‘న్యాక్‌’ వద్దు బాబోయ్‌! | Telangana Private Colleges Ignore NAAC Recognition | Sakshi
Sakshi News home page

‘న్యాక్‌’ వద్దు బాబోయ్‌!

Published Mon, Nov 29 2021 4:01 AM | Last Updated on Mon, Nov 29 2021 4:01 AM

Telangana Private Colleges Ignore NAAC Recognition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌’(న్యాక్‌) గుర్తింపు అంటేనే ప్రైవేటు కాలేజీలు పెదవి విరుస్తున్నాయి. దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న భావన వ్యక్తం చేస్తున్నాయి. విద్యా సంస్థల్లో ఉన్నత ప్రమాణాలకు సంబంధించి న్యాక్‌ ఇచ్చే గుర్తింపు పొందాలని ఉన్నతాధికారులు చెబుతున్నా.. వారి ప్రయత్నాలకు కాలేజీల యాజమాన్యాలు స్పం దించకుండా, సవాలక్ష కారణాలు చూపుతున్నా యి.

అంతిమంగా కరోనా కష్టకాలం దాటాక చూ ద్దాంలే.. అంటూ పక్కకు తప్పుకుంటున్నాయి. ఈ పరిస్థితిపై రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కూడా నిస్సహాయత వ్యక్తం చేస్తోంది. గత నెల న్యాక్‌ తన నివేదికను వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నత విద్య ప్రమాణాలను మెరుగుపరచాలని సూచించింది. జాతీయ స్థాయిలో నాక్‌ గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థలు 21 శాతం ఉంటే, తెలంగాణలో అది 11 శాతమే ఉం ది. పరిశోధన, మౌలిక వసతుల కల్పనలో ఉన్నత విద్యా సంస్థలు వెనుకబడి ఉండటమే దీనికి కారణమని ఆ నివేదిక పేర్కొంది.

రాష్ట్రంలో మొత్తం 1,976 ఉన్నత విద్యాసంస్థలుంటే, అందులో కేవలం 141 ఉన్నత విద్యాసంస్థలకే న్యాక్‌ గుర్తింపు లభించింది. ఉన్నత విద్యా ప్రమాణాలు పాటిస్తున్న కాలేజీలు (న్యాక్‌ గుర్తింపు ఉన్నవి) పట్టణ ప్రాంతాల్లోనే 72 వరకు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో న్యాక్‌ గుర్తింపుకోసం కాలేజీలు ఏమాత్రం ప్రయత్నించడం లేదని స్పష్టమవుతోంది. అయితే ఈ పరిస్థితులపై విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.  

ఎంత చెప్పినా వినేదే లేదు.. 
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలోనూ మార్పులు అవసరమని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ సూచిస్తోంది. జాతీయ సాంకేతిక విద్యామండలి ఈ దిశగా అనేక ప్రయత్నాలు చేస్తోంది. ముందుగా విద్యా సంస్థల్లో ఉన్నత ప్రమాణాలు పెంచాలని నిర్ణయించింది. రాష్ట్రాల ఉన్నత విద్యామండళ్ల ముందు ఈ లక్ష్యాలను పెట్టింది. దీంతో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి న్యాక్‌ గుర్తింపు కోసం విస్తృతంగా ప్రచారం మొదలు పెట్టింది.

గుర్తింపు కోసం ప్రయత్నించే విద్యా సంస్థలకు రూ.లక్ష పారితోషికం ఇస్తామని కూడా ప్రకటించింది. కానీ ప్రైవేటు కాలేజీలు మాత్రం దీనికి ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదు. పైగా ప్రస్తుత పరిస్థితుల్లో కాలేజీల నిర్వహణే కష్టంగా ఉందని, న్యాక్‌ గుర్తింపు తెచ్చుకునే స్థాయిలో ప్రమాణాలు మెరుగు చేయడం కష్టమని చెబుతున్నాయి.  

కారణాలేంటి? 
న్యాక్‌ గుర్తింపు పొందాలంటే ముందుగా కాలేజీల్లో మౌలిక వసతులు మెరుగు పర్చాలి. పాఠ్యప్రణాళికను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దాలి. అత్యున్నత ప్రమాణాలున్న ఫ్యాకల్టీని అందుబాటులోకి తేవాలి. పరిశోధన, ప్రాజెక్టు వర్క్‌ మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఇలాంటివన్నీ చేయాలంటే ప్రతీ కాలేజీ కనీసం రూ.10 నుంచి 25 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు పెరిగే కొద్దీ ఏటా మౌలిక వసతుల కల్పనకు డబ్బు వెచ్చించాలి.

ఇలా చేస్తే విద్యార్థుల ఫీజులు భారీగా పెంచాల్సి ఉంటుందని యాజమాన్యాలు అంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కాలేజీల్లో దీనివల్ల ఆర్థికంగా నష్టం వస్తుందని చెబుతున్నాయి. కరోనా వచ్చాక ఫీజుల వసూలే కష్టంగా ఉందని, అదనంగా ఫీజులు పెంచితే వసూలు సాధ్యమయ్యే పనే కాదంటున్నాయి. ఈ కారణంగానే న్యాక్‌కు దూరంగా ఉంటున్నామని చెబుతున్నాయి.  

అనుకున్నంత స్పందన లేదు 
న్యాక్‌ గుర్తింపు దిశగా కాలేజీలను ప్రోత్సహిస్తూనే ఉన్నాం. కానీ అనుకున్నంత స్పందన కనిపించని మాట వాస్తవమే. న్యాక్‌ నిబంధనలు పాటించాలంటే కాలేజీలు పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించాలి. ఇదే సమస్య అని యాజమాన్యాలు భావిస్తున్నాయి. అయితే, ఉన్నత ప్రమాణాల దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  
– ప్రొఫెసర్‌ ఆర్‌. లింబాద్రి, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement