డిజిటల్‌ బాటలో యూనివర్సిటీలు | AP Govt has taken steps to digitize all the universities in the state | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ బాటలో యూనివర్సిటీలు

Published Mon, Mar 2 2020 4:46 AM | Last Updated on Mon, Mar 2 2020 4:46 AM

AP Govt has taken steps to digitize all the universities in the state - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలను డిజిటలైజ్‌ చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. వర్సిటీల కార్యకలాపాలను ఆన్‌లైన్‌లోనే.. అత్యంత పారదర్శకంగా కొనసాగించనున్నారు. విద్యా శాఖపై సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సాధ్యమైనంత త్వరగా వర్సిటీల్లో అన్ని కార్యకలాపాలను ఆన్‌లైన్‌లో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(విద్యా శాఖ) సతీష్‌చంద్ర కొద్దిరోజుల క్రితం వర్సిటీలకు ప్రత్యేక సర్క్యులర్‌ జారీ చేశారు. వర్సిటీల సమాచారం మొత్తం ప్రభుత్వ సర్వర్‌తో అనుసంధానించాలని పేర్కొన్నారు. మీట నొక్కగానే మొత్తం సమాచారం తెలిసేలా ఉండాలని సూచించారు.  

వర్సిటీల మధ్య ఇంటర్నల్‌ నెట్‌వర్క్‌
యూనివర్సిటీల్లోని అన్ని వ్యవస్థలు, కార్యకలాపాలను కంప్యూటరీకరణ చేస్తారు.  సేవలను ఆన్‌లైన్‌లోనే అందిస్తారు. పేపర్‌ వర్కు అనేది లేకుండా అన్ని వర్సిటీల్లోనూ ఈ–ఆఫీసులను అభివృద్ధి పర్చనున్నారు. ఈ–ఆఫీసు ద్వారా అన్ని విభాగాలను అనుసంధానిస్తారు. విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్‌ సేవలను అందించడానికి వర్సిటీలన్నింటి మధ్య ఇంటర్నల్‌ నెట్‌వర్కును ఏర్పాటు చేస్తారు. ఈ  ప్రక్రియలో విశ్వవిద్యాలయాలకు సహకరించేందుకు నోడల్‌ ఏజెన్సీగా సెంటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, సిస్టమ్స్‌ వ్యవహరించనుంది. 

ప్రవేశాలు ఆన్‌లైన్‌లోనే..
యూనివర్సిటీలు, వాటి పరిధిలోని కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అలాగే వర్సిటీలు, వాటి పరిధిలోని కాలేజీల్లో సిబ్బంది, విద్యార్థులకు బయోమెట్రిక్‌ హాజరును తప్పనిసరి చేయనున్నారు. దానిపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా జియో బయోమెట్రిక్‌ను అనుసరిస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇవి అమల్లోకి తీసుకురావాలని వర్సిటీలకు విద్యాశాఖ తాజా ఆదేశాలు జారీ చేసింది.  

పరిశోధనలకు పెద్దపీట  
అన్ని విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు పెద్దపీట వేయాలని ఉన్నత విద్యాశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం పలు యూనివర్సిటీల్లో పరిశోధనలు మొక్కుబడిగా మాత్రమే కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పరిశోధనలకు అత్యధికంగా నిధులు అందిస్తోంది. పరిశోధనలు లేనందున రాష్ట్ర యూనివర్సిటీలు ఆ నిధులను పొందలేకపోతున్నాయి. పరిశోధనలపై దృష్టి పెట్టడం ద్వారా విశ్వవిద్యాలయాలు నూతన ఆవిష్కరణల పరంగానే కాకుండా బోధనాభ్యసన ప్రక్రియలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల్లో వాటి సామర్థ్యాలను బట్టి ఒక నిర్దిష్ట రంగంలో  పరిశోధనల కోసం ఒక సమగ్ర నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వర్సిటీల ఉపకులపతులు, ఆయా విభాగాధిపతులను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement