ఎస్‌ఆర్‌ఐటీకి న్యాక్ గుర్తింపు
శింగనమల: మండల పరిధిలోని రోటరీపురంలో ఉన్న ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్ కళాశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని కళాశాల కరస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి తెలిపారు. బుధవారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఆగస్టు 21, 22, 23 తేదీల్లో కేంద్ర బృందం కళాశాలలో సౌకర్యాలు, విద్య, వసతులను పరిశీలించారన్నారు. అదేవిధంగా విద్యార్థులకు లభించిన ఉద్యోగ అవకాశాలు, విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించారన్నారు. అదే నెల 27న బెంగళూరులో నిర్వహించిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్ కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్‌ను ప్రకటించారన్నారు. కళాశాలను స్థాపించిన పదేళ్లలోనే ఇంతటి ఘనత సాధించడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందన్నారు. ఈ విజయం సమష్టి కృషితోనే సాధ్యమైందన్నారు.
జిల్లాలో ఏకైన న్యాక్ ఏ–గ్రేడు గుర్తింపు
కళాశాల సీఈఓ జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్టంలోని 300 ఇంజినీరింగ్ కళాశాలలో 50 కళాశాలలకు న్యాక్ అక్రిడిటేషన్ ఉందన్నారు. అనంతపురం జేఎన్‌టీయూ పరిధిలోని కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో 110 ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా.. వీటిలో 20 కళాశాలకు న్యాక్ అక్రిడిటేషన్ గుర్తింపు లభించిందన్నారు. ఇందులో 7 కళాశాలలకు న్యాక్ ఏ గ్రేడ్ గుర్తింపు ఉండగా.. వీటిలో ఎస్‌ఆర్‌ఐటీకి కూడా చోటు దక్కిందన్నారు. జిల్లా విషయానికొస్తే న్యాక్ ఏ గ్రేడ్ కలిగిన ఏకైక ఇంజినీరింగ్ కళాశాల ఎస్‌ఆర్‌ఐటీ మాత్రమేనన్నారు. అత్యున్నత విద్యా ప్రమాణాలతో తమ కళాశాల ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుందని ప్రిన్సిపాల్ సుబ్బారెడ్డి తెలిపారు. ఎంబీఏ అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నామని.. మరో ఆరు నెలల్లో మరో అరుదైన గుర్తింపు తమ కళాశాల సొంతమవుతుందన్నారు.
ఏడాదికి 150 మందికి ఉద్యోగాలు
వివిధ రాష్ట్రాల్లోని అత్యున్నత సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో తమ కళాశాల విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు కళాశాల టీపీఓ రంజిత్‌రెడ్డి తెలిపారు. ఏడాదిలో 150 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయన్నారు. రీసెర్చ్‌లపై ప్రేత్యక దృష్టి సారించి ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.