్యాక్) గ్రేడింగ్ సాధించేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. అన్ని విద్యాసంస్థలకు న్యాక్ గుర్తింపు ఉండాలని, వర్సిటీలకు న్యాక్ ఏ–గ్రేడ్ ఉండాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో దశలవారీగా విద్యాసంస్థలు న్యాక్ గ్రేడింగ్ సాధించేలా ‘ఇంటర్నల్ క్వాలిటీ అసెస్మెంట్ సెల్’ను ఏర్పాటు చేస్తోంది. విద్యారంగ నిపుణులు, పలువురు ఆచార్యులు ఇందులో సభ్యులుగా ఉంటారు. న్యాక్, దాని గ్రేడింగ్ ప్రాధాన్యం, ఆ గుర్తింపు లేకుంటే వచ్చే నష్టాలు వివరిస్తూ దాన్ని ఎలా సాధించాలనే దానిపై విద్యాసంస్థలకు ఉన్నత విద్యామండలి మార్గనిర్దేశం చేయడం ప్రారంభించింది. ఇప్పటికే కాకినాడ జేఎన్టీయూ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీలతో సమావేశం నిర్వహించింది. అనంతపురం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలతో సమావేశాలను ఏర్పాటు చేయనున్నారు. ఇతర వర్సిటీల పరిధిలోని యూజీ, పీజీ కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు న్యాక్ గుర్తింపును సొంతం చేసుకునేలా ప్రణాళికను అమల్లోకి తేనున్నారు. ఇంటర్నల్ క్వాలిటీ అసెస్‌మెంట్‌సెల్ నుంచి కాలేజీలకు సహకారం అందిస్తారు. 80 కాలేజీలకే గుర్తింపు రాష్ట్రంలో పాత విశ్వవిద్యాలయాలకు తప్ప గత దశాబ్ద కాలంలో కొత్తగా ఏర్పడిన వాటిలో కొన్నింటికి ఇప్పటికీ న్యాక్ గ్రేడింగ్ లేకపోవడం గమనార్హం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు లేని వర్సిటీలు కూడా ఉన్నాయి. కొన్ని వర్సిటీలకు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ ర్యాంకు సైతం దక్కలేదు. ఇక కాలేజీల్లో కేవలం 80 కాలేజీలకు న్యాక్ గుర్తింపు ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఆయా విద్యాసంస్థల అభివృద్ధికి నిధులేవీ ఇవ్వలేదు. అన్ని రకాల మౌలిక వసతులు, బోధన, బోధనేతర సిబ్బంది ఉన్న విద్యాసంస్థలకే న్యాక్ గుర్తింపు దక్కుతుంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక అన్ని విద్యా సంస్థలు న్యాక్ గుర్తింపు సాధించడానికి వీలుగా సహకారం అందిస్తున్నారు. న్యాక్ గుర్తింపు తప్పనిసరి న్యాక్ గుర్తింపు ఉంటేనే విద్యాసంస్థలకు మనుగడ ఉంటుంది. అన్ని కాలేజీలు న్యాక్ గుర్తింపు పొందేలా మార్గనిర్దేశం చేస్తున్నాం. నూతన విద్యావిధానం ప్రకారం అన్ని విద్యాసంస్థలకూ న్యాక్ గుర్తింపు తప్పనిసరి. రాష్ట్రంలో 2 వేలకు పైగా కాలేజీలు ఉండగా, కేవలం 80 సంస్థలకు మాత్రమే న్యాక్ గుర్తింపు ఉంది. 2030 కల్లా అన్ని సంస్థలు న్యాక్ గుర్తింపు సాధించాలి. కొత్త వర్సిటీలు కూడా న్యాక్ గ్రేడింగ్ సాధించాల్సి ఉంది. –ప్రొఫెసర్‌హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
ఎస్‌ఆర్‌ఐటీకి న్యాక్ గుర్తింపు
శింగనమల: మండల పరిధిలోని రోటరీపురంలో ఉన్న ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని కళాశాల కరస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి తెలిపారు. బుధవారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఆగస్టు 21, 22, 23 తేదీల్లో కేంద్ర బృందం కళాశాలలో సౌకర్యాలు, విద్య, వసతులను పరిశీలించారన్నారు. అదేవిధంగా విద్యార్థులకు లభించిన ఉద్యోగ అవకాశాలు, విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించారన్నారు. అదే నెల 27న బెంగళూరులో నిర్వహించిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్‌ను ప్రకటించారన్నారు. కళాశాలను స్థాపించిన పదేళ్లలోనే ఇంతటి ఘనత సాధించడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందన్నారు. ఈ విజయం సమష్టి కృషితోనే సాధ్యమైందన్నారు. జిల్లాలో ఏకైన న్యాక్ ఏ–గ్రేడు గుర్తింపు కళాశాల సీఈఓ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ రాష్టంలోని 300 ఇంజినీరింగ్ కళాశాలలో 50 కళాశాలలకు న్యాక్ అక్రిడిటేషన్ ఉందన్నారు. అనంతపురం జేఎన్టీయూ పరిధిలోని కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో 110 ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా.. వీటిలో 20 కళాశాలకు న్యాక్ అక్రిడిటేషన్ గుర్తింపు లభించిందన్నారు. ఇందులో 7 కళాశాలలకు న్యాక్ ఏ గ్రేడ్ గుర్తింపు ఉండగా.. వీటిలో ఎస్‌ఆర్‌ఐటీకి కూడా చోటు దక్కిందన్నారు. జిల్లా విషయానికొస్తే న్యాక్ ఏ గ్రేడ్ కలిగిన ఏకైక ఇంజినీరింగ్ కళాశాల ఎస్ఆర్ఐటీ మాత్రమేనన్నారు. అత్యున్నత విద్యా ప్రమాణాలతో తమ కళాశాల ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుందని ప్రిన్సిపాల్ సుబ్బారెడ్డి తెలిపారు. ఎంబీఏ అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నామని.. మరో ఆరు నెలల్లో మరో అరుదైన గుర్తింపు తమ కళాశాల సొంతమవుతుందన్నారు. ఏడాదికి 150 మందికి ఉద్యోగాలు వివిధ రాష్ట్రాల్లోని అత్యున్నత సాఫ్ట్వేర్ కంపెనీల్లో తమ కళాశాల విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు కళాశాల టీపీఓ రంజిత్‌రెడ్డి తెలిపారు. ఏడాదిలో 150 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయన్నారు. రీసెర్చ్‌లపై ప్రేత్యక దృష్టి సారించి ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.