ఎస్వీయూలో టీడీపీ మూకల వీరంగం
వీసీ చాంబర్‌లోకి దూసుకెళ్లి ఫైళ్ల విసిరివేత
రాజీనామా చేసి వెళ్లిపో అంటూ వీసీపై దాడి
వాటర్ బాటిళ్లు, కర్రలు వీసీపైకి విసిరేసిన టీడీపీ కార్యకర్తలు
భయంతో పరుగులు తీసిన వర్సిటీ ఉద్యోగులు
సమాచారమిచ్చినా పట్టించుకోని పోలీసు యంత్రాంగం
వీఎస్‌యూలోనూ టీడీపీ నాయకుల దాడి
శిలాఫలకాలు ధ్వంసం
తిరుపతి (తిరుపతి జిల్లా): చదువుల నిలయాలైన విశ్వవిద్యాలయాలపై తెలుగుదేశం పార్టీ మూకలు దాడులకు దిగుతున్నాయి. రెండు రోజుల క్రితం వైద్య విశ్వవిద్యాలయంపై దాడికి పాల్పడిన టీడీపీ వర్గాలు శుక్రవారం రాయలసీమకే తలమానికమైన తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (వీఎస్‌యూ) పై దాడులకు తెగబడ్డాయి. సుమారు 50 మంది టీడీపీ కార్యకర్తలు శుక్రవారం ఎస్వీయూలోకి కర్రలు, రాడ్లతో చొరబడ్డారు.
నేరుగా పరిపాలన భవనంలోకి ప్రవేశించి, వైస్ చాన్సలర్ (వీసీ) శ్రీకాంత్‌రెడ్డి చాంబర్‌లోకి దూసుకెళ్లారు. ఆయనపైకి నీళ్ల సీసాలు, కర్రలు విసురుతూ దాడి చేశారు. అక్కడ ఉన్న ఫైళ్లను విసిరేశారు. ‘వెంటనే రాజీనామా చేయరా.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పడిపోయినా ఇంకా సీటులో కూర్చున్నావా’ అని హెచ్చరిస్తూ అసభ్య పదజాలంతో దుర్భాషలాడారు. వీసీపై టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తున్నారని ఉద్యోగులు సమాచారమిచ్చినా పోలీసులు పట్టించుకున్న పాపానపోలేదు. ఓ పక్క టీడీపీ మూకల వీరంగం, మరోపక్క పోలీసులు పట్టించుకోకపోవడంతో వర్సిటీ సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు.
వారి సీట్ల నుంచి లేచి పరుగులు పెట్టారు. మహిళా ఉద్యోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. వీసీపై దాడులు, ఉద్యోగులు పరుగులు తీస్తున్న దృశ్యాలను కొన్ని మీడియా సంస్థలు ఉత్సాహంగా వీడియోలు తీయడం కనిపించింది. టీడీపీ దాడులు, ఆ మీడియా అత్యుత్సాహాన్ని వర్సిటీ సిబ్బంది, ప్రజలు తప్పుపడుతున్నారు. వర్సిటీకి సంబంధం లేని బయట వ్యక్తులు వర్సిటీలోని ప్రవేశించడం దారుణమని, ఆ మీడియా సంస్థల తీరూ గర్హనీయమని విమర్శిస్తున్నారు.
వీఎస్‌యూలో శిలాఫలకాలను ధ్వంసం చేసిన టీడీపీ నాయకులు
వెంకటాచలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ) లో పలు శిలాఫలకాలను టీడీపీ నాయకులు ధ్వంసం చేశారు. వీఎస్‌యూలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరుతో సెంట్రల్ లైబ్రరీని వైస్ చాన్సలర్ జీఎం సుందరవల్లి ఇటీవల ప్రారంభించి, శిలాఫలకాలను ఆవిష్కరించారు.
శుక్రవారం ఉదయం పెద్ద సంఖ్యలో వర్సిటీలోకి ప్రవేశించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు వీరంగం సృష్టించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉన్న శిలాఫలకాలను ధ్వంసం చేశారు. అనంతరం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన భవనం వద్దకు చేరుకున్నారు. వీఎస్‌యూలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పేరుతో భవనాన్ని ఎలా నిర్మిస్తారని, ఆయన విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేశారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు.
పరిపాలన భవనంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించాలని, లేకుంటే తామే ధ్వంసం చేస్తామని అధికారులను హెచ్చరించారు. దేవాలయం వంటి విశ్వవిద్యాలయంలో టీడీపీ నాయకులు దాడులు చేయడంపై అధ్యాపకులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment